సచిన్ కొడుకు అదరగొట్టేశాడు.

ముంబయ్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ కేవలం తండ్రి పేరుతోనే జట్టులో కొనసాగుతున్నాడనే విమర్శకుల నోళ్లను మూయించాడు. శనివారం సూరత్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ అద్భుత బౌలింగ్ తో అదరగొట్టేశాడు. వినూ మన్కడ్ అండర్ 19 ట్రోఫీ మ్యాచ్ లో అర్జున్ 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో ముంబై జట్టు సునాయాసంగా విజయం సాధించింది. ఈ ఏడాది జూలైలో శ్రీలంక టూర్ కి వెళ్లిన అండర్ 19 భారత జట్టులో అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. కానీ ఆ పర్యటనలో అర్జున్ పెద్దగా రాణించలేదు. కేవలం 3 వికెట్లు తీసి 14 పరుగులే చేయగలిగాడు. అప్పటి నుంచి అతని సెలక్షన్ ని పలువురు ప్రశ్నించారు. ఈ మ్యాచ్ లో రాణించిన అర్జున్ తనను విమర్శిస్తున్నవారి నోళ్లు మూయించాడు. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ రెండో బంతికే అర్జున్ గుజరాత్ ఓపెనర్ వర్థమాన్ దత్తేష్ షాని ఔట్ చేశాడు. ఆ తర్వాత ఎల్ఎం కోచర్ వికెట్ పడగొట్టాడు. అర్జున్ దెబ్బకి గుజరాత్ జట్టు 142 పరుగులకే ప్యాకప్ అయిపోయింది. అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. అతనో అద్భుత క్రీడాకారుడని గుజరాత్ సీనియర్ టీమ్ కోచ్ విజయ్ పటేల్ ప్రశంసించాడు.టీమిండియా నెట్ ప్రాక్టీస్ లో దిగ్గజ ఆటగాళ్లకు బౌలింగ్ చేసే అవకాశం అర్జున్ కి దక్కింది. అప్పుడు భారత కోచ్ అతనికి కొన్ని మెళకువలు నేర్పించాడు. తమ జట్టు ఓటమికి అర్జున్ టెండూల్కర్ బౌలింగే కారణమన్న గుజరాత్ అండర్ 19 కోచ్.. అతను పిచ్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ బంతిని చక్కగా నియంత్రిస్తూ బౌల్ చేయడంతో తమ బ్యాట్స్ మెన్ ఆడలేక పోయారని విశ్లేషించాడు.