సర్పంచ్ ఎన్నికల ఖర్చు 2.5 లక్షలు.

5 వేల లోపు జనాభా ఉంటే రూ.1.5 లక్షలు    – రాష్ట్ర ఎన్నికల సంఘం.

హైదరాబాద్:
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయపరిమితిని భారీగా పెంచారు. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఖరారుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. చివరిసారిగా 1995లో పంచాయతీ ఎన్నికల ఖర్చును ఖరారుచేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వ్యయపరిమితిని పెంచారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 5 వేలు దాటిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షల వరకు ఖర్చుపెట్టేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా 5 వేల జనాభా దాటిన గ్రామాల్లో వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు రూ.50 వేలు, 5 వేల లోపు ఉన్నచోట రూ.30 వేల వరకు ప్రచారం కోసం ఖర్చు చేయవచ్చు. నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఎన్నికల వ్యయాన్ని సవరించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు గ్రామాల్లో ప్రచార తీరును పరిశీలించి వ్యయాన్ని లెక్కిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ఇందుకోసం మండలానికి నాలుగు నుంచి ఐదు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని, వీడియో చిత్రీకరణ, అభ్యర్థుల వెంట తిరిగే జనం, వారి భోజనం, టిఫిన్ ఖర్చులు, జెండాలు, వాహనాల ఖర్చులపై అంచనా వేయాలని నిర్ణయించింది. కరపత్రాలు, ప్రకటనలపై కూడా ప్రత్యేకమైన దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.
గతంలో 10 వేల జనాభా వరకు రూ.40 వేలు. గతంలో సర్పంచ్ స్థానానికి పోటీచేసే అభ్యర్థి ప్రచారం కోసం రూ.40 వేలు మాత్రమే ఖర్చుచేసేందుకు అవకాశం ఉండేది. 10 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో రూ.80 వేల వరకు వెచ్చించేందుకు పరిమితి ఉండేది. ఇక వార్డు అభ్యర్థుల ఖర్చు చాలా తక్కువగా ఉండేది. వార్డు సభ్యుడికి రూ.6 వేలు, 10 వేల జనాభా దాటిన పంచాయతీలో రూ.10 వేల వరకు మాత్రమే పరిమితి ఉండేది.ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వ్యయం పరిమితిని తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఎన్నికల ప్రచారం సమయంలో ఖర్చుపై సంబంధిత అభ్యర్థి తరుపు ఏజెంట్లు మూడ్రోజులకోసారి లెక్కలను సమర్పించాలని స్పష్టంచేసింది. అంతేకాకుండా అభ్యర్థులు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఏజెంట్‌తో కలిపి ప్రత్యేకంగా జాయింట్ ఖాతాను తెరువాలని, ప్రతిదానికి అందులోనుంచే వ్యయంచేయాలని పేర్కొన్నది. నూతన ఖాతా నంబర్, సంబంధిత పాస్ పుస్తకాన్ని నామినేషన్ పత్రాలతో కలిపి అధికారులకు సమర్పించాలని నిబంధన విధించింది. భోజనం, వాహనం కిరాయి, పెట్రోల్, కరపత్రాలు, బహిరంగసమావేశాల ఖర్చులు.. ఇలా ఏవైనా బ్యాంకు ఖాతాల నుంచే బదిలీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి తరఫు ఏజెంట్ ప్రతి ఖర్చు వివరాన్ని రసీదుతోపాటు ఎన్నికల అధికారులకు సమర్పించాలి. ఎన్నికలు పూర్తయిన మూడునెలలలోగా లెక్కలు చూపించనివారిపై అనర్హత వేటువేసి, మూడేండ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయకుండా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల ఖర్చు కోసం పోస్టాఫీసులు, సహకారసంఘాల్లో కూడా ప్రత్యేకంగా ఖాతా తీసేందుకు అనుమతిచ్చారు.