సమయం లేదు మిత్రమా!!

రేవంత్ రెడ్డి వ్యవహారం ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో పాజిటివ్ పరిణామం.స్పోర్టివ్ గా తీసుకోవలసిన అంశం. కానీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.నిన్న గాక మొన్న వచ్చిన వ్యక్తికి ‘దూకుడు’ పనికి రాదన్నది ఆ ఫిర్యాదు సారాంశం.ఓ వైపు కెసిఆర్, ఆయన టీమ్ 500 కిలోమీటర్ల వేగంతో వెళుతుంటే, కాంగ్రెస్ పార్టీ 100 కిలోమీటర్ల వేగం పనికొస్తుందా ? రేవంత్ రెడ్డి ‘దూకుడు’ కాంగ్రెస్ కు లాభమా?నష్టమా? పార్టీని విజయపథాన నడిపించే నాయకుడ్నే అధిష్టానం సి.ఎల్.పి. నేతగా ఎన్నుకుంటుంది.ఎలా చూసినా అది పిసిసి అధ్యక్షుని కష్టార్జితమే అవుతుంది.రేవంత్ రెడ్డి ఉత్తమ్ కు , జానారెడ్డి తదితరులేవరికీ పోటీ కాదు.తాను సి.ఎం.పదవి రేసులోనే లేనంటూ స్వయంగా రేవంత్ రెడ్డి సీనియర్లందరికీ భరోసా ఇచ్చారు. అయినా ఆయనను చూసి మిగతా నాయకులు భయపడడంలో అర్ధం లేదు. ‘కంటెంట్’ లేని వాడే అభద్రతకు గురవుతాడు.

ఎస్.కె.జకీర్.
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నెమ్మదిగా పుంజుకుంటున్నది. సమయం చాలా తక్కువ ఉన్నది. ఇంకా పుంజుకోవలసి ఉన్నది.కానీ రెండు అంశాలు ఆ పార్టీకి ‘నిఫా’ వైరస్ వలె పట్టి పీడిస్తున్నవి.మొదటిది కోవర్టు ఆపరేషన్.సొంత పార్టీ వ్యవహారాలూ,రహస్యాలు,ఇతర ఎత్తుగడలను ప్రత్యర్థి కెసిఆర్ కు చేరవేయడం.రెండవది ఆధిపత్య పోరు.వర్గపోరు, ఆధిపత్యపోరు,కుమ్ములాటలు,అసమ్మతి సెగలు ప్రజాస్వామ్య లక్షణంగా కాంగ్రెస్ పార్టీ సమర్ధించుకోవచ్చును.కానీ ప్రజలకు ఇది నచ్చని సంగతి.ఈ కీచులాటలను వారు అసహ్యించుకుంటారని ఆ పార్టీ నాయకులు అర్ధం చేసుకోవలసి ఉన్నది.కెసిఆర్ వంటి వ్యూహరచనా దురంధరుడు కాకపోయినా తన మాటల ఈటెలతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ ను, ఆయన కుటుంబ పాలనను కకావికలం చేయగలిగిన రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య కార్యక్రమాలకు ‘తనకు తానే దూరంగా’ ఉండేలా ఇతర నాయకులు ప్రవర్తిస్తున్నారు. గత నాలుగేళ్లలో కాంగ్రెస్ కార్యకలాపాలను విభజించవలసి వస్తే రేవంత్ రెడ్డి రాకకు ముందు,వచ్చిన తర్వాత అని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి కెసిఆర్ పై ప్రతీకారం కోసం రగిలిపోతున్నారు. అందువల్ల కెసిఆర్ పై ‘అటాక్’ చేయడంలో అందిన ఏ అవకాశాన్నీ ఆయన జారవిడుచుకోవడం లేదు. తటపటాయింపులు లేకుండా మడమ తిప్పకుండా పోరాడుతున్నందున ఆయనకు ‘క్రేజ్’ పెరిగిన మాట నిజం. ఇందుకు రాహుల్ గాంధీ ఇస్తున్న ప్రోత్సాహమూ కారణమే.ముఖ్యంగా యువతలో ఆయనకు ఫాలోయింగ్ పెరుగుతున్నదనడానికి బస్సు యాత్రలు,ఆ సందర్భంగా జరిగిన సభలూ ఉదాహరణ.రేవంత్ మాట్లాడినంత సేపు చప్పట్లు,ఈలలు.అందరికన్నా ముందు ప్రసంగిస్తే జనం వెళ్ళిపోయే పరిస్థితి.ఇతర నాయకులు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ మాట్లాడాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్.కాంగ్రెస్ పార్టీ లో కాకలుతీరిన నాయకులు సహజంగానే దీన్ని ఎలా జీర్ణించుకోగలరు?అంత ఉదార స్వభావమూ,విశాల హృదయమూ సీనియర్ నాయకుల్లో లేదు.పైగా విపరీతమైన అధికార దాహం.అందుకే ఈ సమస్యలు తలెత్తుతున్నవి.రేవంత్ రెడ్డి వ్యవహారం ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో పాజిటివ్ పరిణామం.స్పోర్టివ్ గా తీసుకోవలసిన అంశం. కానీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.నిన్న గాక మొన్న వచ్చిన వ్యక్తి ‘దూకుడు’ పనికి రాదన్నది ఆ ఫిర్యాదు సారాంశం.ఓ వైపు కెసిఆర్, ఆయన టీమ్ 500 కిలోమీటర్ల వేగంతో వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ 100 కిలోమీటర్ల వేగం పనికొస్తుందా ? రేవంత్ రెడ్డి ‘దూకుడు’ గానే వెళ్తూన్నారనుకుందాం…అది కాంగ్రెస్ కు లాభమా?నష్టమా?కెసిఆర్ ను గద్దె దింపగలిగితేనే కదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.ఎవరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా పార్టీని విజయపథాన నడిపించే నాయకుడ్నే అధిష్టానం సి.ఎల్.పి. నేతగా ఎన్నుకుంటుంది.ఎలా చూసినా అది పిసిసి అధ్యక్షుని కష్టార్జితమే అవుతుంది.రేవంత్ రెడ్డి ఉత్తమ్ కు , జానారెడ్డి తదితరులేవరికీ పోటీ కాదు.తాను సి.ఎం.పదవి రేసులోనే లేనంటూ స్వయంగా రేవంత్ రెడ్డి సీనియర్లందరికీ భరోసా ఇచ్చారు.ఆయనను చూసి మిగతా నాయకులు భయపడడంలో అర్ధం లేదు. ‘కంటెంట్’ లేని వాడే అభద్రతకు గురవుతాడు. కాంగ్రెస్ లో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు హాస్యాస్పదంగా ఉన్నవి.అధికారంలో ఉన్న పార్టీయే అత్యంత స్పీడ్ గా పోతున్నది.పలు విషయాల్లో ప్రతిపక్షాలను కెసిఆర్ ‘బోల్తా’ కొట్టిస్తున్నారు. 2 లక్షల రైతుల రుణమాఫీ సాధ్యం కాదని కెసిఆర్ తేల్చి పారేయడం అందులో భాగమే.ఒకవేళ కెసిఆరే ఆ విషయం చెబితే అది ఆచరణ సాధ్యమన్న రీతిలో ప్రజలకు సి.ఎం.సంకేతాలు పంపుతున్నారు.తాము చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలతో 106 అసెంబ్లీ సీట్లు వస్తాయంటూ కాంగ్రెస్ మనోధైర్యాన్ని దేబ్బతీస్తున్న కెసిఆర్ ను అదే ‘మైండ్ గేమ్’ తో చిత్తు చేయగల నాయకుడి అవసరం ఉన్నది.ప్రత్యర్థుల కదలికలను ముందస్తుగానే పసిగట్టి వారి ఆలోచనలను తునాతునకలు చేయగల నేత కెసిఆర్. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ‘ముఖ్యమంత్రి అభ్యర్ధుల’ రగడ, బహునాయకత్వం పీడిస్తున్నవి.ఇప్పుడదే టిఆర్ఎస్ కు అనుకూల అంశం.వై.ఎస్ రాజశేఖరరెడ్డి వలె ఒంటి చేత్తో ‘ప్రాంతీయ పార్టీ’ వలె నడిపారు.అందుకు హైకమాండ్ కూడా ఆమోదించింది.అప్పటి సమయమూ, సందర్భమూ అటువంటిది. ఆ స్థాయి పట్టుదల,పోరాట పటిమ, తెగింపు ఉన్న నాయకుడు లేనందున ప్రస్తుతం ఉన్న నాయకులే ‘బృందంగా’, సమన్వయం తో కెసిఆర్ ను డీ కొనవలసి ఉన్నది.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాలు రచిస్తున్నది.తమకు ఆయువుపట్టుగా, సుస్థిర ఓటుబ్యాంకుగా కెసిఆర్ భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నవి. ఒక ప‌క్క పోరాటాలు, మ‌రో ప‌క్క ప్ర‌శంస‌లు ఏకకాలంలో కొన‌సాగ‌టం వల్ల ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతున్నవి. కెసిఆర్ అమలు చేస్తున్న పధకాలపై సరైన హోం వర్క్ లేదు.జరగవలసిన కసరత్తు లేదు. జిల్లాల వారీగా కాంగ్రెస్ కు చెందిన బ‌ల‌మైన నాయ‌కుల‌ను అధికారపార్టీ లోకి మరలించే పనిలో కెసిఆర్ నిమగ్నమయ్యారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు అనుభ‌వించిన అధికార మ‌త్తు నుంచి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడిప్పుడే కొంత బయటపడుతున్నారు. అయితే ‘కోవర్టు ఆపరేషన్’ పై రాహుల్ గాంధీ కూడా వివిధ మార్గాలలో సమాచారం తెప్పించుకున్నారు.వ్యాపార ప్రయోజనాలో,లేదా ఇతర ప్రతిఫలాలో ఆశిస్తున్న నాయకులు ఎప్పటికప్పుడు ‘సమాచారం చేరవేత’లో బిజీగా ఉన్నట్టు కాంగ్రెస్ అధ్యక్షునికి ఉప్పందింది.కాంగ్రెస్ ముఖ్యుడొకరు నడుపుతున్న టి.వి.న్యూస్ చానల్ టిఆర్ఎస్ పై గురి పెట్టకుండా, టిపిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి పై గురిపెట్టడం కూడా రాహుల్ నోటీసుకు వెళ్ళింది.నిజానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి,చిన్న,చిన్న తగదాలు, అభిప్రాయ బేధాలు ఉన్నా అందరినీ కలుపుకోనిపోయెందుకు ఉత్తమ్ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.