సిరిసిల్లలో బుధవారం కేటీఆర్ పర్యటన.

  • ‘ఆపరేషన్ లోకల్’ జరగనుందా?
    అక్రమార్కుల ఏరివేత సాధ్యమేనా?

రాజన్న సిరిసిల్ల:
సి.ఎం.కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు.సాయంత్రం ఇఫ్తార్ విందులోనూ పాల్గొననున్నారు. అయితే తాజాగా వచ్చిన అధికార పార్టీ నాయకుల భూ కబ్జాల పై ఆయన ఎలాంటి చర్యలు చేపడతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. సిరిసిల్ల ప్రాంతం అవినీతిపరులకూ, అక్రమార్కులకూ అడ్డాగా మారడం మంత్రి కేటీఆర్ ను కలవర పెడుతున్నది. అధికారపార్టీ నాయకులు, కౌన్సిలర్ల అవినీతి దందాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో అక్రమ వ్యవహారాలపై ఎంబేరి లక్ష్మీనారాయణ అనే కవి నిరసన చేపట్టారు.సిరిసిల్ల అధికార టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు, కౌన్సిలర్ల కబ్జాలకు నిరసనగా ఈయన రోడ్డెక్కారు. అధికారపార్టీ నాయకులు, స్థానిక కౌన్సిలర్ల భూకబ్జాలు, అవినీతి, అక్రమాలపై ఆగ్రహంగా కవిత్వం వినిపించాడు.అక్రమార్కుల ఆగడాలను అరికట్టాలని కోరుతూ బిక్షాటన చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ బాస్కర్ కు, డీఆర్ఓ శ్యాంప్రసాద్ లాల్‌కు కొంతమంది అధికారపార్టీ నాయకులు, కౌన్సిలర్లపై ఫిర్యాదు చేశాడు. సిరిసిల్ల గణేష్ నగర్ లో 1982 సంలో 14 గుంటల భూమిని తాము 8 మందిమి కలిసి కోనుగొలు చేస్తే ప్రస్తుతం తమను బెదిరిస్తూ తమ భూమిని అక్రమించేందుకు టిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ నారయణ తెలిపారు. 764 సర్వేనంబర్‌లో భూమిని ఏనాడో అమ్ముకున్నప్పటికీ ఎలాంటి లింక్‌ డాక్యుమెంట్‌ కూడా లేకుండా రిజిస్ట్రేషన్లు, బోగస్‌ పర్మిషన్స్‌తో ఓ 4 గుంటల భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ మరో నాల్గుగుంటల భూమికి గాజుల పరమేశ్వర్‌, ఎల్లా రాజేశ్వరీ, ఆడెపు చక్రపాణిలు ఎసరు పెడుతున్నారన్నది ఎంబేరి లక్ష్మీనారాయణ ఆరోపణ. సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిలర్లు హన్మంతునాయక్, రాపెల్లి దేవదాసు, రామానుజంలతో పాటు,టీఆర్ఎస్‌ నాయకులు సయ్యద్‌సాబిద్‌, మరికొంతమంది అక్రమార్కులకు సహకరిస్తున్నారంటూ లక్ష్మీనారాయణ ఆరోపించారు. సిరిసిల్ల అధికారపార్టీ నాయకులు, కౌన్సిలర్ల దౌర్జన్యకాండతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకం నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సిరిసిల్లో సువర్ణ అనే మహిళకు సంబంధించిన జాగా ను మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తవుటు కనకయ్య కబ్జా చేయడంపై మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కొత్తగా మరికొందరు కౌన్సిలర్లు, అధికార టీఆర్ఎస్‌ పార్టీ నాయకుల బాగోతం కూడా బట్టబయలైంది.