సుక్మా ఎన్ కౌంటర్ పై ‘పౌరహక్కుల’ పిటిషన్. 13 న సుప్రీంకోర్టు విచారణ.

న్యూఢిల్లీ:
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై తెలంగాణ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించింది.ఈ నెల 13 న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని, 15 మంది మృతులలో 8 మంది ముక్కుపచ్చలారని 13 సంవత్సరాల పిల్లలు ఉన్నారని పౌరహక్కుల సంఘం తరపున న్యాయవాది ఎన్. నారాయణరావు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు.ఈ నెల 6 వ తేదీన మైనర్ పిల్లలు, సామాన్య పౌరులను కాల్చిచంపి 15 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించినట్టు ఈ వ్యాజ్యం లో ఆరోపించారు.ఈ హత్యాకాండకు పాల్పడిన పోలీసులు, పారామిలీటరీ బలగాలపై ఐ.పి.సి 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ను అభ్యర్థించారు.ఎన్ కౌంటర్ లో మరణించిన గిరిజనుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం జరపాలని పిటిషనర్ కోరారు. ‘మావోయిస్టుల ఎన్ కౌంటర్’ పేరిట పౌరులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘటనపై సిబిఐ లేదా ‘సిట్’ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాది రఘునాథ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.