వ్యవసాయ యాంత్రీకరణ సదస్సు సోమవారం:ముఖ్యమంత్రి కేసీఆర్.

హైదరాబాద్:
పంటకాలనీల ఏర్పాటు దిశగా, వ్యవసాయ సంపూర్ణ యాంత్రీకరణ దిశగా, ఆహార శుద్ధి కర్మాగారాల (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు) ఏర్పాటు దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోవాలని, ఈ బృహత్ కార్యక్రమానికి వ్యవసాయ విస్తరణ అధికారులు (“ఏఇఓ” లు) బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రైతు భీమా పథకానికి సంబంధించి సోమవారం హెచ్.ఐ.సి.సి కన్వెన్షన్ హాల్, మాదాపూర్, హైదరాబాద్ లో జరగనున్న వ్యవసాయ విస్తరణ అధికారుల, జిల్లా వ్యవసాయ అధికారుల, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ల విస్తృత స్థాయి సమావేశంలో, ఈ విషయాలను సమగ్రంగా చర్చించాలని సీఎం అన్నారు. ప్రగతి భవన్ లో శనివారం మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో, సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితు అధ్యక్షుడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి, బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, కమీషనర్ జగన్మోహన్, సీఎం కార్యదర్శి శ్రీమతి స్మిత సభర్వాల్, మాజే ఎమ్మేల్యే చందర్ రావు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికి చేయాల్సిందంతా చేస్తున్నామనీ, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో వుంచడం, పంట పెట్టుబడి, రైతుకు భీమా లాంటివి ప్రభుత్వం సమకూరుస్తున్నదనీ, ఈ నేపథ్యంలో మూడు-నాలుగు సంవత్సరాలు పంటలు కనుక బాగా పండితే రైతు భవిష్యత్ ఉజ్వలంగా వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాల క్లస్టర్ కు నియమించిన వ్యవసాయ విస్తరణ అధికారి ఆ క్లస్టర్ లో వుండే ప్రతి రైతు వివరం తన దగ్గర వుంచుకోవాలని, అన్ని క్లస్టర్ల సమాచారం మొత్తం మంత్రి కంప్యూటర్లో నిక్షిప్తం కావాలని సీఎం అన్నారు. ఐదువేల ఎకరాల సమగ్ర సమాచారం “ఏయీఓ” దగ్గరుండాలి అని సీఎం చెప్పారు. రైతులు ఏ పంట ఎప్పుడు వేయాలో, ఆయన భూమికి ఏ పంట అనుకూలమో, ఏది వేస్తె మంచిదో విస్తరణ అధికారి రైతుకు తెలియచేయాలని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో పండే పంటలకు ఇక్కడా, ఇరుగు-పొరుగు రాష్ట్రాలలో మార్కెటింగ్ సౌకర్యం ఏర్పాట్లు కూడా “ఏయీఓ” పర్యవేక్షించాలని సీఎం అన్నారు. రైతు చనిపోతే, ఆయన భీమా సొమ్మును క్లెయిం దగ్గర నుండి నామినీకి చేరేవరకు “ఏయీఓ” బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. భీమా పత్రాల నామినేషనల స్వీకరణ బాధ్యత కూడా “ఏయీఓ” లదే అని ఆయన అన్నారు. “ఏయీఓ” లు అధికారుల్లా కాకుండా రైతులకు ఒక విధమైన ప్రోత్సాహకర్తల్లా వ్యవహరించాలని, వాళ్ళు టీం లీడర్లలాగా వుండాలని సీఎం చెప్పారు.

రాష్ట్రం మొత్తం ప్రతి మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ ముమ్మరంగా సాగాలని సీఎం అన్నారు. యాంత్రీకరణకు సంబంధించి ప్రస్తుతం ఏమేం అందుబాటులో వున్నాయి, ఇంకా ఏమేం కావాలో అధ్యయనం చేయాలన్నారు. యాంత్రీకరణ దిశగా అవసరమైన యంత్రాలను సరఫరా చేయాలను అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు అవి అందుబాటులో వుండేలా చూడాలన్నారు. నర్సరీ దగ్గరనుండి పంట కోతల దాకా అన్ని స్థాయిలలో వ్యవసాయ యాంత్రీకరణ జరగాలని అన్నారు. రాబోయే సంవత్సరం బడ్జేట్లో యాంత్రీకరణకు నిదులుంటాయని సీఎం అన్నారు. పండించే పంటలకు అనువుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కావాలన్నారు సీఎం. ఎలాంటి యూనిట్ ఎక్కడ వస్తే బాగుంటుందో అధ్యయనం చేయాలన్నారు. అలాగే పళ్ళ తోటలున్న చోట అవి ఎంత విస్తీర్ణంలో వున్నాయో అంచనా వేసి, వాటికి అనుగుణంగా పల్ప్ కర్మాగారాల ఏర్పాటు జరగాలని సీఎం సూచించారు.
రైతులకు మూస పద్ధతిలో, సాంప్రదాయంగా వేసే విధానంలో, పంటలు పండించే అలవాటున్నదనీ, ఇది మార్చాలనీ, వీటికి బదులుగా లాభసాటి పంటలు పండించే నైపుణ్యాన్ని రైతులకు “ఏయీఓ” లు తెలియచేప్పాలనీ ముఖ్యమంత్రి అన్నారు. పెద్ద ఎత్తున పూలు, పళ్ళు, కూరగాయలు దిగుమతి చేసుకునే పద్ధతికి స్వస్థి చెప్పాలనీ, మనమే ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని కూడా సీఎం అన్నారు. వ్యవసాయం లాభసాటి అయ్యేంతవరకు ఆ శాఖ మంత్రి, రైతు సమన్వయ సమితు రాష్ట్ర అధ్యక్షుడు నిర్విరామంగా కృషి చేయాలని సీఎం వాళ్ళతో అన్నారు. పాలమూరు, సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తై నీళ్ళు రావడం మొదలైతే, భారతదేశంలో వ్యవసాయ పరంగా ప్రధమ శ్రేణి రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పారు సీఎం.

రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించిన సమగ్ర సమాచారంతో, రైతులకు అవగాహన కలిగించడానికి, వారిలో మరింతస్థైర్యం నింపడానికి, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర నుండి ఆయన సంతకంతో, ప్రతి రైతుకూ, ఉత్తరాలు రాయాలని సీఎం అన్నారు. భీమా పత్రాల పంపిణీ జరుగుతున్నప్పుడు, ఆగస్ట్ 15, 2018 నుండి గ్రామ-గ్రామాన రైతుల సమావేశాలు-సదస్సులు నిర్వహించాలనీ, వాటిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని, ఆ సమావేశాలలో రైతులకు వారికి సంబంధించిన వివిధ విషయాలపై అవగాహన కలిగించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

సోమవారం జూన్ 4, 2018 న, హెచ్.ఐ.సి.సి కన్వెన్షన్ హాల్, మాదాపూర్, హైదరాబాద్ లో జరగనున్న వ్యవసాయ విస్తారణాదికారుల, జిల్లా వ్యవసాయ అధికారుల, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని సందేశం ఇస్తారు.