వ్యభిచార చట్టంతో ఒరిగిందేంటి?

న్యూఢిల్లీ;
వ్యభిచార చట్ట ప్రకారం శిక్షలో లింగ వివక్షతని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయింది. విచారణ సందర్భంగా ప్రస్తుతం ఉన్న ఈ చట్టంతో ప్రజలకేదైనా మేలు జరిగిందా? అని సుప్రీంకోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భర్త అనుమతితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదని చెబుతున్న ఈ చట్టంతో ఏ మేలు జరిగిందని అడిగింది. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఐపీసీలోని సెక్షన్ 497పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వివాహ వ్యవస్థ పవిత్రతకు ముప్పుగా పరిణమించగల వ్యభిచారాన్ని శిక్షార్హమైన నేరంగా చూడాల్సిందేనని కేంద్రం వాదించింది.వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. వివాహేతర సంబంధాలు వివాహ వ్యవస్థను, కుటుంబ సంబంధాలను దెబ్బ తీస్తాయని తెలిపింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదిస్తూ వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు వివాహేతర సంబంధాలను వ్యభిచార నేరంగా పరిగణించాలని చెప్పారు. భర్త అనుమతితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నపుడు ఆ పెళ్లికి పవిత్రత ఎక్కడుందని బెంచ్ ప్రశ్నించింది. ఈ అంగీకారం అర్థం ఏంటని నిలదీసింది. సెక్షన్ 497 చెప్పే వ్యభిచార నేరం నియమాలతో ప్రజలకే మేలు జరిగిందో చెప్పమని అడిగింది.
158 ఏళ్ల క్రితం రూపొందించిన ఐపీసీలోని సెక్షన్ 497 ఎవరైనా పురుషుడు ఇతరుల భార్యతో అతని అంగీకారం లేకుండా సంభోగించినపుడు దానిని నేరంగా పరిగణించాలని, వ్యభిచారంగా గుర్తించాలని చెబుతోంది. అయితే ఈ చట్టం వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడికి శిక్ష విధిస్తోంది తప్ప స్త్రీకి ఎలాంటి శిక్ష ఉండదు. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని జనవరి 5న అత్యున్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపింది.