సంగారెడ్డిలో పద్మినీరెడ్డి’కమలం’.

హైదరాబాద్;
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. అవకాశం ఇస్తే తాను సంగారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని బీజేపీలోచేరిక సందర్భంగా ఆమె తెలియజేశారు. తన భార్య బీజేపీలో చేరినట్లు సమాచారం తెలిసిన వెంటనే టిపిసిసి ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ గజ్వేల్‌ లో ఎన్నికల ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటు ఇవ్వాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న కారణంగానే పద్మినీరెడ్డిబీజేపీలో చేరినట్లు సమాచారం అందుతున్నది. కొంతకాలంగా ఆమె సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ తరఫున మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి పోటీ చేస్తున్నారు. పద్మినీరెడ్డిబీజేపీ నుంచి పోటీ చేయడం సంగారెడ్డి రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆందోల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్నీ ఇప్పటికే ఉధృతం చేశారు.