‘స్పైస్ 6’ లో గొడ్డుమాంసం.

హైదరాబాద్:

ఒకరేమో ఐపీఎస్‌, మరొకరు ఐఆర్‌ఎస్‌ అధికారి, ఇంకొకరు డాక్టర్‌. వీరంతా కలిసి భోజనం చేసేందుకు హోటల్‌కు వెళ్లారు. మేక మాంసం ఆర్డర్‌ చేస్తే.. నిర్వాహకులు గొడ్డు మాంసం వడ్డించారు.ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కూకట్‌పల్లి షంషీగూడకు చెందిన డాక్టర్‌ సురేష్‌కుమార్‌ వెంకట రామిరెడ్డి ఈ నెల 14న స్నేహితులైన ఏపీ లీగల్‌ ఏఐజీ, ఐపీఎస్‌ అధికారి శ్యాంసుందర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌, ఏపీ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుర్జిత్‌సింగ్‌, నరేష్‌తో కలిసి భోజనం చేసేందుకు బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోగల “స్పైస్‌6ది అరబ్‌-వీలేజియో” రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఉమ్‌ అలీ లహం(మటన్‌) అర్డర్‌ చేశారు. దాన్ని తిన్నాక వారికి అది గొడ్డు మాంసం అని అనుమానం వచ్చింది. ఈ విషయమై రెస్టారెంట్‌_యజమానిని అడిగారు. మటన్‌ వడ్డించినట్టు రాసివ్వాలని కోరగా వెనుకడుగు వేశాడు. సురేష్‌కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమూనాలను సేకరించి వాటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. నిర్వాహకులపై 420, 272, 273 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.