హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్షత్రపతి శివాజి, సీనియర్ కంట్రీ స్పెషలిస్ట్ రాజీవ్ వి సింగ్‌లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో నేడు సమావేశమయ్యారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలు కూడా ఈ సందర్భంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో చేపడుతున్న ఎస్.ఆర్.డి.పి, మెట్రో రైలు ప్రాజెక్ట్, మూసి అభివృద్ది తదితర పనులకు ఆర్థిక సహాయం అందించాల్సిందిగా ఇటీవల న్యూఢిల్లీలో ఆసియా అభివృద్ది బ్యాంకు ప్రతినిధులతో నగర మేయర్ బొంతు రామ్మోహన్ సమావేశమై ప్రతిపాదనలు సమర్పించారు. మేయర్ రామ్మోహన్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఏడిబి అధికారులు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఆర్థిక శాఖల కార్యదర్శులతో చర్చించడానికి నేడు హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్షత్రపతి శివాజి, సీనియర్ కంట్రీ స్పెషలిస్ట్ రాజీవ్ వి సింగ్‌లతో ముందుగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఈ బృందంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో సమావేశమైనట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌లకు సహాయం అందించాల్సిందిగా తాము చేసిన ప్రతిపాదనలకు ఆసియా అభివృద్ది బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందిస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉన్న పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణకు గుర్తింపుగా బాండ్ల ద్వారా నిధుల సేకరణ నిదర్శనమని మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు.