సాహస డ్రైవర్.

ఖమ్మం:
గుండెనొప్పి వస్తున్నా.. ఆ డ్రైవర్‌ ఆత్మసైర్యం చెక్కుచెదరలేదు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కుండా.. సుమారు 50కిలోమీటర్ల పాటు వాహనాన్ని నడిపి.. చివరకు ఖమ్మంలో వాహనాన్ని ఆపి.. కిందికి దిగి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం నగరంలో జరిగింది. ఏపీలోని కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రసాద్‌(62) నలభై ఏళ్లుగా లారీడ్రైవర్‌ వృత్తిలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 29న క్లీనర్‌ రవిని వెంటబెట్టుకొని ఇబ్రహీంపట్నం నుంచి భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో సారపాక పేపరు బోర్డుకు లారీ తీసుకొని వచ్చాడు. అక్కడ నుంచి 30న ఇల్లెందులోని కోయగూడెం సింగరేణి బొగ్గు లోడ్‌ చేయించుకుని మంగళవారం ఉదయం 4గంటలకు కర్నూలుకు బయలుదేరారు. అయితే అప్పటికే గుండెలో నొప్పిగా అనిపించినా.. ఆ నొప్పిని భరిస్తూనే వాహనాన్ని నడుపుతూ.. ఉదయం 11గంటల సమయానికి రఘునాధపాలెం మండలం మంచుకొండ వరకు చేరుకున్నాడు. నొప్పి మరింత ఎక్కువవడంతో రహదారి పక్కన కనిపించిన ఓ గ్రామీణ వైద్యుడి వద్ద ప్రాథమిక చికిత్స చేయించుకుని.. ఖమ్మం ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు బయల్దేరాడు. 12:30గంటల సమయంలో ఖమ్మం నగరంలోని ఎంతో రద్దీగా ఉండే ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ వద్దకు రాగానే గుండెనొప్పి తీవ్రం కావడంతో.. లారీని పక్కకు ఆపాడు. ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రసాద్‌ లారీ నుంచి కిందికి దిగగా.. అతడిని తీసుకెళ్లేందుకు క్లీనర్‌ రవి.. ఆటోను ఆపే ప్రయత్నం చేస్తుండగానే డ్రైవర్‌ ప్రసాద్‌ కుప్పకూలి.. తుదిశ్వాస విడిచాడు. అయితే మంచుకొండ నుంచి ఖమ్మం ఎన్టీఆర్‌సర్కిల్‌ వరకు రద్దీ అధికంగా ఉంటుంది. నొప్పి తీవ్రమైన సమయంలో లారీని పక్కకు ఆపడంతో భారీ ప్రమాదమే తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.