స్కూల్లో విధిగా ‘స్పోర్ట్స్ పీరియడ్’.

ఢిల్లీ:
దేశంలో ఆటలకు ప్రాముఖ్యం పెంచేందుకు వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఆటల పిరియడ్‌ కచ్చితంగా ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాఠోడ్‌ తెలిపారు. విద్యార్థులకు 2019 నుంచి 50 శాతం సిలబస్‌ తగ్గుతుందన్నారు. ‘ఆటలు లేకుండా నేర్చుకొనే విద్యనే మనం సరైన విద్యావ్యవస్థ అనుకొనే దశకు వచ్చేశాం. 2019లోపు విద్యార్థల సిలబస్‌ను 50 శాతానికి కుదిస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా ఆటల పిరియడ్‌ కచ్చితంగా ఉంటుంది’ అని రాఠోడ్‌ వెల్లడించారు.
‘2022 కల్లా శాయ్‌ ఉద్యోగులను 50 శాతానికి తగ్గించనుంది. అప్పుడు వారు ఆటలపై దృష్టి పెట్టగలరు. అంతే కాకుండా చిన్న పాలకవర్గం వల్ల క్రీడలపై ఎక్కువ ఖర్చుపెట్టొచ్చు. ఈ ఏడాది 20 క్రీడా పాఠశాలలు రానున్నాయి. ఒక్కో పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.7-10 కోట్లు ఖర్చుపెట్టనుంది. రెండు నుంచి మూడు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడమే దీని వెనకున్న ఉద్దేశం’ అని మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ అన్నారు. రగ్బీ ప్రపంచకప్‌ రన్‌అప్‌ భారత్‌లో ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.