స‌ర్కార్ ద‌వాఖానాల మీద వైద్య మంత్రి న‌జ‌ర్‌.

హైదరాబాద్:
ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి. ఒక్కో ద‌వాఖానాను సంద‌ర్శిస్తూ స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా ప‌రీక్షిస్తున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు చూపిస్తున్నారు. అద్భుతంగా ప‌ని చేస్తున్న అధికారుల‌ను, సిబ్బందిని అభినందిస్తూ, ప్రోత్స‌హిస్తున్నారు. అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించే వాళ్ల‌ని మందిలిస్తూ ఉన్నారు. మంత్రి, ప్ర‌స్తుతం జిల్లా, ఏరియా హాస్పిట‌ల్స్ మీద దృష్టి సారించారు. హైద‌రాబాద్‌లోని కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్‌ని సంద‌ర్శించారు. నిదానంగా హాస్పిట‌ల్‌లోని ప్ర‌తి విభాగాన్ని ప‌రిశీలించారు. వార్డుల‌ని క‌లియ తిరిగారు. కెసిఆర్ కిట్లు పంపిణీ చేశారు. బాలింత‌ల‌తో మాటా మంతీ క‌లిపి, నేరుగా రోగుల‌తో మ‌మేమ‌కం అయ్యారు. వైద్యం ఎలా అందుతున్న‌ది? ద‌వాఖానా ఎలాగున్న‌ది? డాక్ట‌ర్లు, సిబ్బంది మంచిగ ప‌ని చేస్తేన్న‌రా? అంటూ స‌ర్కార్ వైద్యం పై ఆరా తీశారు. వారు సంతోషం వ్య‌క్తం చేయ‌గా, కెసిఆర్ ద‌యతో రూ.100 జీతం తీసుకున్న మేం, ఇప్పుడు రూ.6వేల తీసుకుంటున్నాం. మా ద‌వాఖానా కూడా బాగున్న‌ది. అంటూ కితాబిచ్చింది ప్ర‌మీల అనే ఆశా వ‌ర్క‌ర్‌. ఇంకోవైపు కొండాపూర్‌లో మంచినీరు వంటి ప‌లు స‌మ‌స్య‌ల‌ను నెల రోజుల్లో ప‌రిష్క‌రించాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, స‌ర్కార్ ద‌వాఖానాల్లో రోగుల‌కు ద‌ర్జాగా చికిత్సలు అందుతున్నాయ‌న్నారు. కొండాపూర్ హాస్పిట‌ల్‌ ఇంటీరియ‌ర్ డెకర‌ష‌న్‌, చుట్టూ గార్డెనింగ్ చేయ‌డంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని, అభినంద‌నీయంగా ల్యాబ్‌, రోగుల రిసెప్ష‌న్ డేటా ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయ‌ని, రెట్టింపు దాటిన డెలివ‌రీల సంఖ్య‌కు కార‌కులైన డాక్ల‌ర్లు, సిబ్బందిని అభినందించారు. మ‌రిన్ని ప‌డ‌క‌ల పెంపున‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపుతున్నామ‌ని, త్వ‌ర‌లో బ్ల‌డ్ బ్యాంకు ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

వైద్య మంత్రి మంత్రి ల‌క్ష్మారెడ్డి మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్‌ని సంద‌ర్శించారు. నేరుగా రిసెప్ష‌న్‌, ల్యాబ్‌, ఫార్మ‌సీ, ఓపీ, ఐపీ, వివిధ వార్డులు, ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, లేబ‌ర్ రూమ్స్ వంటి ప‌లు విభాగాల‌ను ప‌రిశీలించారు. ఆయా విభాగాల ప‌నితీరును ప‌రీక్షించారు. పెరిగిన ప్ర‌సూతిల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌రింగా లేబ‌ర్ రూమ్స్‌ని అభివృద్ధి ప‌ర‌చాల‌ని అధికారుల‌కు సూచించారు. మంచినీటి స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశిస్తూ, నెల రోజుల గ‌డువు విధించారు. పైపు లైన్ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే విధంగా చూడాల‌ని ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి సూచించారు.

బాలింత‌ల వార్డుకు వెళ్ళి కెసిఆర్ కిట్ల‌ను పంపిణీ చేశారు. బ‌లింత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌తో మాటా మంతీ క‌లిపారు. కెసిఆర్ కిట్ల ప‌థ‌కం ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించారు. డెలివ‌రీస్ ఎలా జ‌రుగుతున్నాయ‌ని అడిగారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత బాగా డాక్ట‌ర్లు చూస్తున్నార‌ని, స‌హ‌జ ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని, పైగా కిట్లు, ఆర్థిక స‌హాయం కూడా అందుతున్న‌ద‌ని సంతోషంగా వారు మంత్రితో చెప్పారు.

అక్క‌డి నుండి మంత్రి జ‌న‌ర‌ల్ వార్డుల్లో తిరిగారు. వైద్యం ఎలా అందుతున్న‌ది? ద‌వాఖానా ఎలాగున్న‌ది? డాక్ట‌ర్లు, సిబ్బంది మంచిగ ప‌ని చేస్తేన్న‌రా? అని రోగుల‌ను క‌లిసి మంత్రి మాట్లాడారు. వారు సైతం సంతోషం వ్య‌క్తం చేస్తూ డాక్ట‌ర్లు మంచిగా చూస్తున్నార‌ని చెప్పారు. హాస్పిట‌ల్ లో ఎలాంటి దుర్వాస‌న‌లు లేకుండా, ప‌రిశుభ్రంగా ఉంద‌ని చెప్పారు.

*కెసిఆర్ ద‌య‌తో మేం బాగున్నం… మా ద‌వాఖానా బాగున్న‌ది ః ఆశా వ‌ర్క‌ర్ ప్ర‌మీల‌*

కెసిఆర్ ద‌యంతో మేం బాగున్నాం. గ‌తంలో మాకు రూ.100 జీతంలో ప‌నిలోకి వ‌చ్చాం. ఇప్పుడు రూ.6వేలు జీతంగా వ‌స్తున్నాయి. మేం కూడా డెలివ‌రీలకు సాయంగా ఉన్నాం. మేం, మా కుటుంబాలు, ద‌వాఖానాలు బాగుప‌డ్డాయ‌ని ఆశా వ‌ర్క‌ర్ ప్ర‌మీల మంత్రి ల‌క్ష్మారెడ్డితో ఆనందం పంచుకున్నారు. మంత్రి సైతం ఆశా వ‌ర్క‌ర్ ప్ర‌మీల‌ను అభినందించారు.

*ద‌వాఖానాల్లో రోగుల‌కు ద‌ర్జాగా చికిత్సలు-మంత్రి ల‌క్ష్మారెడ్డి*

అనంత‌రం మంత్రి ల‌క్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ద‌వాఖానాల్లో రోగుల‌కు ద‌ర్జాగా చికిత్సలు అందుతున్నాయ‌న్నారు. కొండాపూర్ ద‌వాఖానా ఇంటీరియ‌ర్ డెకర‌ష‌న్‌తో ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని కితాబిచ్చారు. అభినంద‌నీయంగా ల్యాబ్‌, రోగుల రిసెప్ష‌న్ డేటా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి ఉంద‌న్నారు. రెట్టింపు దాటిన డెలివ‌రీలు ఇక్క‌డి వైద్యులు, సిబ్బంది ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. గ‌తంలో 100 లోపు జ‌రిగే డెలివ‌రీలు ప్ర‌స్తుతం 250 వ‌ర‌కు జ‌రుగుతున్నాయ‌న్నారు. స‌ర్కార్ ద‌వాఖానాల మీద న‌మ్మ‌కం పెరిగి, రోగుల రాక పెరిగింద‌ని, కెసిఆర్ కిట్ల త‌ర్వాత మ‌రింత‌గా గ‌ర్బిణీలు ద‌వాఖానాల‌కు వ‌స్తున్నార‌న్నారు. దీంతో ప్ర‌స్తుతం ఉన్న 110 ప‌డ‌క‌లు స‌రిపోవ‌డం లేద‌ని, 250 ప‌డ‌క‌ల వ‌ర‌కు పెంచాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ మేర‌కు అధికారుల‌కు ఆదేశాలిచ్చామ‌న్నారు. నారాయ‌ణ గూడ‌లోని తెలంగాణ ల్యాబ్స్‌కి కొండాపూర్ ల్యాబ్ ఆన్‌లైన్ తో అనుసంధానం చేయ‌డం, రిసెప్ష‌న్‌లో డేటా ఆన్‌లైన్ చేయ‌డం, ప్ర‌తి రోజూ రోగుల డాటాను ఆన్‌లైన్‌లో చూసుకునే విధంగా మార్పులు చేయ‌డం ప‌ట్ల కొండాపూర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ వ‌ర‌దా చారి, సిబ్బందిని అభినందించారు. హాస్పిట‌ల్‌లో త్వ‌ర‌లో బ్ల‌డ్ బ్యాంకు ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు.

కొండాపూర్ ఏరియా హ‌స్పిట‌ల్ సంద‌ర్శ‌న‌లో మంత్రి ల‌క్ష్మారెడ్డితోపాటు ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ, స్థానిక కార్పొరేట‌ర్ అమిత్ ప‌టేల్‌, హాస్పిట‌ల్ సిబ్బంది, వైద్యాధికారులు త‌దిత‌రులు ఉన్నారు.