స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై మరికొందరికి ఏసీబీ నోటీసులు.

హైదరాబాద్‌:
స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్ల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తులో రెండో అంకం ప్రారంభం కానుంది. డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరమణ అరెస్ట్‌, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారుల విచారణ, మెడికల్‌ కాలేజీల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటి వరకు పూర్తి చేశారు. ఇక మెడికల్‌ సీట్ల అక్రమాలకు సంబంధించి స్పోర్ట్స్‌ అథారిటీలో పైస్థాయి అధికారుల్ని కూడా విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే నోటీసుల జారీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు లభించిన సమాచారం మేరకు కొత్త వారికి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. ఆరోపణలకు సంబంధించి ఎవరెవర్ని విచారించారనే ప్రశ్న కోర్టులో ఉత్పన్నమైతే దర్యాప్తు మొత్తం నీరుగారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి అవకాశం లేకుండా దర్యాప్తు సంస్థ అందర్నీ విచారించేందుకు ముందుకెళ్తున్నట్లు తెలిసింది.అనర్హులకు సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల తాము నష్టపోయామని వాపోతున్న విద్యార్థుల్ని ఈ కేసులో సాక్షులుగా చేర్చనున్నారు. వారిని సాక్షులుగా చేర్చి కేసుకు బలం చేకూర్చనున్నారు. అక్రమంగా మెడికల్‌ సీట్లు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల్ని అధికారులు విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్నారు. వారిచ్చే వాంగ్మూలం కోర్టులో కేసు నిలబడేందుకు కీలకంగా మారనుంది. 2017-18 విద్యాసంవత్సరంలో మెడికల్‌ సీట్లు పొందిన వారితోపాటు అనర్హులకు సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల తాము అవకాశం కోల్పోయామని ఆరోపిస్తున్న విద్యార్థులు,ఇతర క్రీడాకారుల సర్టిఫికెట్లను మొత్తం పరిశీలించి వాస్తవాలు నిగ్గు తేల్చనున్నారు.