సినిమాల్లోకి విరాట్ కోహ్లీ.

న్యూఢిల్లీ:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడా? ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ సాగుతోంది. ఈ నెల 28న విడుదల అంటూ విరాట్ చేసిన తాజా ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వెన్నునొప్పి కారణంగా యుఏఈలో జరుగుతున్న ఆసియా కప్ కు దూరమైన భారత రన్ మెషీన్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ విరాట్ తన ట్విట్టర్‌ అకౌంట్లో మూవీ పోస్టర్‌లాంటి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో తన సొంత బ్రాండ్ Wrogn దుస్తులు వేసుకున్న కోహ్లీ ఓ సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. ఆ పోస్టర్‌పై “Trailer: The Movie” అని ఉంది. ఆ ఫోటోతో పాటు విరాట్ ‘పదేళ్ల తర్వాత మరో కొత్త రంగంలోకి ప్రవేశిస్తున్నాను. వేచి ఉండలేక పోతున్నాన’ని రాశాడు. ఈ నెల 28న విడుదల అని ప్రకటించాడు. ఇప్పుడీ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది పూర్తి సినిమానా లేక షార్ట్ ఫిల్మా లేక బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన యాడా అనేది తెలియడం లేదు. మరి కోహ్లీ కొత్త ఫోటోకి అర్థం తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాలి.