వైరల్ వీడియో. ‘ఐఫోన్’ సమాధి.

మాస్కో:
యాపిల్ ఐఫోన్ అంటే మీకెంత ఇష్టం అంటే చచ్చేంత ఇష్టం అనే జవాబు వస్తే ఆశ్చర్యం లేదు. కానీ ఓ రష్యా అమ్మాయికి మాత్రం నిజంగానే అంత ఇష్టం. అందుకని ఆమె తండ్రి చనిపోయిన కూతురు సమాధిని అచ్చంగా ఐఫోన్ తరహాలో చేయించాడు. ఆ శ్మశాన వాటికలో అందరి దృష్టినీ ఆకర్షించే విధంగా ఇంతెత్తున ఠీవిగా నిలబడిన ఆ సమాధి ఇప్పుడు రష్యాలోనే టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. 25 ఏళ్ల రీటా షమీవా జనవరి 2016లో ఏదో కారణంతో మరణించింది. ఆ బాధతోనే ఇటీవలి కాలం వరకు ఆమె తండ్రి రాయిస్ షమీవ్ రోజులు గడుపుతున్నాడు. తన కూతురి కోసం ఏదైనా అనూహ్యమైనది, అద్భుతమైనది చేయాలనుకున్నాడు. ఐఫోన్ అంటే బోల్డంత ఇష్టపడే రీటా సమాధిని అచ్చు అలాగే చేయించాలనుకున్నాడు. వెంటనే మరణించినవారికి బహుమానాలు తయారుచేసే ఓ సైబీరియన్ కంపెనీని సంప్రదించాడు. ఆ కంపెనీ ఇచ్చిన ఈ ఐడియా ఆయనకు విపరీతంగా నచ్చింది.
బసాల్ట్ రాతితో నల్లని ఐఫోన్ మాదిరిగా 5 అడుగుల ఎత్తైన ఓ సమాధి ఫలకం తయారుచేయించాడు. దానిపై తన కూతురి ఫోటోని స్క్రీన్ సేవర్ గా పెట్టించాడు. ఇప్పుడు రష్యాలోని ఉఫా నగరంలో యుజ్నోయె శ్మశానవాటికలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది రీటా సమాధి. హఠాత్తుగా శ్మశానంలో సమాధుల మధ్య కనిపించిన ఐఫోన్ ని చూసి తాము చూస్తున్నది కలో, నిజమో నమ్మలేకపోయారు నగరవాసులు. ఆ తర్వాత ఈ వింత ఆ నోటా ఈ నోటా దేశమంతటా పాకింది. ఇప్పుడు ఇదో పెద్ద వార్తగా మారింది.