హైదరాబాద్ లోనూ అక్రమ చొరబాటుదారులు!!

హైదరాబాద్:
హైదరాబాద్ లో కూడా అక్రమ చొరబాటుదారులు ఉన్నారని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో 4,000 మంది ‘రోహింగ్యాలు’ ఉన్నారని.. వాళ్లు బర్మా నుంచి ఇక్కడికి ఎందుకు, ఎలా వచ్చారని ప్రశ్నించారు. మతతత్వ పార్టీ అయిన మజ్లిస్ విదేశీయులకు అండగా ఉంటున్నందువల్లే వారి ప్రాబల్యం ఉన్నచోట బర్మా కాలనీ ఏర్పడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల కోసం దేశాన్ని ధర్మసత్రంగా మార్చారని విమర్శించారు. ఎన్సీఆర్ అనేది ఒక మతానికో, ప్రాంతానికో సంబంధించింది కాదని.. దేశభద్రత, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడినవారు అస్సాంలో 50 లక్షలకు పైగా ఉన్నట్టు ఎన్సీఆర్ లో తేలిందని.. బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్ర్రాల్లో కోట్ల సంఖ్యలో నివసిస్తున్నఈ అక్రమ చొరబాటుదారులు ఇక్కడి మైనారిటీలు పొందాల్సిన హక్కుల్ని పొందుతున్నారని కిషన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. విదేశీయుల కోసం పార్లమెంటును స్థంభింపజేస్తోందని ఆరోపించారు.