హౌజింగ్ కేసు అటకెక్కిందా!!? “ఉత్త” మీడియా హడావిడేనా?

హైదరాబాద్:

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ‘హౌజింగ్ కేసు’  తాత్కాలికంగా అటకెక్కినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇప్పుడప్పుడే ఈ ‘కేసు’ మళ్ళీ వెలుగు చూడకపోవచ్చునని అంటున్నారు. తనపై హౌజింగ్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే ఖండించారు. తనపై ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలని, ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడితే తాము ప్రజాకోర్టులో తేల్చుకుంటామని కూడా ఆయన సవాలు చేశారు. గతంలో హౌసింగ్ పధకంలో అవకతవకలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తం కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు  ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందనే సంకేతాలతో వార్తా కధనాలు వెలువడి నెల గడిచిపోయింది.’ఉత్తమ్ పై గురి’, ‘ఉత్తమ్ మెడపై వేలాడుతున్న కత్తి’ , ‘ఉత్తమ్ మెడకు సిఐడి ఉచ్చు’ వంటి ఆసక్తిని రేకెత్తించే శీర్షికలతో పత్రికలు కధనాలు రాశాయి. పత్రికల్లో వచ్చిన వార్తలను, ఆయా కధనాలను తప్పుబట్టవలసిన అవసరం లేదు. తగిన ‘మోతాదు’లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ‘లీకులు’, సరంజామా మీడియాకు  వచ్చి ఉండవచ్చును.కానీ ఆ తర్వాత  చడీ చప్పుడు లేదు. స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపై ‘ఇక రేపో మాపో చర్యలు’ అంటూ హడావిడి జరిగింది. ఆ వార్తా కధనాల ఉద్దేశమేమిటో అర్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కొంత కాలంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదితర నాయకులూ బస్సుయాత్రల పేరుతో సభలూ, సమావేశాలను జరుపుతున్నారు. జనంలో ఆసక్తిని కలిగిస్తున్నారు.కాంగ్రెస్ శ్రేణులలో ఉత్తేజం నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రభుత్వంపై వ్యతిరేకత నేరుగా కంటికి కనపడకపోయినా వివిధ రూపాల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నమ్ముతున్నది. అందువల్ల ఆ అసంతృప్తిని,వ్యతిరేకతను టిపిసిసి నేతలు ‘మూట’ కడుతున్నందున ప్రధాన ప్రతిపక్షాన్ని భయకంపితం చేసేందుకు గాను ప్రభుత్వం  ‘కేసులు’  తయారు చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులంటున్నారు. పాత కేసులను తిరగదోడే పనికి హుటాహుటిన ప్రభుత్వం గత నెలలో పూనుకున్నట్లున్నది.2004-2014 మధ్య ఇందిరమ్మ గృహ నిర్మాణ పధకంలో, రాజీవ్ స్వగృహ పధకంలో  అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఇదివరకే, చాలా కాలం క్రితమే విజిలెన్సు అధికారులు నివేదికలు సమర్పించారు. మరి ఇంత కాలం ఆ నివేదికలపై చర్యలకు పూర్తిస్థాయిలో ఎందుకు పూనుకోలేదో,ఈ వ్యవహారంలో అప్పటి హౌజింగ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న ‘లింకులు’ ఏమిటో ఎవరికీ తెలియదు. విజిలెన్సు నివేదికల ఆధారంగా కేసుపై సి.ఐ.డి.విచారణ జరుపుతున్నదంటూ ప్రభుత్వ వర్గాలే ఇంతకు ముందు తెలిపాయి. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన అనంతరం సిఐడి కి అప్పజెప్పిన కొన్ని  కేసుల్లో ఇందిరమ్మ ఇళ్ళ అక్రమాల కేసు కూడా ఉన్నది.సి.ఎం.ఆర్.ఎఫ్, ఇంజనీరింగ్ కాలేజీలలో అక్రమాలు, ఎం సెట్ ప్రశ్నపత్రం లీకేజీ  వంటి కేసులను  కూడా సిఐడి చేపట్టింది.ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అవినీతికి పాల్పడిన 225 మంది ఫై క్రిమినల్ కేసులు నమోదు చెసినట్టు 2016 డిసెంబర్ లో కెసిఆర్ శాసనసభకు చెప్పారు.ఇందులో 122 మంది అధికారులు ,113 మంది దళారీలు ,రాజకీయనాయకులుఒక జడ్పీటీసీముగ్గురు ఎం.పి.టి.సి.లు14 మంది సింగల్ విండో చైర్మన్లు,ఉన్నారని ఆయన వివరించారు.512 మంది గృహ నిర్మాణ శాఖ అధికారులను ఏకంగా తమ ఉద్యోగాల నుంచి తొలగించారు. మరో 140 మందిని సస్పెండ్ చేశారని ముఖ్యమంత్రే గుర్తు చేశారు. 122 మందిపై ఆరోపణలు రుజువై శిక్షలు పడ్డాయని చెప్పారు. 2.86 కోట్లను రికవరీ చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిని బయటకు తీసుకురావాలని  తాము అధికారంలోకి రాగానే 2014లో సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని కెసిఆర్  తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లపై సర్వే చేసి వాస్తవంగా ఇండ్లు కట్టుకున్న వారిని గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశించామని చెప్పారు. రెవెన్యూ బృందాలు గ్రామాల్లో పర్యటించి లక్షా 19 వేల మంది బోగస్ లబ్దిదారులున్నట్లు గుర్తించారు.  రాజీవ్ స్వగృహ పధకంలో భారీ కుంభకోణం జరిగినట్టు తన విచారణలో సిఐడి  గుర్తించినట్లు కొంతకాలంగా  ప్రచారం జరుగుతున్నది.అయితే ఈ స్కాం తో అప్పటి గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న ప్రమేయం,లావాదేవీలు,లింకుల సంగతి పూర్తిగా బయటకు రాలేదు. రాజీవ్ స్వగృహ పధకం కింద ఇళ్ళ నిర్మాణాన్ని 10 కంపెనీలు చేపట్టగా అందులో రెండు కంపెనీల పట్ల ఉత్తమ్ ప్రత్యెక ‘ప్ర్రేమాభిమానాలు’ చూపారన్న అభియోగం ఉందంటూ సిఐడి పరిశోధనలో తేలినట్టు ఒక ప్రచారం ఉన్నది. ఇందులో దాదాపు 159 కోట్లకు పైగా చేతులు మారాయన్నది ఒక ఆరోపణ. ఈ ప్రచారం,కధనాలు నిజంగానే  సిఐడి విచారణ నివేదికలోని అంశాలను ఆధారం చేసుకొని జరుగుతూ ఉంటె ఉత్తమ్ ‘దోషి’గా బోనెక్కవలసిందే.సిఐడి నివేదిక ‘కాన్ఫిడెన్శియల్’ కనుక ప్రభుత్వం బయట పెట్టకపోవచ్చును.రాజకీయప్రముఖునికి సంబంధించిన కేసు అయినందున ప్రభుత్వం/అధికార పక్షం ‘మరిన్ని జాగ్రత్తలు’ తీసుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై కెసిఆర్ ప్రత్యెక దృషి పెట్టి ఉంటె పరిపాలనపైన, సంక్షేమ కార్యకలాపాలపైన ఆయనకు  సమయం సరిపోదేమో.ప్రభుత్వాలు మారినప్పుడల్లా అదివరకటి అధికార పార్టీ చేసిన ‘అవకతవకల’పై  తాజా అధికారపక్షం విచారణ, నేరపరిశోధన,నిజానిజాలు, దోషులు  అంటూ కొంతకాలం హడావిడి చేయడం తర్వాత దాని ఊసు ఎత్తకపోవడం కొత్తేమీ కాదు.ఇప్పుడూ అలాగే భావించాలా? ‘ఉత్తమ్ మెడపై కత్తి వేలాడడం’ ఉత్తదేనా? రాజకీయప్రత్యర్ధుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి మాత్రమె హౌజింగ్ స్కాం ను  వెలుగులోకి తీసుకు వచ్చారా?ఉత్తమ్ వ్యవహారాన్ని ప్రభుత్వం నిజంగానే కదిలిస్తే కాంగ్రెస్ కూడా ‘కౌంటర్ అస్త్రాలు’ రెడీ చేసుకున్నట్టు తెలియవచ్చింది.