సీబీఐ రాజకీయ పార్టీల చేతిలో పావు!!

CBI

సీబీఐ రాజకీయ పార్టీల చేతిలో పావు!!
– జస్టిస్ చలమేశ్వర్:

న్యూఢిల్లీ:

దేశంలోని అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐలో సరైన న్యాయ నిర్మాణ వ్యవస్థ లేదని సుప్రీంకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సీబీఐని ఉపయోగించుకున్నవేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంస్థ ఆలిండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన సమావేశంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ పాల్గొన్నారు. సీబీఐలో ఇటీవల తలెత్తిన పరిణామాలు, పనితీరుపై ప్రశ్నించగా ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనది కాదు.. చట్టబద్ధమైనది కాదన్నారు. ‘ప్రతి విషయానికి సీబీఐ దర్యాప్తు చేయాలని అంతా కోరుకుంటారు. కానీ అదేం దేవుడు సృష్టించిన సంస్థ కాదు. దానకంటూ సరైన న్యాయ నిర్మాణ వ్యవస్థ లేదు. సీబీఐ ప్రస్తుత పరిస్థితికి అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలి. ప్రతిపక్షంలో ఉండగా అన్ని పార్టీలు దానిని ఆయుధంగా వాడుకొన్నాయి. దర్యాప్తునకు సీబీఐ కావాలని కోరతాయి. కానీ ప్రభుత్వం తమపై కక్షసాధింపునకు వినియోగిస్తోందని ఆరోపిస్తాయని‘ ఆయన అన్నారు.అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం చట్టం చేయవచ్చని జస్టిస్‌ చలమేశ్వర్‌ చెప్పారు. అయోధ్య టైటిల్‌ హక్కుల వివాదం సుప్రీంకోర్టులో ఉండగా మందిర నిర్మాణం కోసం పార్లమెంట్‌లో చట్టం తీసుకురావచ్చా? అని అడిగిన ప్రశ్నకు జస్టిస్‌ చలమేశ్వర్‌ ‘‘చట్టపరంగా అలా జరుగుతుందా? లేదా అన్నది ఒక అంశం. అసలు అది జరుగుతుందా లేదా అనేది మరో విషయం. సుప్రీంకోర్టు తీర్పులను నీరుగార్చేలా గతంలో ప్రభుత్వాలు చట్టాలు తెచ్చిన దాఖలాలు ఉన్నాయని’’ చెప్పారు. కావేరీ జలవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెడుతూ గతంలో కర్ణాటక అసెంబ్లీ చట్టం చేసిందని, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానాల మధ్య అంతర్రాష్ట్ర జల వివాదం కేసులో కూడా చట్టం తెచ్చారని ఆయన గుర్తు చేశారు. చట్టసభలు చట్టాలు చేయడాన్ని నిరోధించలేదు కాబట్టి రామాలయ నిర్మాణానికి చట్టం చేయవచ్చన్నారు జస్టిస్‌ చలమేశ్వర్‌.