సీబీఐ అను మసాలా సినిమా!! ఆ అర్థరాత్రి ఇలా జరిగింది….

ప్రకాశ్, న్యూఢిల్లీ:
సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగిస్తూ ప్రభుత్వం 23 అక్టోబర్ అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ ఆ అర్థరాత్రి ఎప్పుడు ఏం జరిగిందో వివరిస్తూ ఒక క్రమానుగత పత్రం విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ పత్రం తాలూకు అనువాదం ఇలా ఉంది.
మోడీ ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కలిసి అర్థరాత్రి రహస్యంగా పన్నిన అనుచితమైన పాపపు కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. రాజ్యాంగాన్ని, న్యాయాన్ని మోసగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం, సీవీసీ నట్టనడి రాత్రివేళ ఆడిన నాటకంలోని అంకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాఫెల్ అవినీతిపై ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా అడ్డుకొనేందుకు సీబీఐ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగానికి, న్యాయస్మృతికి కళ్లు గప్పేందుకు 2018 అక్టోబర్ 23న దారుణమైన రహస్య పథక రచన సాగింది. అవి ఇలా ఉన్నాయి.

1. అక్టోబర్ 23 సాయంత్రం సీవీసీ శ్రీ కేవీ చౌదరి డెన్మార్క్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన హఠాత్తుగా ఆ పర్యటన రద్దు చేసుకొని రాత్రి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సమావేశం నిర్వహించారు.
2. రాత్రి 11.00:సీవీసీ ఆదేశాలు రావచ్చనే ఉద్దేశంతో సీబీఐ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఎం. నాగేశ్వర్ రావును సీబీఐ హెడ్ క్వార్టర్స్ కి పంపారు.
3. రాత్రి11.30:అర్థరాత్రి అత్యవసర ఆపరేషన్ కి రావాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ తన సహోద్యోగులకు కబురు పెట్టారు. న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్ సంకేత స్థలంగా తెలియజేశారు.

అర్థరాత్రి 12 గంటలకు ఢిల్లీ పోలీస్ అధికారులు సీబీఐ హెడ్ క్వార్టర్స్ ను అధీనంలోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఎన్ఎస్ఏ నుంచి ఆదేశాలు వచ్చాయి.
4. రాత్రి 12.30:సీబీఐ హెడ్ క్వార్టర్ ను నియంత్రణలోకి తీసుకొనేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు. వారిని సీఐఎస్ఎఫ్ అడ్డుకొంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సీఐఎస్ఎఫ్ అధిపతితో మాట్లాడారు. ఆయనకు కూడా సీబీఐను అధీనంలోకి తీసుకొనేందుకు ఢిల్లీ పోలీసులను అనుమతించాలని పీఎంఓ/ఎన్ఎస్ఏ నుంచి సూచనలు అందాయి. ఢిల్లీ పోలీసులు సీబీఐని నియంత్రణలోకి తీసుకున్నారు.
5. రాత్రి 8-12.30: సీవీసీ, ఆయన సహోద్యోగులు ఇద్దరు కలిసి సీవీసీ చట్టం 2003 సెక్షన్ 8(1) కింద సీబీఐ డైరెక్టర్ శ్రీ ఆలోక్ వర్మను ఆయన అధికారాలు, బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఒక ఆర్డర్ ముసాయిదా తయారు చేశారు.
6. రాత్రి 12.30-1: సీవీసీ ఆదేశాలను నార్త్ బ్లాక్ కి తీసుకెళ్లారు. అక్కడ పీఎంఓ సూచనల మేరకు సెక్రటరీ పర్సనల్ సీ.చంద్రమౌళి వేచి ఉన్నారు.చంద్రమౌళి హుటాహుటిన పీఎంఓకి వెళ్లారు. ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్ మెంట్స్ వెంటనే ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఎం.నాగేశ్వర్ రావును కొత్త సీబీఐ డైరెక్టర్ గా నియమించేందుకు అనుమతినిచ్చింది.సీవీసీ, డీఓపీటీ అదనపు కార్యదర్శి లోక్ రంజన్ కలిసి సీబీఐ హెడ్ క్వార్టర్స్ కి వచ్చారు.

7. రాత్రి 2.30: కొన్ని ఫైళ్లు, రికార్డులతో సీవీసీ, డీఓపీటీ అదనపు కార్యదర్శి శ్రీ లోక్ రంజన్, జాయింట్ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రావ్ కలిసి సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికొచ్చారు.
8. రాత్రి 2.30: అలోక్ కు ఆదేశాలు అందజేశారు.