స్టేడియం దగ్గర ధోనీ భారీ కటౌట్!!

న్యూఢిల్లీ;

భారత క్రికెట్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఎవరికైనా ఉందంటే అది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే. జార్ఖండ్ కి చెందిన ధోనీకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎంఎస్ ఎక్కడికెళ్లినా పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ కి లెక్కే లేదు. ముఖ్యంగా సౌతిండియాలో మాహీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న ఎంఎస్డీని తమిళ తంబీలు తలాగా ఆరాధిస్తారు. మిస్టర్ కూల్ ఆడే మ్యాచ్ లకి తమిళనాడు నుంచి స్పెషల్ ట్రెయిన్లు వేసిన సంగతి మరచిపోలేము.తమిళుల మాదిరిగానే కేరళలోనూ ధోనీకి వీరాభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు వారు మాహీపై తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటున్నారు. వెస్టిండీస్, భారత జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ ల సిరీస్ లో చివరి వన్డే రేపు కేరళలోని తిరువనంతపురంలో జరుగుతోంది. రెండు జట్లు త్రివేండ్రం చేరుకున్నాయి. అయితే ధోనీపై తమ అభిమానాన్ని చాటుకొనేందుకు కొందరు అభిమానులు సినిమా స్టైల్లో 35 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం బయట ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో తలా విశ్వరూపం రూపొందుతోందనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.