సిద్ధిపేట జిల్లాకు ట్రైనీ కలెక్టర్ గా అవిశ్యంత్ పండా-ఐఏఎస్.

సిద్ధిపేట:

అండర్ ట్రైనీ కలెక్టర్ గా 2017వ బ్యాచ్ కు చెందిన అవిశ్యంత్ పండా-ఐఏఎస్ సిద్ధిపేట జిల్లాకు నియమితులయ్యారు. శిక్షణలో భాగంగా జిల్లాలో 50 వారాలు ఏడాది పాటు విధులు నిర్వర్తించనున్నారు. ఈయన స్వస్థలం ఒరిస్సా, భువనేశ్వర్, కాగా దేశ రాజధాని ఢిల్లీలో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. సివిల్స్ సర్వీసు పరీక్షలో ఆల్ ఇండియాలోనే 91 ర్యాంకు సాధించిన అవిశ్యంత్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అవిశ్యంత్ తండ్రి 1984-ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అరుణ్ పండా కూడా ఒరిస్సా రాష్ట్రంలోనే ఐఏఎస్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిని కలిసి పుష్ఫగుచ్ఛం అందించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో అండర్ ట్రైనీ కలెక్టర్ అవిశ్యంత్ పండా కాసేపు ముచ్చటించారు. సిద్ధిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లా అని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగం పై గట్టి సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూ.. గోదావరి జలాలను రిజర్వాయర్లు, కాల్వల ద్వారా జిల్లాలకు నీళ్లు చేరవేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావులు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా సిద్ధిపేట కాబట్టి జిల్లా అధికారిక యంత్రాంగమంతా ప్రత్యేక విజన్ పని చేస్తున్నారని వెంకట్రామ రెడ్డి చెప్పారు.వీరి వెంట డీఆర్వో చంద్రశేఖర్, ఆర్డీఓ ముత్యం రెడ్డిలు ఉన్నారు.