స.వి.శ.లు వున్నారు జాగ్రత్త!

అరణ్య కృష్ణ.

కత్తో, గొడ్డలో, తుపాకో పట్టుకొని అతనొస్తాడు మన ముందుకు. మనం ఆరాధనగా చూస్తాం. కనబడ్డవాడినల్లా అడ్డంగా నరికేస్తుంటాడు అమ్మతోడుగా. ఒక ఏకే 47 తుపాకీ పట్టుకొని శతృవుల దేహాలలో బుల్లెట్టు విత్తనాలు నాటి నెత్తుటి సేద్యం చేస్తాడు. మనం మైమరిచిపోతాం.అతను దేన్నీ లక్ష్య పెట్టడు. చట్టాన్ని ఖాతరు చేయడు. రాజ్యాంగ వ్యవస్థల్ని వెంట్రుక ముక్కలా తీసి పారేస్తాడు. మనం నడిచొచ్చిన నాగరికతల్ని చిన్న చూపు చూస్తుంటాడు. అయినా సరే మనం చప్పట్లు కొడుతుంటాం.అతను స్త్రీలని ఎగతాళి చేస్తుంటాడు. క్రూరంగా పరిహసిస్తుంటాడు. ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ చేతులేసి వేధిస్తుంటాడు. జడ పట్టుకు గుంజుతాడు. ఎత్తి పడేస్తుంటాడు. పిరుదుల మీద దరువేస్తుంటాడు. అయినా మనం కళ్ళప్పగించి మైమరుపుతో చూస్తుంటాం.అతను దొంగతనాలు చేస్తుంటాడు. దోపిడీలు చేస్తుంటాడు. స్థలాలు కబ్జా చేస్తుంటాడు. అయినా మనం అతనిలో ఉదాత్తతని వెతుక్కుంటాం.అతను బాధ్యతారహితంగా ప్రభుత్వ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తుంటాడు. మోసం చేస్తుంటాడు. మాఫియా నేర సామ్రాజ్యాల్ని విస్తరిస్తుంటాడు. కోర్టుల్ని మోసగిస్తుంటాడు. అయినా సరే మనం అతనికి ఈలలేసి చొక్కాలు చించుకొని అభిమానం ప్రదర్శిస్తుంటాం.

అతనే మన సినిమాల్లో హీరో!

ఎక్కడో అరుదుగా తప్ప మన హీరోలందరూ (అదేదో సినిమాలో నాగభూషణం వెటకారంగా అన్నట్లు) స.వి.శ.లే (సంఘ విద్రోహ శక్తులే). అందుకే మన ఫెమినిస్టు కవి సావిత్రిగారు “మన హీరోలందరూ నిజానికి విలన్లు” అన్నారు.
రజనీకాంత్ నుండి రవితేజ వరకు అతని పేరేదైనా కావొచ్చు. అతను సిల్వర్ స్క్రీన్ హీరో. ఒక్కడే అన్ని సినిమాల్లో పాత్రల్ని పోషించలేడు కాబట్టి ఒక్కో సినిమాలో ఒక్కొక్కడు హీరోగా అవతరిస్తుంటాడు. అది చిరంజీవైనా లేదా మొన్నే హీరోగా ప్రమోషన్ పొందిన షకలక శంకర్ అయినా సరే హీరోగా ఎవరేసినా అచ్చం హీరోలా చేయాల్సిందే. వాడు ఐదడున్నరడుగులున్నా లేదా ఆరున్నర ఎత్తున్నా, ఛాతీ ముప్ఫైన్నరున్న లేదా ఛప్పన్నారున్నా వాడి హీరోయిజం మాత్రం ఒక్కటే. హింస, అసభ్యత, నేరాలు, ఘోరాలే హీరోయిజం. తిరుగుబాటులో ప్రేమ వుంటుంది. వొట్టి హింసలో కేవలం ద్వేషం మాత్రమే వుంటుంది. మన సినిమాలు రెండొ పనే చేస్తుంటాయి. వ్యవస్థ మీద హేతుబద్ధమైన విమర్శని కాకుండా వ్యక్తిగత ద్వేషం, కసి రేకెత్తించి ఆలోచనల్ని హింసానందంలో ముంచేసే ప్రక్రియే మన సినిమా హీరోయిజం. మనం ఈ హీరోయిజానికి కట్టు బానసలమయ్యాం. ఆ హీరోయిజానికి గుడ్లప్పగించి మరీ జేజేలు కొడుతుంటాం. జులాయితనంతో, రౌడీయిజంతో, గూండాగిరితో, స్మగ్లింగ్ తో, మాఫియాతో నిజ జీవితంలో ఒక ఐదు నిమిషాలు కూడా భరించలేని ప్రవర్తనతో వుండే సినిమా హీరోయిజానికి మాత్రం మనం వొంగొంగి మరీ సలాం చేస్తుంటాం.ఇది మనలోని వైరుధ్యమా? ఆలోచించలేని మన బలహీనతా? లేక మనలోని సున్నితత్వాన్ని చంపేసే వాణిజ్య వ్యూహమా?

“సినిమా అంటే వ్యాపారం. దాని లక్ష్యం సంఘ సేవ కాదు. సినిమా పరిశ్రమ మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి. తీసేవాడికి లెక్కలుంటాయి. సినిమాని సినిమాలా చూడండి” అనే రొడ్డకొట్టుడు వాదనలని, ఉచిత సలహాలను నివారించటానికి సినిమా ప్రయోజనం ఏమిటనే చర్చని ఇక్కడ తీసుకురాను. చేయను. మంచి సినిమా, చెడ్డ సినిమా లక్షణాల గురించి చర్చించను. ఆర్ట్ ఫిలింస్, ఆఫ్ బీట్ ఫిలింస్ ప్రస్తావన కూడా చేయను. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెనగళ్, ఆదూరు గోపాలకృష్ణన్ ఎవరో కూడా నాకు తెలియదనే ఒప్పేసుకుంటాను. అసలు సామాజిక స్పృహ అన్న విషయాన్నే ముట్టుకోను. కాసేపు ఈ వ్యాసార్ధం (అంటే ఈ వ్యాసం కోసం అన్నమాట) సినిమా ప్రయోజనం వినోదమే అని ఒప్పేసుకుంటా. అయితే ఒక ప్రశ్న మాత్రం అనివార్యం. వినోదానికి మాత్రం మానవీయ విలువలుండాల్సిన అవసరం లేదా? ఎన్నో వేల సంవత్సరాల నాగరిక ప్రయాణం అనంతరం కూడా సంఘ విద్రోహ శక్తుల్ని కథానాయకులుగా చూపటం, శారీరిక బలానికి ఆరాధనీయతని ఆపాదించటం, హింస పట్ల ఆకర్షణ పెంచటం, నేర ప్రవృత్తిని కీర్తించటం, నేరస్తుడికి చప్పట్లు కొట్టేలా చేయటం, బహుభార్యత్వం లేదా అమ్మాయిలను ఏడిపించటం వంటి పురుషాధిపత్యపు డ్రైనేజి పొంగించటం, హీరోగారి కోసం స్త్రీలని భయంకరంగా ఆబ్జెక్టిఫై చేయటం వినోదం కిందకి వస్తే ఆ వినోదం ఆక్షేపణీయం కాదా? వినోదం అనగానే దుష్ట విలువల్ని బేషరుతుగా ఆమోదించాల్సిందేనా? అసలు కొట్టడం, తన్నటం, అవమానించటం వంటి చీప్ లక్షణాలేనా వినోదపరచటానికి అవసరమైన దినుసులు? వినోదం పేరుతో ఈ ఎదవ పనులు చేయని ఒక్క అగ్ర హీరోని చూపండి. వాళ్ళందరూ బలాదూర్, జులాయి, పోకిరి, డాన్, టెర్రర్, టెంపర్ గాళ్ళు కాదా?నిజానికి మన హీరోల పాత్ర రూపకల్పనలోనే ఒక భూస్వామ్య దురహంకారం వుంటుంది. అది ప్రధానంగా హీరోల కోసం ప్రత్యేకంగా వండించిన పంచ్ డైలాగుల్లో మరీ వ్యక్తమౌతుంటుంది. విపరీతమైన దురహంకారం, సిగ్గులేకుండా స్వంత డబ్బా కొట్టుకోవటం లేదా బరితెగించి ఇతర పాత్రల్ని చులకన చేయటం. ఈ హీరోలు ప్రధానంగా “మగతనం” అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఆధార పడుతుంటారు. “ఆడు మగాడ్రా బుజ్జీ” “మగాడివైతే రా” “సింహాలతో సెల్ఫీ” “మచ్చల పులి”…ఈ వ్యక్తీకరణలన్నింటినీ మగతనానికి ముడిపెట్టడం ద్వారా మగతనం అంటే దురహంకారం, హింస అని తేల్చి చెప్పటమే కదా! నిన్న మొన్న (నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో) దుర్మరణం పాలైన లేటు వయసు యాక్షన్ హీరో హరికృష్ణ కూడా ఒక సినిమాలో “మగాడు అన్నాక తెగింపు ఉండాలిరా! చావుకి మనం భయపడకూడదు. చావే మనల్ని చూసి భయపడాలి!” అని హుంకరించాడు. అసలే ఎల్లలు లేని పురుషాధిక్యతతో కునారిల్లే సుందర ముదనష్టపు వ్యవస్థలో ప్రేక్షకుల మెదళ్ళని అదే భావజాలంతో మరింత విషపూరితం చేసి, క్రేజ్ పెంచుకొని తమ వాణిజ్య ప్రయోజనాలకి అనుగుణంగా సినిమాలు తీయటమే వినోదమా? నాని, శర్వానంద్ వంటి కొద్దిమందిని మినహాయిస్తే పంచ్ డైలాగులతో పనికానిచ్చే మన హీరోలు ఏ రకంగానూ కథానాయకులు కారు.మన హీరోలు బాబాల్ని మించినోళ్ళు. ఒంటి చేత్తో కార్లనెత్తి పారేయటం, ఒక్క తన్ను తంతే జీపులు ఎగిరిపడటం వంటి విడ్డూర మానవాతీత విన్యాసాలు మన హీరోలకే సాధ్యం. సన్నివేశాన్ని బలంగా తీర్చిదిద్దలేని, ప్రేక్షకులని సృజనాత్మకంగా కట్టి పడేయలేని భావ దారిద్ర్యానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు హీరోయిజం. ఒకప్పుడు బానపొట్టల్ని గర్భ టక్ లో దాచేసుకొని చిన్న చిన్న గంతులేసినా, డూపుల్ని పెట్టుకొని యాక్షన్ సన్నివేశాల్ని లాగించినా, ఇప్పుడు సిక్స్ పాక్ బాడీలో నిగనిగలాడే కండలు చూపించినా మన హీరోలకి నిజంగా “స్టంట్స్” అనే కళ ఎప్పుడూ తెలియదు. నిజంగా మార్షల్ ఆర్ట్స్ ఎంతో కొంత తెలిసిన సుమన్, భానుచందర్ వంటి హీరోలు ఇప్పుడైతే అసలు లేరు. అంతా కెమెరా ట్రిక్స్. గ్రాఫిక్ మాయాజాలం. రోప్ ట్రిక్స్. సినిమా సగభాగం ఏ పీటర్ హెయిన్సో లేదా రాం లక్ష్మణో లాగించేస్తుంటారు. మన ప్రేక్షకులు ఈ పిచ్చ పిచ్చ ట్రిక్స్ కే మురిసిపోతుంటారు. ముప్ఫై ఏళ్ళ క్రితం తన “స్టిఫ్” కదలికలతో కృష్ణ చేసే ఫైటింగులకీ ఇప్పుడు ప్రభాస్ వంటి కండలవీరుడు చేసే ఫైటింగులకీ వున్న తేడా ఏమిటంటే కొన్ని ట్రిక్స్, ఫైటింగ్ సీన్ల కోసం బడ్జెట్ పెరగటమే. ఏ మాత్రం ఒరిజినాలిటీ లేకపోవటమే హీరోయిజమా?
హాలీవుడ్ సినిమాల్లో కూడా యాక్షన్ సీన్లు వుంటాయి. కానీ వాటిని “స్టంట్స్” అనాలి. అంటే ప్రధానంగా విన్యాసాలన్న మాట. వాళ్ళ సినిమాల్లో రాం లక్ష్మణ్ తరహా వొంటి చేతి వీరబాదుడు ఫైటింగ్లుండవు. అలా చేయించాలనిపిస్తే వాళ్ళు స్పైడర్ మాన్, బాట్ మాన్ వంటి ఫాంటసీ పాత్రలనే సృష్టిస్తారు. పాపం వాళ్ళు అమాయకులు కదా అందుకే అటువంటి సినిమాల్లో కూడా బలమైన విలన్ని కూడా సృష్టిస్తుంటారు. వాళ్ళ సినిమాల్లో అసలు హీరోలుండరు. కేవలం లీడ్ కారెక్టర్లు మాత్రమే వుంటాయి. వాళ్ళ యాక్షన్ సినిమాల్లో ఒకే సమ ప్రాధాన్యతతో హీరో, విలన్ల మధ్య ఘర్షణే సినిమాగా రూపుదిద్దుకుంటుంది.సినిమా అనేది వినోద వ్యాపారం కాబట్టి, దాని మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి వుంటాయి కాబట్టి మనం దాని మంచి చెడులు మాట్లాడకూడదని ఒక బూకరింపు తరచు ముందుకొస్తుంటుంది. అయితే మరి సో కాల్డ్ హీరోల సినిమాలు ఎందుకు గల్లా పెట్టె దగ్గర విఫలం అవుతున్నాయి? ఓవర్సీస్ వసూళ్ళు కూడా ఆదుకోలేకపోతున్నాయి. బాధ్యతారహితంగా, చెత్తగా తీసే అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఎన్ని వేల కుటుంబాలు నష్టపోయి వుంటాయి? అసలు ఎంత బాగా ఆడినా నష్టం వస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకంటే కోట్లల్లో వుండే హీరోల పారితోషికాలు సినిమా నిర్మాణ వ్యయంలో ముఖ్య భాగం. మరిప్పుడు చెప్పండి తమ స్వార్ధానికి సినిమా నిర్మాణ వ్యయం పెంచే హీరోలు సినిమాల్లో ఎలాగూ మంచివాళ్ళు కాదు కానీ కనీసం పరిశ్రమకైనా విలన్లు కాకుండా వున్నారా? తెర మీద, తెర వెనుక కూడా వాళ్ళు విలన్లే.దొంగ, రౌడి, గూండా, పోకిరి, బలాదూర్, డాన్, లోఫర్ అయిన మన సినిమా హీరోని దృష్టిలో వుంచుకొని మీకెవరి మీదనైన కోపం వస్తే “నువ్వు మనిషివా లేకపోతే సినిమా హీరోవా?” అని అడిగితే తప్పేమిటంట! అహ, అసలు తప్పేంటట?