శ్రీకాకుళ పోరాట యోధుడు ఇక లేరు.

గుఱ్ఱం సీతారాములు.
శ్రీకాకుళ పోరాటం లో స్వయంగా పాల్గొని శ్రీకాకుళ కుట్రకేసులో డెబ్బై ఏడవ ముద్దాయిగా నేరారోపణ చేయబడిన షేక్ మసూద్ బాబా@బాబా ఈ రోజు బెజవాడ లో అమరులు అయ్యారు. ఆయన డైరీ లో నా ఫోన్ నెంబర్ ఉంది అని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. బాబా ఈ తరానికి పెద్దగా తెలియక పోవచ్చు. శివసాగర్ తో సన్నిహితంగా మెలిగిన ఎవరికయినా బాబా తెలియాలి.నేను శివుణ్ణి అనేక సార్లు బాబా ఇంట్లోనే కలిసా.బాబా అత్యంత నిరుపేద. గుండెజబ్బు అదనపు అర్హత. మొగల్రాజ పురం సున్నం బట్టీ సెంటర్ చుట్టూ అనేక కాల్పనిక కథలు మన మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ గొప్ప గొప్ప కాల్పనిక కథా నాయికా నాయకుల కథల మధ్య బడుగు జీవి బాబా ప్రస్తావనే ఉండదు. చరిత్ర ఎప్పుడూ గుడ్డిదే కనుక. నేను ఎప్పుడు బెజవాడ పోయినా బాబాను కలిసేవాన్ని. ముప్పాళ్ళ రంగనాయకమ్మ అంబేద్కర్ మీద విషం చిమ్మినప్పుడు శివసాగర్ తో ‘అంబేద్కర్ సూర్యూడు’ దగ్గర ఉండి రాయించింది బాబా. నాకు తెలిసి ఆ కొండ కింద బాబా ఇంట్లో ఈగల దోమల కలిమి లేముల మధ్య ఆ పుస్తకం రాసాడు.అందులో కొన్ని నాకూ పోస్ట్ చేసేవాడు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఆ పుస్తకం బాబా చేతుల మీదుగానే ఆవిష్కరణ జరిగినట్టు యాది. ఆనాడు తారకం సర్ కూడా ఆమీటింగ్ లో ఉన్నాడు. జీవితాంతం నమ్మిన విలువల కోసం తమ ఇంటిని వంటిని ప్రయోగశాల చేసుకున్న అరుదైన వ్యక్తి బాబా. దానికితోడు గుండె జబ్బు. అప్పుడప్పుడూ ఖమ్మం డా.గోపీనాథ్ దగ్గరకు రావడం ఆయన కాసిన్ని మందులు డబ్బులూ ఇవ్వడం చేసేవాడు. ఇక రావడం అనవసరం అనుకున్నాడో ఏమో మొరాయించిన గుండె తో జరిగిన యుద్ధం లో బాబా పోయాడు.నాకు తెలిసి తన సహచరి, M.SC చదివి ఏదో ప్రైవేటు కళాశాల లో పనిచేస్తున్న ఒక పెళ్ళికాని కూతురు, కొడుకు ఉండేవాడు. ఆ అమ్మయే నాకు అప్పుడప్పుడూ ఫోన్ చేసేది.రెండేళ్లుగా ఏ కబురూ లేదు ఈ రోజు నిష్క్రమణ కబురు తప్ప.ఈ చరిత్ర గమనానికి తమ నెత్తురును, రాళ్ళూ, ఉసికా చేసిన ఉప్పరి బ్రతుకులు ఏమాత్రం సడీ సప్పుడు లేకుండా మాయం అవుతాయి.ఇప్పుడు బాబా చరిత్ర ధూళిలో ధూళి అయ్యింది.
బాబా ఒకటి తెలుసా !
నీ చెలికాడు తిరిగి వస్తాను తిరిగి లేస్తాను అనే కాల్పనిక గీతాలు ఆలపించి పోయినోడు ఇంకాతిరిగి రాలేదు.కనబడితే అడుగు గుర్రం ఇలా వ్యంగ్యంగా అన్నాడు అని.
చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరిన కారడివిలాంటి చరిత్రలో నీ పాదముద్రలు ఏనాడో చెరిగి పోయి ఉంటాయి.ఆ నెత్తుటి బాకీ ఇంకా తీరాల్సే ఉంది.
ఇక శెలవు.
పెద్దాయానా అల్విదా.