సుప్రీం కూడా ‘ఆధారే’ భేషంది. – చిదంబరం.

న్యూఢిల్లీ:

ఆధార్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చాలా వరకు యుపిఏ ప్రభుత్వం ఆలోచనతో ఏకీభవించిందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు. నిరుపేదలకు సబ్సిడీలు, సేవలు, సంక్షేమ ఫలాలు నేరుగా అందించే సాధనంగా ఆధార్ కు రూపకల్పన చేశామని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. యుపిఏ విధానం సరైనదేనని సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైందని చిదంబరం అన్నారు. ప్రతి ఒక్క పౌరుడి జీవితంలోని ప్రతి అంశాన్ని నిర్ణయించేలా ఆధార్ ను వాడుకొని దానిని ఓ బూచిలా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎన్డీఏకి, న్యాయమంత్రిత్వ శాఖకి చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. ఆర్థిక బిల్లుగా ఆమోదం పొందిన ఆధార్ చట్టాన్ని దాదాపుగా కొట్టివేసే పరిస్థితి వచ్చిందని.. కానీ న్యాయవ్యవస్థ సరైన సమయంలో జోక్యం చేసుకోవడంతో అలా వీలు కాలేదన్నారు. ఆధార్ ని అడ్డు పెట్టుకొని పేట్రేగి పోతున్న ప్రభుత్వానికి తాజా తీర్పుతో కళ్లెం వేసినట్టయిందని చెప్పారు.