సారా రహితమా? బెల్టు షాపుల సంగతేంటి..?

మహబూబ్ నగర్:
మహబూబ్ నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చి గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసారు అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి. తండాలు, మారుమూల గ్రామాల్లో అక్ర మంగా తయారు చేస్తున్న గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, పోలీసు శాఖల ద్వారా పకడ్బందీగా దాడులు నిర్వహించారు. పునరావాసం కల్పించారు. సద్భావన నెలకొల్పే ప్రయత్నాలు చేశారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని, నేర రహిత జిల్లాగా మార్చాలని ప్రయత్నించి కొంతమేర సఫలీకృతం అయ్యారు.
ఎక్సైజ్ అధికారుల దాడులు
ఎక్సైజ్ అధికారులు తండాలను జల్లెడ పట్టి దాడులు నిర్వహించారు. బెల్లం, గుడుంబా స్థావరాలను ధ్వసం చేశారు. బెల్లం, పటిక అమ్మిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిపై పీడీ యాక్టులు నమోదు చేశారు. గుడుంబాకు బానిసలుగా మారిన వారికి అవగాహన కల్పించారు. కుటుంబాలు నాశనం అవుతాయని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఆర్ధికంగా కృంగిపోతారని అవగాహన కల్పించారు. ఇదంతా బాగుంది. మహబూబ్ నగర్ జిల్లా అధికారుల దృష్టిలో సారారహితమయ్యింది. కానీ ఆ స్థానంలో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.వాటి నియంత్రణలో మాత్రం ఎక్సైజ్ అధికారులకు చిత్తశుద్ధి లేదని గ్రామస్థులు, తండావాసులు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలు మాత్రం ఈ సమస్యను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
ప్రతి గ్రామంలో వీధి వీధిన, పట్టణ శివారు కాలనీలలో బెల్టు షాపులలో మద్యం విక్రయం ఒక కుటీర వ్యాపారంగా కొనసాగుతుంది. బెల్టు షాపులు 30 రూపాయలు క్వార్టర్ బాటిల్‌పైన అదనంగా వసూళ్ళు చేస్తున్నారు. రోజంతా కూలీ చేసి సంపాదించిన డబ్బులో సగం మద్యానికి తగలబెడుతున్నారు గ్రామీణ కూలీలు, అందుబాటులో మద్యం లభిస్తుండటంతో పసిప్రాయంలోనే పన్నెండేళ్ల పల్లె పసి పిల్లలు మద్యం రుచి చూస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.ఇదేం పట్టని లైసెన్సు పొందిన మద్యం దుకాణదారులు మండలాల వారీగా లేబుల్లు తయారు చేసుకుని ఆయా మండల పరిధిలోని గ్రామాలలోని, తండాలలోని బెల్టు షాపులకు అక్రమంగా మద్యం విక్రయం చేస్తూ వ్యాపారులుకోట్లు దండుకుంటున్నారు. మరికొందరు అక్రమార్కులు నకిలీ మద్యం తయారు చేస్తూ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం చేస్తున్న అక్రమ మద్యం తయారీదారులకు, అక్రమంగా గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్న వారిపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
దాబాలు, షాపుల్లో రహస్య సిట్టింగ్‌లు
దాబాలు, బ్రాందీ షాపులలో రహస్య సిట్టింగ్‌లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బార్‌షాపులు పర్మిషన్‌తో నడువడం అందరికీ తెలిసిన విషయం. కొన్ని బ్రాందీ షాపులు పర్మిట్ రూం పేర నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. బ్రాందీ షాపులలో, దాబా లలో సిట్టింగ్‌లు రహస్యంగా నడుపుతున్నారు. పట్టణ నడి బొడ్డున బార్ల కంటే గొప్పగా బ్రాందీ షాపులలో అక్రమ సిట్టింగ్‌లు నడుస్తున్నాయి. ముందు బ్రాండీషాపు ప్రక్కన ఇరుకు రూంలలో వెలుతురు లేకుండా, దుర్గంధంతో కంపు వాసన నడుమ యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారులు ఇలాంటి వ్యవస్థను అరికట్టి పర్మిషన్లు ఉన్న మద్యం షాపులకు సహకరించాలని, అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని పర్మిట్ వున్న మద్యం వ్యాపారస్తులు కోరుకుంటున్నారు.