సింగరేణి చైర్మన్ కు అంతర్జాతీయ పురస్కారం.

న్యూ ఢిల్లీ:
సింగరేణి ఛైర్మన్‌ & ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌కు మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఐ.ఇ.ఎస్‌. వారి ‘‘అవుట్‌ స్టాండింగ్ లీడర్‌షిప్‌ అవార్డు’’కు ఎంపికయ్యారు.దుబాయ్‌లో ఈ నెల 28న బహూకరణ. సింగరేణి సంస్థను గత నాలుగేళ్ల కాలంలో అత్యద్భుత అభివృద్ధిదాయక సంస్థగా రూపుదిద్ది, ఆర్ధికంగా పటిష్ఠ పరుస్తున్న ఛైర్మన్‌&ఎం.డి.శ్రీధర్‌ను మరో అంతర్జాతీయ స్థాయి అవార్డు వరించింది.ప్రముఖ ఆర్ధికాంశాల అధ్యయన సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ వారు అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుతమైన నాయకత్వ ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా ఇచ్చే ‘‘అవుట్‌ స్టాండింగ్ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు’’ను ఈ ఏడాది సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌కి బహూకరించనున్నట్లు ప్రకటించారు.

జూన్‌ 28న దుబాయిలో జరగనున్న గ్లోబల్‌ ఎకనామిక్‌ సమిట్‌లో ఈ అవార్డును బహుకరించనున్నామనీ, అలాగే సింగరేణి సంస్థకు గోల్డ్‌మెడల్‌ అందించనున్నామని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ సంగీతాసింగ్‌ ఒక లేఖ ద్వారా సమాచారమిస్తూ ఈ అవార్డును స్వీకరించడానికి రావాల్సిందిగా సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ను ఆహ్వానించారు.ఈ సంస్థ వారు భారత ఆర్ధిక వ్యవస్థ పరిపుష్ఠికి, ఆర్ధిక అభివృద్ధికి ఆర్ధిక నిపుణులు , పార్లమెంటేరీయన్లు, సంబంధిత మేథావులతో పరిశోధనాత్మక అధ్యయనాలు నిర్వహిస్తోంది. అంతేకాదు వర్తమాన వ్యాపార థోరణులు , ఆసక్తులపై కూడా కాన్ఫరెన్సు, సెమినార్లు మేథోమధనా వంటివి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్‌ 28న దుబాయ్‌లో గ్లోబల్‌ ఎకనామిక్‌ సమిట్‌ నిర్వహించనుంది. దీనిలో భాగంగా ప్రతీఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యధ్భుత ప్రతిభావంతమైన నాయకత్వంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ముఖ్య కార్యనిర్వాహకులను గుర్తించి అవార్డు బహుకరిస్తున్నారు. ఈ సారి ఈ అవార్డుకు సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ వారు ఎంపిక చేశారు.

ఇటీవలనే మరో అంతర్జాతీయ సంస్థ అయిన ఎంటర్‌ ప్రైజ్‌ ఏషియా సంస్థ వారు ఆసియా పిసిఫిక్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌-2018 అవార్డును శ్రీ ఎన్‌.శ్రీధర్‌కు న్యూఢల్లీిలో ఏప్రియల్‌ 13న జరిగిన అంతర్జాతీయ సదస్సులో బహుకరించారు.
సింగరేణి సంస్థ తెంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును పొందింది అనడానికి ఈ అవార్డులే ఉదాహరణ. 2013-14తో పోలిస్తే గడిచిన నాలుగేళ్ల కాలంలో సింగరేణి సంస్థ తన టర్నోవర్‌ను రూ॥11,928 కోట్ల నుండి రూ॥22,667 కోట్లకు పెంచుకొంది. లాభలను రూ॥419 కోట్ల నుండి రూ॥1200 కోట్లకు చేర్చి 186.4 శాతం వృద్ధి చేసింది. బొగ్గు రవాణాను 47.94 మిలియన్‌ టన్నుల నుండి 64.61 మిలియన్‌ టన్నులకు (34.8 శాతం)కు భారీ ఎత్తున పెంచగలిగింది. బొగ్గు ఉత్పత్తి కూడా 50.47 మలియను టన్నుల నుండి 62.01 మిలియన్‌ టన్నులకు (22.9 శాతం)కు ఎదిగింది. ఇటువంటి అభివృద్ధి గణంకాలు ప్రభుత్వరంగ సంస్థలో చాలా అరుదు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంలో, సి&ఎం.డిగా ఎన్‌.శ్రీధర్‌ తీసుకొన్న ప్రత్యేక చొరవ, సమీక్షలు, అవిశ్రాంత కృషి ఫలితంగానే సింగరేణి సంస్థ తన 129సం॥ చరిత్రలో ఎన్నడూలేనంతగా గత నాలుగేళ్ల కాలంలోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణా పరిశ్రమలు జాతీయస్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపుపొందాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష సింగరేణి విషయంలో ఈ విధంగా నిజమవుతోంది. తెలంగాణా కొంగు బంగారమైన సింగరేణి సంస్థను అత్యుత్తమ స్థాయికి చేర్చి ఒకే ఏడాది రెండు అంతర్జాతీయ అవార్డులకు ఎంపికైన సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి .తనకు అవుట్‌ స్టాండింగ్ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు ప్రకటించడంపై సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ సంతోషం ప్రకటిస్తూ ఇది సింగరేణీయుల కృషికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా తాను భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సింగరేణీయుల సమిష్టి కృషి ఫలితంగానే తన సారథ్యానికి ఈ గుర్తింపు లభించినట్టుగా ఆయన పేర్కొన్నారు.