సీబీఐలో పోరుకు కేంద్రమే కారణం!!

CBI central

ప్రకాశ్, న్యూఢిల్లీ:

దేశ ప్రధాన దర్యాప్తు సంస్థ సీబీఐలో అంతర్గత యుద్ధానికి కారణమేంటి? సంస్థ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ అతి జోక్యమే ఈ కుమ్ములాటకు దారి తీసిందంటున్నాయి సీబీఐ వర్గాలు. సీబీఐ నియామకాల్లో మోడీ సర్కార్ చూపిన వివక్షత కారణంగానే సీబీఐ పరువు బజారున పడిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 2015 వేసవి నుంచి గుజరాత్ లో తమకు అనుకూలంగా సహకరించిన అధికారులనే మోడీ ప్రభుత్వం సీబీఐలో నియమిస్తూ పోయింది. వైసీ మోడీ, అరుణ్ కుమార్ శర్మలను అడిషనల్, జాయింట్ డైరెక్టర్లుగా తెచ్చింది. 2016 ప్రారంభంలో రాకేష్ ఆస్థానాను అడిషనల్ డైరెక్టర్ గా నియమించింది. 2016 చివరన సీబీఐలో రెండో సీనియర్ అధికారిగా ఉన్న రూపక్ కుమార్ దత్తాను సీబీఐ డైరెక్టర్ ని చేయాల్సి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి అప్పటి వరకు సీబీఐ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్న రాకేష్ ఆస్థానాను మధ్యంతర డైరెక్టర్ గా నియమించింది. అనిల్ సిన్హా రిటైరైన తర్వాత రూపక్ కుమార్ దత్తా కచ్చితంగా సీబీఐ డైరెక్టర్ కావాలి. ఆయన తన కెరీర్ లో దాదాపు సగ భాగం అంటే 18 ఏళ్లు సీబీఐలో పని చేశారు. అందుకని సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం వేరే విధంగా ఆలోచించాయి. అనిల్ సిన్హా రిటైరయ్యే సమయం దగ్గర పడింది. ఆయన 2 డిసెంబర్ 2016న రిటైర్ కావాల్సి ఉంది. కానీ నవంబర్ చివరి వరకు సెలక్షన్ కమిటీ సమావేశం కాలేదు.
సాధారణంగా ప్రధానమంత్రి, సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత ముగ్గురు సభ్యులుగా ఉన్న కమిటీ సీబీఐ డైరెక్టర్ రిటైరయ్యే నెల ముందుగానే కొత్త పేరుని నిర్ణయిస్తుంది. కానీ 2016లో అలా జరగలేదు. అందువల్ల అంతా సీబీఐలో నెంబర్ టూగా ఉన్న రూపక్ కుమార్ దత్తాని ప్రమోట్ చేసి డైరెక్టర్ గా నియమిస్తారని అంతా భావించారు. కానీ 2 డిసెంబర్ న సిన్హా రిటైరయ్యే మూడు రోజున ముందు అంటే 29 నవంబర్ రాత్రి 8 గంటలకు రూపక్ దత్తా కార్యాలయంలోని ఫ్యాక్స్ కి కార్మిక మంత్రిత్వశాఖ నుంచి ఒక ఫ్యాక్స్ వచ్చింది. రూపక్ దత్తాను హోమ్ మంత్రిత్వశాఖలో అడిషనల్ సెక్రటరీగా బదిలీ చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఆయన అంతర్గత భద్రత వ్యవహారాలు పర్యవేక్షిస్తారని తెలిపింది.
ఇలా జరుగుతుందని రూపక్ దత్తా కనీసం కలలోనైనా ఊహించి ఉండరు. ఆయన అనిల్ సిన్హాను కలిసి దీని గురించి చెప్పారు. కానీ సిన్హా కూడా ఈ విషయంలో నిస్సహాయులుగా మారిపోయారు. ఇప్పుడు నిద్ర మేల్కొన్న సీవీసీ, సీబీఐలో అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతానని ముందుకొచ్చింది. కానీ 2016లో రూపక్ దత్తాకు అన్యాయం జరుగుతున్నపుడు సీవీసీ కూడా ఏం చేయకుండా చోద్యం చూసింది. తప్పనిసరి పరిస్థితుల్లో రూపక్ దత్తా హోమ్ మంత్రిత్వశాఖకు వెళ్లారు. 2 డిసెంబర్ న అనిల్ సిన్హా రిటైరయ్యారు. ప్రభుత్వం రాకేష్ ఆస్థానాను వర్కింగ్ డైరెక్టర్ గా నియమించింది. తర్వాత జనవరిలో కొత్త డైరెక్టర్ గా ఆలోక్ వర్మ నియామకం జరిగింది. ఏ రాకేష్ ఆస్థానా, ఆలోక్ శర్మల కోసం మోడీ సర్కార్ సీబీఐలో సహజ నియమనిబంధనలకు పాతరేసిందో వాళ్లిద్దరూ అవినీతి ఆరోపణల్లో ఇరుక్కొని ప్రభుత్వానికి తలవంపులు రావడానికి కారణమయ్యారు.