12000 మరణాలను చూసిన వ్యక్తి. “చితిమంటల” సత్యాలు.

వారణాసి:
కాశీలో మరణిస్తే “మోక్షం” ప్రాప్తిస్తుంది అని హిందువుల లో ఒక విశ్వాసం . అందుకోసం జీవిత అంత్యకాలం కాశీ లో గడపడానికి వెడుతూ ఉంటారు . అటువంటి వారికీ వసతిని కల్పించే ముఖ్య మైన మూడింటిలో కాశీ లాభ్ ముక్తి భవన్ ఒకటి . మిగతా రెండూ ముముక్షు భవన్ , గంగా లాభ్ భవన్ . 1908 లో కాశీ లాభ్ ముక్తి భవన్ స్థాపించబడింది . 44 సంవత్సరాల పాటు కాశీ లాభ్ ముక్తి భవన్ మేనేజరు గా పనిచేసిన భైరవ నాద్ శుక్లా ఆ భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో కూర్చుని చెప్పిన విషయాలు ఇవి.

1.అంత్య కాలానికి ముందే క్రోధాన్ని విడనాడు :
శ్రీ రాం సాగర్ అనే ఒక సంస్కృత పండితుడు ఆరుగురు అన్నదమ్ములలో పెద్దవాడు . చిన్న తమ్ముడు అంటే ఇష్టం . కానీ కాలక్రమం లో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది .ఆయన తన అంత్యకాలం లో కాశీ లాభ్ ముక్తి భవన్ లో మూడవ నెంబరు రూమ్ బుక్ చేసుకున్నారు . తాను ఇంకొక పదహారు రోజులలో చనిపోతాను అని ఆయనకు ముందే తెలుసు . 13 రోజులు గడిచిపోయాయి . 14 వ రోజున ఆయన తన విడిపోయిన తమ్ముడికి కబురు పెట్టాడు . “40 ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవపడిన విషయం నన్ను కలిచివేస్తోంది . నేను సుఖంగా మరణించలేను . నాలో ఉన్న క్రోధం పోవాలి” అన్నాడు .తమ్ముడు 16 వ రోజు నాటికి వచ్చాడు . తమ్ముడిని చూడగానే అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి . తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని తమ్ముడి తల నిమురుతూ “ఆ గోడ పడగొట్టేయ్యి” అన్నాడు . అన్నదమ్ములిద్దరూ భోరున విలపించారు . తమ్ముడి చేతిలో ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు అన్న .
“ఇటువంటి కధలు నేను ఎన్నో చూశాను . ఇక్కడకి వచ్చే వాళ్ళు బోల్డంత లగేజీతో వస్తారు . అందులో ఏదీ తీసుకువెళ్ళలేరు . జీవితం లో ఘర్షణలు లేకుండా ఎవరూ ఉండరు . కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది . అంత సంతోషం పొందుతారు” అని శుక్లా అన్నారు.

2.సాధారణం గా జీవించడం.
చనిపోతాము అని తెలిసిన దగ్గరనుండి చెత్త తిండి తినడం మానేస్తారు చాలామంది. అప్పటికి కానీ చాలామందికి తాము సింపుల్ జీవితం గడిపి ఉండవలసింది అని అనిపించదు . “సింపుల్ జీవితం అంటే తక్కువ ఖర్చుపెట్టడం . ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఎక్కువ సంపాదించాలి అనుకోవడం . ఎక్కువ తాపత్రయపడటం కన్నా తక్కువ లో సంతృప్తి పొందడం నేర్చుకుంటే ఆనందం గా జీవించవచ్చు” అని భైరవ నాద్ శుక్లా చెప్పారు.

3.ప్రజలలో చెడు మాత్రమె చూడకు.
“ ప్రతీ మనిషిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి . మనం ఎదుటివ్యక్తిలోని చెడును మాత్రమే చూసి మంచిని పట్టించుకోము . ఒక వేల మనం ఎదుటి వారి లోని చెడును గురించి కంటే వారి లోని మంచిని గుర్తిస్తే మనం వారితో స్నేహం మాత్రమె కాదు, వారిని అర్ధం చేసుకోవడమే కాదు. వారిని ప్రేమించడం కూడా నేర్చుకోగలం” అని భైరవ నాథ్ శుక్లా అన్నారు.

4.ఇతరుల సహాయం పొందడం కూడా నేర్చుకో.
మనం శక్తివంతులుగా తయారు కావడం మంచిదే కావచ్చు . కానీ మనమే అన్నీ చేసుకోగలం అనే గర్వమూ , అహంభావమూ మంచివి కావు . ఎంత శక్తిమంతుడైనా అన్నీ తానే చేసుకోలేడు. ఆ విషయం లో తాను ఇతరులకు సహాయ పాడడం తో పాటు ఇతరుల సహాయం అర్దించే ధైర్యం కూడా ఉండాలి .
ఈ ప్రపంచం లో ప్రతీ వ్యక్తీ ఏదో ఒక విషయం లో మనకంటే ఎక్కువ విషయ పరిజ్ఞానం కలిగిన వాడి ఉంటాడు . మనం అర్ధిస్తే అది మనకూ లభిస్తుంది. అని శుక్లా చెప్పారు.
“ఒక రోజు వర్షం కురుస్తూ ఉంటె కొందరు యువకులు ఒక ముసలామెను తీసుకుని వచ్చారు . వాళ్ళు వచ్చి ఆమెను జాయిన్ చెయ్యడానికి కావలసిన దరఖాస్తు నింపకుండా వెళ్ళిపోయారు . కొన్ని గంటలు గడిచాయి . పోలీస్ లు వచ్చారు . వాళ్ళ గురించి అడిగారు . నేను తెలియదు అన్నాను . ఆమెను తీసుకుని వచ్చిన వారు నక్సలైట్లు అని చెప్పారు పోలీస్ లు. మర్నాడు ముసలావిడ మనుషులు వచ్చినపుడు నేను అడిగాను.. మీరు ఒకే సారి 5 నుండి 8 మందిని షూట్ చేసి చంపగలిగినపుడు ఆ ముసలామెను కూడా అలా చెయ్యొచ్చు కదా ! మీరే ఆమెను సమాధి చెయ్యొచ్చు కదా ! నేను అబద్ధం చెప్పే పరిస్థితి ఎందుకు కలిగించారు ? అని.అందులో ఉన్న ఆమె మనుమడు మోకాళ్ళ పై కూలబడి అన్నాడు . “మాలో ఎవరమూ ఆమె మోక్షం పొందే విధంగా ఆమెకు సహాయపడలేము ఇక్కడ ఉంటె ఆమె తప్పక మోక్షం పొందుతుంది అందుకే ఇక్కడకు తీసుకువచ్చాము.మమ్మల్ని క్షమించండి” అని అతను చెప్పాడు.

5.చిన్న చిన్న విషయాలలో ఆనందం.
“మా ముక్తి భవన్ లో ప్రతీ రోజూ మూడు సమయాల్లోనూ భజనలు జరుగుతూ ఉంటాయి కొందరు ఆ భజనలలో ఎంతో ఆనందం తో కీర్తనలు పాడతారు . దారిన పోయే వారు కూడా ఆ ఆనందం పంచుకోవడం కోసం కొంత సేపు అక్కడ చేరుతారు . కానీ కొందరు అది తమ ఏకాంతకు ఆటంకం కలిగిస్తోంది అనో , తమకు ఉన్న పానాలకు ఆటకం కలిగిస్తోంది అనో అనుకొంటారు .

6.సమస్యలనుండి పారిపోకు.
కొందరు తాము ఉన్న స్థితి ని అంగీకరించలేరు . ఇలా అంగీకరించలేక పోవడం వారిలో నిరాశ నిస్పృహలను కలిగించి వత్తిడి పెంచుతుంది . నీవు ఉన్న స్థితిని నీవు అంగీకరిస్తే నీ సమస్యలనుండి నీవు బయట పడడం నేర్చుకోగలవు . లేదంటే నీవు చీకటిలోనే ఉంటావు.సమస్యను నీవు గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించగలవు.సమస్య పట్ల నిర్లక్ష్యం , పట్టించుకోకపోవడం , దూరంగా పోవాలి అనుకోవడం నీలో ఆడుర్డాను పెంచుతాయి . సమస్యను అంగీకరిస్తే నీవు దానినుండి బయటపడే ప్రయత్నం చెయ్యగలవు . దానిని ఎదుర్కోగలవు . అపుడు నీవు శక్తి మంతుడవు అవుతావ్.

7.అందరి పట్ల సమభావం తో ఉండు
ముక్తి భవన్ లో చేరిన ప్రతీ ఒక్కరినీ ఒకే విధం గా కాకుండా వారి కులమూ , మతమూ , డబ్బూ , సాంఘిక , ఆర్ధిక స్థితి గతులను బట్టి నేను చూడడం మొదలు పెడితే వారికీ నాకూ కూడా శాంతి ఉండేది కాదు.ఎదుటి వ్యక్తులను సమభావం తో నీవు చూసిన నాడు నీకు ప్రశాంతత ఉంటుంది . నీ పని నీవు చక్కగా చెయ్యగలుగుతావు .

8.నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు.సాధించే ప్రయత్నం చెయ్యి .
“నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది గుర్తించడం చాలా గొప్ప విషయం కానీ దానిని నువ్వు సాధించే ప్రయంతం చెయ్యని నాడు అది నిష్పలం.చాలా మంది ఏమి చెయ్యాలో తెల్సు కానీ ఏమీ ప్రయత్నం చెయ్యకుండానే జరిగిపోవాలి అనుకుంటారు . ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కన్నా అసలు లక్ష్యమే లేకపోవడం ఉత్తమం . లక్ష్యం అంటూ ఉంటె నీకున్న సమయమూ , నువ్వు చెయ్యవలసినదీ ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటావు . నీ ఆలోచన దాని మీదనే ఉంటె నీవు తప్పించుకోలేవు” .

9. మంచి అలవాట్లు విలువలుగా మారతాయి.
“మంచి అలవాట్లను చేసుకో ! అది నీకు మంచి విలువలను నేర్పుతుంది . మంచి అలవాట్లను అభ్యాసం చేతనే నేర్చుకోవాలి . అదేమీ సులువైన విషయం కాదు . ప్రతీసారీ నువ్వు ప్రయత్నపూర్వకంగానే సాధించాలి . సత్యమూ , దయా , సానుభూతీ ,నిజాయతీ ఇవేవీ నీ
ప్రయత్నం లేకుండా వాటంత అవి రావు” .

10.నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో !
“ఈ ప్రపంచం లో ఎంతో విజ్ఞానం ఉంది . అందులో నీవు ఏది కావాలి అనుకుంటున్నావో దాన్ని ఎంచుకో . ప్రతీ ఒక్కరూ వారి అభిరుచులను, సిద్ధాంతాలనూ , అనేక విషయాలనూ నీ మీద రుద్దుతారు . అయితే నీకు ఏది ఇష్టమో అది ఎంచుకో ! వారి సూచనలు పరిగణన లోకి తీసుకో . నీ మనసు హృదయం చెప్పినట్టు నువ్వు ఎంచుకో ! ఇక్కడకి వచ్చిన వారు ఆఖరు దశలో ఉంటారు.నడవలేరు. మాట్లాడలేరు.అపుడు వారిలోకి వారు వెళ్ళడం మొదలు పెడతారు.వారి అనుభవాలలోనే వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు.నేర్చుకున్నదానిని నెమరు వేసుకుంటూ ఉంటారు”.

11.నీవు ప్రజలతో సంబంధాలు తెంచుకోకపోతే, వారు రగిలించిన ఆలోచనలతో సంబంధం తెంచుకో.
“నీవు ప్రేమించిన వ్యక్తులు,నీకు ఆప్తులు అయిన వ్యక్తులు నీతో అన్నివిషయాలలోనూ ఏకీభవించక పోవచ్చు.వారి భావాలు నీ భావాలకు వ్యతిరేకం కావడం వలన వారి భావాలతో విభేదించ లేక వారికీ దూరం జరుగుతున్నావు తప్ప వారికి నీవు దూరం కావు. మీ మధ్య భేదాభిప్రాయం ఆలోచనలలోనే తప్ప వ్యక్తులతో కాదు.నీవు నేర్చుకోవలసినది వారిపై ప్రతీకారభావం కాదు.వారి పట్ల కఠిన హృదయం కాదు.

12.నీ సంపాదనలో పది శాతం దానం కోసం కేటాయించుకో !
“ధర్మం అంటే మత సంబధం కాదు.మంచిని చెయ్యడం.ఒక పది శాతం సంపాదన ఇందుకు కేటాయించుకో ! చాలామంది జీవిత అంత్య కాలంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు . వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలు ఇతరులకూ కలుగుతున్నాయని తెలుసుకుని అవి తొలగాలని కొంత సహాయ పడుతూ ఉంటారు . ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో , అపరిచితుల ప్రేమను పొందుతారో , వారు ప్రశాంతంగా ప్రాణం విడువగలుగుతారు . నీవు సంపాదించినదంతా నీవే అనుభవించాలి అనుకోకు.కొంత ఇతరులకు మిగుల్చు”. అని భైరవ నాథ్ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్థాయి.