‘బతుకమ్మ’కు 20 కోట్లు.

హైదరాబాద్:

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయనున్నామని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. సచివాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై మాట్లాడుతూ, 20 కోట్లతో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాకు 15 లక్షలు, విదేశాల్లో 2 కోట్లతో నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉన్నందున ముఖ్యఅతిధులు ఉండరని చెప్పారు. ప్రజలు, అధికారులు స్వచ్ఛందంగా బతుకమ్మ పండుగలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా చిన్న వయస్సు, 12 సం.ల వరకు ఉండే బాలికల కోసం అక్టోబర్ 7 నుండి 9 వరకు బొడ్డెమ్మ పండుగను, జరుపుతారని వివరించారు. బతుకమ్మ 9 వ తేది నుండి 17 వరకు జరుగుతుందన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా బ్రహ్మకుమారీలు, విదేశీ వ్యవహారాల శాఖ సహకారం తీసుకుంటున్నామన్నారు. బ్రహ్మకుమారీలకు సంబంధించి 25 దేశాలకు సంబంధించిన 75 మంది మహిళలు మన రాష్ట్రంలో బతుకమ్మ ఆడతారని తెలిపారు. బతుకమ్మ ఉత్సవం అందరికి అందుబాటులో ఉండేలా 1000 మంది కంటిచూపు లేని మహిళలు, బధిరులు, దివ్యాంగ మహిళలకోసం ప్రత్యేకంగా హైటెక్స్ లో బతుకమ్మ ఆడతారని తెలిపారు. 50 మంది ఆకాశంలో Para motoring ద్వారా బతుకమ్మ హరివిల్లులు కనిపించేలా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 12 దేశాల నుండి ప్రత్యేకంగా పూలు అలంకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బతుకమ్మ సందర్భంగా బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు అందించడంతో పాటూ మహిళా సాధికారతపై అవగాహన కల్పిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల్లో బతుకమ్మలు, లిటరేచర్ అందుబాటులో ఉండేలా చూడాలని సి.యస్ లేఖ వ్రాసారని తెలిపారు. మహిళలు, ప్రకృతి, పూలకు సంబంధించిన పండుగను ప్రపంచస్ధాయికి తీసుకువెళ్ళేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డిల్లీ, ముంబాయి, సూరత్ లాంటి నగరాలతో పాటు UK,USA,ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్, పోలాండ్ లాంటి దేశాల్లో విదేశీభారత మహిళలు పాల్గొనేలా చూస్తామన్నారు.రవీంద్రభారతీలో 9 నుండి 16 వరకు బతుకమ్మ పై Filmostav నిర్వహించి డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తామని తెలిపారు. Art Camp ను ఒక నెల పాటు నిర్వహిస్తామన్నారు. ఆర్ట్ గ్యాలరీలో 55 దేశాల ఫోటోగ్రాఫర్ల ద్వారా ఫోటో ప్రదర్శన జరుగుతుందన్నారు. సద్దుల బతుకమ్మ రోజున లేజర్ షో, ఫైర్ వర్క్, Cultural Carnival నిర్వహిస్తామన్నారు. ఐటి, పరిశ్రమల సహాయంతో పూల శకటాలు నగరంలో ప్రదర్శించటానికి కృషి చేస్తున్నామన్నారు. శతాబ్ది, రాజధాని రైళ్ళలో ప్రయాణించే మహిళలకు బుక్ లెట్స్ పంపిణీ చేస్తామన్నారు. బ్రహ్మకుమారీల ద్వారా గ్లోబల్ కల్చరల్ ఫెస్టివల్, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంతోష్ దీది తెలిపారు. మహిళలకు సంబంధించిన ఈ పండుగలో విదేశి మహిళలు పాల్గొంటారని తెలిపారు. వీరు రూపొందించిన సి.డి. పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడిహరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.