హృదయం పదిలం పదిలం.

హైదరాబాద్:

మనిషి శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగం గుండె. పిడికెడంతే ఉండే గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని పంపించి మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న పోటీతత్వం, యాంత్రిక జీవితంతో గుండెకు కొండంత కష్టాలొచ్చిపడుతున్నాయి. ఎంతో సున్నితమైన ఈ గుండెను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2020 నాటికి భారత్‌లో గుండెపోటు బాధితుల సంఖ్య పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది. గుండె సంరక్షణ, హృదయ సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 1999 నుంచి ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే) నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల విస్తరణతో నెటిజన్లలో కూడా గుండె ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ప్రస్తుతం ట్విట్టర్, ఫేస్ బుక్ లలో గుండె జబ్బులు, గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం, అలవాట్లపై పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.