హైకోర్టు తీర్పు టిఆర్ఎస్ కు షాక్!

చట్ట సభలు ఏ నిర్ణయం తీసుకున్న అవి సహేతుకంగా ఉన్నాయని ప్రజలు భావించాలి. శాసనసభ్యుల బహిష్కరణ వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత సభ్యులకు నోటీసులు పంపడం,వారి అభిప్రాయాలు లేదా వాదనను వినడం వంటి ప్రక్రియ జరిగితే ప్రజాస్వామ్య ప్రియులు హర్షించేవారు.ఆ ప్రక్రియ జరగనందున కోమటిరెడ్డి, సంపత్ ల వాదనలకు బలం చేకూరింది.తమపై అకారణంగా బహిష్కరణ వేటు వేశారన్న వారి ఆరోపణలకు సహజంగానే విలువ పెరిగింది.మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు అసలు గాయమే కాలేదన్నది కోమటిరెడ్డి,సంపత్ మరో ఆరోపణ. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ‘దాడి’ చేసినట్టు చెబుతున్న వీడియో ఫుటేజ్ ను బహిర్గతం చేయాలని వారు సవాలు చేశారు.ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఈ ఎపిసోడ్ లో అడ్వకేట్ జనరల్ ప్రకాషరెడ్డి రాజీనామా చేయడం మరొక మలుపు.

హైదరాబాద్;
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాలను రద్దు చేయడాన్ని తప్పు బడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అధికార పక్షం టిఆర్ ఎస్ శాసనసభ్యులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.ఇది అధికార పక్షానికి చెంపపెట్టు వంటిది.కోమటిరెడ్డి , సంపత్ ల శాసన సభ్యత్వాలను రద్దుచేస్తూ గత మార్చి 13 న తెలంగాణ శాసనసభ నిర్ణయం తీసుకున్నది.ఆ ఎం.ఎల్.ఏ లు ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ,ఆలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టు కూడా ప్రకటించారు.దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. కోమటిరెడ్డి, సంపత్ ల బహిష్కరణ నిర్ణయం చెల్లదని హైకోర్టు గత ఏప్రిల్ 18న తీర్పు నిచ్చింది.వారి సభ్యత్వాలను కూడా పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది.శాసనసభ, శాసనమండలి లను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి.ఒక దశలో ప్రతిపక్షాల వైపు నుంచి హెడ్ ఫోన్ సెట్ ఒకటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తాకింది.ఆయన కంటికి గాయమైంది.మార్చి 14 న శాసనసభ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్షనాయకుడు కె.జానారెడ్డి సహా 11 మంది శాసనసభ్యులను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు.కోమటిరెడ్డి, సంపత్ లను ఏకంగా బహిష్కరిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశాపెట్టింది.శాసనసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.ఈ పరిణామాల తర్వాత కోర్టు తలుపు తట్టిన ఇద్దరు బహిష్కృత శాసన సభ్యులకు ఊరట లభించింది.వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఇచ్చిన తీర్పును ఖాతరు చేయకపోగా ఆ తీర్పునే సవాలు చేస్తూ టిఆర్ ఎస్ కు చెందిన 12 మంది శాసన సభ్యులు పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ‘దాడి’ ఘటన సమయంలో తాము కూడా సభలోనే ఉన్నామని తమ వాంగ్మూలాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని కోమటిరెడ్డి, సంపత్ లపై నిషేధాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలన్నది వారి వాదన.హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం,ఎన్నికల కమిషన్ మాత్రమె ప్రతివాదులని శాసనసభ్యులకు సంబంధం లేదని కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి అన్నారు.ప్రభుత్వ పక్షాన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ వాదించారు.చివరకు టిఆర్ఎస్ శాసనసభ్యుల పిటిషన్ కు విచారణ అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టిఆర్ఎస్ శాసనసభ్యులు పిటిషన్ దాఖలు చేయడాన్ని బట్టి ప్రభుత్వం ఒంటెత్తు పోకడలను బహిర్గతం చేసుకున్నది.చట్ట సభలు ఏ నిర్ణయం తీసుకున్న అవి సహేతుకంగా ఉన్నాయని ప్రజలు భావించాలి. శాసనసభ్యుల బహిష్కరణ వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత సభ్యులకు నోటీసులు పంపడం,వారి అభిప్రాయాలు లేదా వాదనను వినడం వంటి ప్రక్రియ జరిగితే ప్రజాస్వామ్య ప్రియులు హర్షించేవారు.ఆ ప్రక్రియ జరగనందున కోమటిరెడ్డి, సంపత్ ల వాదనలకు బలం చేకూరింది.తమపై అకారణంగా బహిష్కరణ వేటు వేశారన్న వారి ఆరోపణలకు సహజంగానే విలువ పెరిగింది.మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు అసలు గాయమే కాలేదన్నది కోమటిరెడ్డి,సంపత్ మరో ఆరోపణ. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ‘దాడి’ చేసినట్టు చెబుతున్న వీడియో ఫుటేజ్ ను బహిర్గతం చేయాలని వారు సవాలు చేశారు.ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఈ ఎపిసోడ్ లో అడ్వకేట్ జనరల్ ప్రకాషరెడ్డి రాజీనామా చేయడం మరొక మలుపు.అయన రాజీనామా బహిష్కృత శాసన సభ్యుల వాదనలను మరింత బలోపేతం చేశాయి. వీడియో ఫుటేజ్ విడుదల వ్యవహారంపై సభ దే అంతిమ నిర్ణయమని ప్రభుత్వం ఓ దశలో తెలిపింది.అటు శాసనసభ దీనిపై మౌనం పాటించింది.చట్టసభలలో అధికారపక్షం ఏమి అనుకుంటే అదే జరుగుతుంది. ఇది కొత్తేమీ కాదు.అయితే అనుకున్నదాన్ని ఆగమేఘాల మీద అమలుచేసేయవచ్చుననుకుంటే భంగపాటు తప్పదని సోమవారం నాటి హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పకనే చెప్పింది.