13,14 తేదీలలో రాహుల్ తెలంగాణ పర్యటన.

  • కాంగ్రెస్ లో నూతనోత్తేజం వచ్చే చాన్సు.

హైదరాబాద్‌:
రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టిపిసిసి అధికారప్రతినిధి గజ్జెల కాంతం వేర్వేరు ప్రకటనలలో కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకునేందుకు రాహుల్ గాంధీ ప్రత్యేకవ్యూహంతో సాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాదిలో క్రమంగా బలపడు తున్నట్లు ఆపార్టీకి సంకేతాలున్నాయి. రాజస్తాన్‌, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, మహారాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా ఊపందుకుంటోంది. ఉత్తరాదిలో 160 నుంచి 170 సీట్లకు పైగా పార్టీ గెలుచుకుంటుందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటు న్నాయి. కర్ణాటకలో అధికారం కోల్పోయినా మిత్రపక్షంకే పట్టం కట్టడంలో సఫలీకృతమైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగలదని ఆ పార్టీ విశ్వసిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని తప్పక గెలిపించుకోవాలని పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఉన్న ఫలంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే అంత సులభం కాదని, రాహుల్‌ పకడ్బందీ వ్యూహంతో అధికార టిఆర్ఎస్‌ పార్టీకి చెక్‌ పెట్టిందుకు వ్యూహరచన చేస్తున్నారు. దీనిపై ఎఐసిసిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ రైతు బంధు పథకం, రైతులకు బీమా వంటి రోజుకో కొత్తపథకంతో ముందుకు వెళుతున్నారు.దీన్ని అదిగమించేందుకు రాహుల్ గాంధీ బృందం పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడే కాంగ్రెస్‌ పార్టీ ఇక్క గెలవాల్సి ఉన్నా పార్టీలో బహుళ నాయకత్వం, మరోవైపు కెసిఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. టిఆర్ఎస్‌ అధికారంలో ఉండడం, ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున టిఆర్ఎస్‌లోకి చేరడంతో ఆపార్టీ క్యాడర్‌ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టిఆర్ఎస్‌ను ఎదిరించడం అంతసులువైన వ్యవహారం కాదని రాహుల్‌కు నివేదికలు అందాయి. రాష్ట్రంలో బలమైన బిసిలపై కాంగ్రెస్‌పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే ఢిల్లీలో ఓబిసిల సమావేశం నిర్వహించి బలమైన బిసి ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ‘గుజరాత్‌ తరహా బలమైన కులవాదాన్ని’ ఇక్కడ అమలు చేయాలని, కులం కార్డు ప్రయోగంతో కెసిఆర్‌ను దెబ్బకొట్టాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక వర్గాల వారిగా కెసిఆర్‌ తాయిలాలు ప్రకటిస్తూ మచ్చిక చేసుకుంటున్న నేపథ్యంలో ఆదే వ్యూహంతో టిఆర్ఎస్‌ను తుదముట్టించాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. బలమైన సామాజిక వర్గాల్లో బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్‌ దగ్గర కావాలని యోచిస్తోంది. తెలంగాణలో 50శాతంకు పైగా ఉన్న బిసిలను పార్టీవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు వేగవంతంచేస్తోంది.