‘10 టివి’ అమ్మకంలో ‘చీకటి కోణాలు’.

ఎస్.కె.జకీర్.
‘ప్రజల గొంతుక’ గా ఉండవలసిన ‘టెన్ టివి’ చివరకు కార్పొరేట్ వర్గాల వశమైంది‌.‌ ఈ మొత్తాన్ని ఒక సీనియర్ నాయకుడు, ‌మాజీ రాష్ట్ర కార్యదర్శి దగ్గరుండి పర్యవేక్షించినట్టు తెలియవచ్చింది.‌’రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్’ వివరాల ప్రకారం ప్రజల నుండి టివి కోసం‌ నిధులు వసూలు చేసినపుడు ‘అభ్యుదయ ‌బ్రాడ్ కాస్టింగ్స్’ పేరు మీద షేర్లు జారీ చేశారు. కానీ ప్రస్తుతం టివిని నడుపుతున్న ‘స్పూర్తి కమ్యూనికేషన్స్’ లో అభ్యుదయ వాటా ఇరవై శాతం‌ మాత్రమే.‌ మిగిలిన ఎనభై శాతం ‘ప్రజాశక్తి సాహితీ సంస్థ’ కు అమ్మేశారు‌. ఆ నిధులు కూడా ‘టివి’ నిర్వహణ లో నే వృధా అయ్యాయని తెలుస్తున్నది. తాజాగా ‘టెన్ టివి’ అమ్మకం‌ పూర్తి అయ్యాక ప్రజల నుండి వసూలు చేసిన పెట్టుబడులు తిరిగి చెల్లించవలసి ఉన్నది. అలా చెల్లించాలంటే అమ్మకంతో వచ్చిన మొత్తం నిధులు ‘అభ్యుదయ కంపెనీ’ ఖాతాలో నే జమ కావాలి. దీనికి వీలుగా సిపిఎం ‘ప్రముఖుని’ కనుసన్నల్లో ఎనభై శాతం గా ఉన్న ‘ప్రజాశక్తి ‘వాటాలు అభ్యుదయ కొనుగోలు చేసినట్టు రికార్డ్ క్రియేట్ చేశారు. ‘అభ్యుదయ కంపెనీ’ వద్ద ఎనభై శాతం షేర్లు కొనగల ఆర్ధిక సామర్ధ్యం‌ ఉంటే అందులో కొంత సొమ్ము పెట్టుబడిగా పెట్టి ‘టివి’ ని నడిపించొచ్చు. కానీ అలా జరగటం లేదన్నది ఆసక్తికర అంశం. ఏ ప్రమోటర్ అయినా తాము ప్రారంభించిన కంపెనీని నిలబెట్టుకునేందుకు సకల ప్రయత్నాలూ చేస్తారు.‌ కానీ ‘టెన్ టివి’ యాజమాన్యం ‌దీనికి భిన్నంగా అమ్మటానికి అన్ని ప్రయత్నాలూ చేసింది.‌ ఈ మొత్తం వ్యవహారంలో చట్టపరంగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ప్రజాశక్తి’కి ఉన్న ఎనభై శాతం వాటాలను అభ్యుదయ కంపెనీ ఎప్పుడు కొన్నది అనే ప్రశ్న కీలకం. ఎందుకంటే ‘అభ్యుదయ‌’ సంస్థ ఈ పనులు చేయటానికి ముందు ఇంత పెద్ద కీలక ఆర్థిక నిర్ణయం తీసుకోవటానికి ముందు ‘వాటాదారుల వార్షిక సమావేశం’ నిర్వహించాలి. అటువంటి సమావేశం జరపకుండా ఈ‌ అమ్మకాలు కొనుగోళ్ళు నిర్వహిస్తే అది ‘చట్ట విరుద్ధం’ అవుతుంది. మొత్తంగా ‘టెన్ టివి’ని అమ్మకానికి పెట్టాక ‘ప్రజాశక్తి వాటా’లు నామమాత్రపు ధరలకు కొనుగోలు చేస్తే ‘వాటాదారుల’ ప్రయోజనాలకు నష్టం తెచ్చిపెట్టే దురుద్దేశ్యంతోనే ఆ లావాదేవీలు నిర్వహించినట్టు స్పష్టమవుతుంది.‌ వీటిలో ఏది చేసినా చట్ట వ్యతిరేకమే.‌అదికూడా ‘రహస్యంగా’. పార్టీ నాయకత్వం తాము చేస్తున్నది పూర్తిగా న్యాయసమ్మతం, చట్టబద్ధం అయితే ఈవ్య వహారాన్ని రాష్ట్ర ప్రజల కళ్ళు కప్పి ఎందుకు ‌చేయాలి ? అంటే తాము‌ చేస్తున్నది నీతిబాహ్యమైన పని అని నాయకత్వానికి తెలియదని ఎలా అనుకుంటాం. కార్యకర్తలను, ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకాన్ని ‘బలి’ చేస్తే పార్టీ మనుగడ సాధ్యమవుతుందా ? ‘టెన్ టివి’ని వాన్ పిక్ భూముల కేసుల్లో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన కంపెనీకి అమ్మటంలో ‘మతలబు’ ఏమిటి? నిమ్మగడ్డ ప్రసాద్ కు ఒకరిద్దరు సిపిఎం ప్రముఖులకు ఉన్న లావాదేవీలేమిటి? మూడేళ్ళ క్రితం ప్రకాశం జిల్లా పార్టీ కమిటీ వాన్ పిక్ భూములు దున్నాలి రైతులకు అప్పగించాలి అని డిమాండ్‌ చేసినపుడు ఆ కమిటీ నాయకులను తిట్టి ఆ డిమాండ్ ను ఉపసంహరించుకునేలా చేసింది ఎవరు? దాని వెనుక గూడు పుఠాణి ఏమిటి ? గచ్చిబౌలిలో ‘విజ్ఞాన ‌కేంద్రం’ నూతన భవనంలో ఒక ‘స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజిటైజేషన్ సెంటర్’ ప్రారంభించటానికి నిమ్మ గడ్డ ద్వారా ‘సిపిఎం ప్రముఖులు’ కోట్లాది రూపాయలు సేకరించినట్టు తెలుస్తున్నది.‌ ఆ తర్వాత ఆ కోట్లు ఏమయ్యాయో ఆ ‘డిజిటైజేషన్ సెంటర్’ ఏమైందో సదరు ‘సిపిఎం ప్రముఖుని’ కి మాత్రమే తెలియాలి.‌ ఈ మొత్తం వ్యవహారాలు పరిశీలిస్తే ‘సిపిఎం ప్రముఖుని’కి నిమ్నగడ్డ ప్రసాద్ కు మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయన్న అనుమానాలను పార్టీ కాడర్ వ్యక్తం చేస్తోంది. ఈ లావాదేవీల్లో భాగంగానే ‘టెన్‌టివి’ని నిమ్మగడ్డ ప్రసాద్ కు ‌కట్టబెట్టించారా అన్న ప్రశ్న తలెత్తడం సహజం. పైగా గతిలేక అమ్ముకుంటున్నా ఒక రూపాయి ఎక్కువకు అమ్ముకునేందుకు ఎవరన్నా ప్రయత్నం చేయడం సాధారణంగా జరుగుతుంది.‌ దానికి‌గాను నలుగురైదుగురు కొనుగోలుదార్లతో సంప్రదిస్తారు.కానీ ఇక్కడ ఒకే ఒక్క కొనుగోలుదారుడు ముందుకు రావటం, అంతకన్నా మంచి బేరం రాదు అని పార్టీ నాయకులే ఢంకా బజాయించి చెప్పుకోవటం, ఇతర బయ్యర్ల నుండి వచ్చిన ఆఫర్ల గురించి కనీసం‌ చర్చకు కూడా అవకాశం లేకుండా ‘డీల్’ క్లోజ్ చేయటం అనేక అనుమానాలకు అవకాశం కలిగిస్తున్నది.‌ ఈ వ్యవహారాలు ‘పార్టీ ఫోరం’ లల్లో చర్చ కు వస్థాయా? అలా చర్చలు జరిగితే ఆ పార్టీలో ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ ఎంత బలంగా ఉన్నదో అర్ధమవుతుంది.ఈ ‘చీకటికోణాలు’, గూడుపుఠాణి వ్యవహారాలను పక్కనబెడితే అసలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘ప్రజాగొంతుక ‘ను నులిమివేయడం ఏమిటన్న సందేహం సామాన్య ప్రజల్లో కలుగుతున్నది. ‘బహుజన లెఫ్ట్ ఫ్రన్ట్’ పేరిట కొంతకాలంగా సిపిఎం కార్యక్రమాలు నడిపిస్తున్నది. బి.ఎల్.ఎఫ్. కార్యకలాపాలు 10 టివిలోనే ప్రముఖంగా ప్రసారమవుతున్నవి. వచ్చే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రాంట్ పక్షాన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు ఇప్పటికే పలుమార్లు మార్క్సిస్టు నాయకులు ప్రకటించారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయగలిగిన 10 టివిని అమ్ముకుంటే భారీ నష్టమే కదా!