హైటెక్ హంగులతో న్యూ సెక్రటేరియట్. 6 లక్షల చ. అడుగుల్లో నిర్మాణం.


Hyderabad:

హైటెక్ హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో
కొత్త సచివాలయం నిర్మాణం జరగనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సమావేశ మందిరాలు, సౌకర్యాలు ఉంటాయి.
డీ బ్లాక్ వెనక పోర్టికో ఎదురు గార్డెన్ లో
శంకుస్థాపన ఉంటుంది. కొత్త సచివాలయం నిర్మాణ సిఫారసుల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు.మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ లతో సబ్ కమిటీ ఏర్పడింది.విశ్వనగరం హైదరాబాద్ కే తలమానికంగా కొత్త సచివాలయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుత సచివాలయం పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. ప్రాంగణంలోని పాత భవనాలన్నీ ఏరేసినట్లుగా చిందర వందరగా ఉన్న విషయం తెలిసిందే. నిర్మాణాలన్నీ కాలం చెల్లిపోయి భద్రత లేకుండా తయారయ్యాయి. ఫైర్ సేఫ్టీ, వీవీఐపీల భద్రత ఇక్కడ గాల్లో దీపమే. ప్రభుత్వ అధికారులను సంప్రదించడానికి వచ్చే, దేశ, విదేశీ అతిథులకు కనీస సౌకర్యాలు కూడా లేని దుస్థితిలో ప్రస్తుత సచివాలయం ఉందంటే ఆశ్చర్యం లేదు. ఆర్థికవృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణా అగ్రస్థానంలో ఉంది. అలాంటిది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలను కలవడానికి వస్తే, ఉండాల్సిన రీతిలో కనీస సదుపాయాలు లేకపోగా, అనేక లోపాలు సచివాలయంలో వాళ్ళకు సాక్షాత్కరిస్తుంటాయి.