‘సాగర్’ లో సహాయనిరాకరణ. టిఆర్ఎస్ లో అసమ్మతి చిచ్చు!!

రవి,నల్లగొండ;
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారపార్టీలో అసమ్మతి బద్దలైంది. పార్టీ అభ్యర్థి నోముల నరసింహయ్యకు సహాయనిరాకరణ చేయాలని పార్టీ శ్రేణులు నిర్ణయించుకున్నవి. టిఆర్ఎస్ పార్టీ నెట్ వర్క్ మొత్తం కోటిరెడ్డి వైపున ఉండడం టిఆర్ఎస్ అభ్యర్థికి ‘గండం’ గా మారింది.నోముల నరసింహయ్యకు టిఆర్ఎస్ అభ్యర్థిత్వం ప్రకటించి 13 రోజులు గడచినా ఆయనకు గ్రామాల్లో ఆదరణ కరువైంది. పార్టీ కార్యకర్తలు మద్దతునివ్వకపోవడంతో నోముల ‘ఏకాకి’ గా మారారు. కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకుడైన కుందూరు జానారెడ్డి పై గత ఎన్నికల్లో ఓటమి పాలైన నోముల నరసింహయ్య అభ్యర్థిత్వాన్ని మరోసారి ఖరారు చేయడంతో అసంతృప్తి భగ్గుమంటున్నది. ఈ సెగ్మెంటు లో ‘స్థానిక’ నినాదం రాజుకున్నది. గత ఎన్నికల నుంచి టిఆర్ఎస్ టికెట్టు ఆశిస్తూ భంగపడుతున్న ఎంసీకోటిరెడ్డి వర్గం నిప్పులు చెరుగుతున్నది. నోముల నరసింహయ్యకు టికెట్టుఖరారైనందుకు నిరసనగా ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కోటిరెడ్డి అసమ్మతి సెగలతో నాగార్జున సాగర్ అట్టుడుకుతున్నది. నోముల గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఆయనకు ఏ గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరో,నాయకులు ఎవరో ఇప్పటికీ అవగాహన లేదని పార్టీ పై పట్టు లేదని కోటిరెడ్డిమద్దతుదారులు అంటున్నారు. నాగార్జునసాగర్ లో అసంతృప్తి జ్వాలలు మిన్నంటుతున్నవి.

దాదాపు ఐదువేల మందికి పైగా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కోటిరెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నోముల నర్సింహ్మయ్యస్థానికుడు కాదు. ఆయన గతంలో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున ఎమ్మెల్యే గా పనిచేశారు. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడ్ని ఢీకొనడానికి గాను ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడాలన్నదిఎంసీకోటిరెడ్డి చాలాకాలంగా చేస్తున్న వాదన. పార్టీని బలోపేతం చేసుకోవడానికి టీఆర్ఎస్ వెనుకా ముందు చూడకుండా పదవులు ఆశ చూపించి వివిధ పార్టీలకు చెందిన నాయకులకు అడ్డగోలుగా చేర్చుకుంది. ఇపుడు వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులను సంతృప్తి పరచడానికి ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వస్తున్నవి. ఉద్యమకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని, పార్టీకి పనిచేసి వారిని కేసీఆర్ పక్కనపెట్టారన్న ఆరోపణలు ఉన్నవి. దీంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత బట్టబయలైంది. టీఆర్ఎస్ అసమ్మతి నాయకులను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కోటిరెడ్డిమద్దతుదారులుజీర్ణించుకోలేకపోతున్నారు. సాగర్‌లో ఎంసీకోటిరెడ్డి వర్గం బలంగా ఉన్నది. పార్టీ ఇన్‌చార్జ్ నోముల నర్సింహ్మాయ్య మరో వర్గంగా కొనసాగుతున్నప్పటికీ నోములకు నియోజకవర్గమంతటా పార్టీ నాయకులు, కార్యకర్తలపై పట్టు సంపాదించుకోలేకపోయారన్న వాదన ఉన్నది. ఇన్నాళ్లు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసిన ‘స్థానికుల’ను కాదని ‘స్థానికేతరుడై’న నోముల నర్సింహ్మాయ్యకు టికెట్ ఇవ్వడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు

మలుపు తిరుగుతున్నవి. పార్టీలో బేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీకి నష్టం చేయకుండా పనిచేసిన తమకు అన్యాయం జరిగిందని కోటిరెడ్డి వాపోతున్నారు. అసమ్మతి నేతలు హాలియాలో కార్యకర్తల సమావేశం నిర్వహించి టిఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేశారు. ఎంసీకోటిరెడ్డిమద్దతుదారులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నవి. కోటిరెడ్డికిమద్దతునిస్తున్న టిఆర్ఎస్ ప్రముఖులు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ స్థాయిల్లోని నాయకులు కాంగ్రెస్ లో చేరితే టిఆర్ఎస్ అందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని తెలుస్తున్నది. అప్పుడు జానారెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా మారవచ్చు. నాగార్జునసాగర్ అభ్యర్థిని మార్చాలన్న డిమాండు ఊపందుకుంటున్నది. నోముల నరసింహయ్య ను నల్లగొండ నుంచి లోక్ సభ బరిలో దింపడం శ్రేయస్కరమన్న అభిప్రాయం కూడా పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తున్నది.