శంషాబాద్ లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు.

హైదరాబాద్:
శంషాబాద్‌లో అనుమతి లేకుండా వెలుస్తున్న లాడ్జీలలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. బంగారం రవాణా చేసే మూడు ముఠాలకు చెందిన నిందితులు లాడ్జిలో ఇటీవల పట్టుబడిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరిన బంగారాన్ని మొదటగా లాడ్జీలకు చేర్చుతున్నారు. అక్కడ నుంచి ఓ ముఠా ముంబైకి, కేరళ మీదుగా దుబాయ్‌కి మరో ముఠా స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైన విషయం విదితమే. లాడ్జిల్లో ఉండే పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు.దశాబ్దం క్రితం శంషాబాద్‌లో అసలు లాడ్జీలు ఉండేవి కావు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో సిద్ధాంతి బస్తీ నుంచి కొత్వాల్‌గూడ చౌరస్తా, మహవీర్‌ బిల్డర్స్‌, గణేశ్‌ చాంబర్స్‌, ఆర్బీనగర్‌, బస్టాండ్‌, అంబేద్కర్‌ చౌరస్తా, ఎయిర్‌పోర్టు చౌరస్తా, కాముం చెరువు, కూకుట్లబాయి, సామా ఎన్‌క్లేవ్‌ తదితర ప్రాంతాల్లోని హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి రెండు వైపుల లాడ్జీలు, హోటళ్లు వెలిశాయి. వాటితోపాటు ఎయిర్‌పోర్టు చౌరస్తాను కలిపే వివిధ రోడ్లలో ఓ మోస్తరు నుంచి పెద్దస్థాయి లాడ్జీలు ఏర్పాటయ్యాయి. జాతీయ రహదారి పక్కన ఉండే హైక్లాస్‌ లాడ్జీల్లో గది ధర సగటున పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఉంటోంది. కింది స్థాయి లాడ్జీల్లో మూడు నుంచి ఐదు వందల రూపాయలు. కొన్ని లాడ్జీల వారు హోటళ్లను కూడా నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకే భోజనం లభించడంతో గిరాకీ పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతోంది. శంషాబాద్‌ లో లాడ్జీల వ్యాపారానికి మంచి లాభాలు వస్తుండంతో ఇతరత్రా వ్యాపారాలు చేసే వారు కూడా జాతీయ రహదారి పక్కన పెద్ద పెద్ద భవనాలు నిర్మించి అందులో లాడ్జి, హోటల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు.శంషాబాద్‌లోని జాతీయ రహదారి పక్కన ఉన్న హోటళ్లకు తప్ప లాడ్జీలకు ఎలాంటి అనుమతులు లేవని గ్రామపంచాయతీ అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు.
కాముం చెరువు సమీపంలో ఉన్న కొన్ని లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారిని ఇక్కడి ఓ లాడ్జిలో దారుణంగా హత్యచేశారు. శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా గోనెసంచిలో కట్టి పదిహేను కిలోమీటర్ల దూరంలో పడేశారు. తొలుత మిస్టరీగా మారిన ఈ ఘటనను స్థానిక పోలీసులు హత్యగా నిర్ధారించి నిందితులను అరెస్టు చేశారు. మరో లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రశ్నిస్తే… ‘ఇప్పటి వరకు పలుసార్లు వేశ్యలను తీసుకొచ్చి వ్యభిచారం చేశాం. అప్పుడు పట్టుకోలేదు. ఇప్పుడెందుకు పట్టుకున్నారు’ అని నిందితులు వాగ్వాదానికి దిగారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఓ దుస్తుల దుకాణం పై అంతస్తులో గల లాడ్జిలో వ్యభిచారం జరుగుతుంటే బస్తీవాసులు దాడిచేసి పోలీసులకు పట్టించారు. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు సర్వసాధారణమైపోయాయని స్థానికులు అంటున్నారు. కొన్నింటిపై పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ మరికొన్నింటిలో కొనసాగుతున్నాయని బాహాటంగానే చెప్పుకుంటున్నారు