వ్యవసాయానికి ఉపాధి హామీ పథకంతో లింకు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు.

హైదరాబాద్:
వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడం వలన రైతుల ఆదాయాన్ని పెంపొందించవచ్చునని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో 2022 సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం, ఉపాధిహామీ అనుసంధానం పాలసీ ని రూపొందించే అంశంపై నీతి ఆయోగ్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్కు షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ఉపాధి హామి పథకం ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పన ద్వారా వారి ఆదాయం పెరిగినట్లు గుర్తించామన్నారు. పంటల సాగు ఖర్చును తగ్గించటం, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల నిర్మాణం ద్వారా వారి ఆదాయం పెంపొందించవచ్చని ఆయన తెలిపారు. ఇన్ పుట్ ఖర్చులు తగ్గించడం వలన మేలైన ఫలితాలు లభిస్తాయని , ఉపాధి హామి పథకం ద్వారా గ్రామంలో రైతులకు అవసరమైన ఆస్తుల కల్పనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. కూలీల వేతనాలు స్ధిరంగా ఉన్నాయి కాని వ్యవసాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు సర్వేలు తెలుపుతున్నాయని ఆయన తెలిపారు.
వ్యవసాయ అనుబంధరంగాలపై దృష్టి సారించడం ద్వారా రైతుల ఆదాయం పెంపొందించవచ్చని ఆయన సూచించారు. ఉపాధి హామి పథకంలో కొన్ని మార్పులను చేయడం ద్వారా రైతులకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలలో సమర్ధవంతంగా అమలు అవుతున్న ఉపాధి హామి పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. మైక్రో ఇరిగేషన్, హార్టికల్చర్, డైరీ, గొర్రెల పెంపకం తదితర రంగాలను ప్రోత్సహించాలన్నారు. రైతుల ఆదాయం పెంపొందించడానికి 9 అంశాలైన 1. Natural Resource Management 2. Infrastructure Support 3. Enable Healthy Credit Environment 4. Research & Development and Extension Services 5. Risk Management – Integrated approaches 6.Marketing Strategies 7.Scaling up and Aggregation 8. Off Farm/ Non-Form/Wage Income 9. Strengthening/ Widening Partnership పై దృష్టి పెట్టాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపొందించడానికి అమలు చేస్తున్నవివిధ పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వివరించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి కొరకు రైతుబంధు పథకం ప్రారంబించామని, సంవత్సరానికి ఎకరానికి 8000 రూపాయలు అందిస్తున్నదని ఆయన తెలిపారు. ఆగస్టు 15 నుండి 5 లక్షల రూపాయల ఉచితబీమాను ప్రతి రైతుకు అందిస్తున్నమని ఆయన తెలిపారు. భూసర్వే ద్వారా తెలంగాణలో 98 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడానికి,పాడిపరిశ్రమ, చేపలపెంపకం, గొర్రెల పెంపకం ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హరితహారం పథకాన్ని పెద్దఎత్తున అమలు చేస్తున్నందున ఉపాధి హామిలో వేతనం కింద అధిక నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇన్ పుట్ ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంపొందించినప్పుడే రైతులకు ఆదాయం పెరుగుతుందని అన్నారు.
వ్యవసాయశాఖ కార్యదర్శి పార్ధసారధి స్వాగతోపన్యాసం చేస్తూ, రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలను వివిధ వర్గాల నుండి తీసుకోవడానికి ఈ వర్కు షాపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తగు సూచనలు అందించాలని ఆయన కోరారు.
ఈ సదస్సులో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ , వ్యవసాయ శాఖ సంయిక్త కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, నీతి ఆయోగ్ సలహాదారు ఎ.కె.జైన్ , ఎన్.ఐ.ఆర్.డి డైరెక్టర్ జనరల్ Dr.W.R.Reddy, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మరియు తెలంగాణ, ఏపి, కర్ణాటక,తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రాంతాల వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, నీతి ఆయోగ్ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు, ఎన్ జీవోలు పాల్గొన్నారు.