2014న విభజిత ఆంధ్రకు ముఖ్యమంత్రిగా…….

http://www.telanganacommand.com/wp-content/uploads/2019/01/cm-babu.jpg

8జూన్2014న విభజిత ఆంధ్రకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఐదేళ్ళు గిర్రున తిరిగి సరిగ్గా అదేరోజున తనను గద్దె దించే కొత్తసర్కారు కొలువు తీరుతుందని కలలో సైతం ఊహించిఉండడు. దారీతెన్నూ లేని రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన తన సారథ్యమే ఉత్తమమని ప్రజలు కనీసం 15ఏళ్ళపాటు భావిస్తారనీ తనను గద్దె దింపగల రాజకీయశక్తి దరిదాపుల్లో లేదన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం/అతి విశ్వాసం ఆనాడు చంద్రబాబులో ప్రస్ఫుటమైంది. కలలో మాత్రమే సంపూర్ణంగా కనిపించే పోలవరం , అమరావతి…కనీసం మూడు ఎన్నికల్లో తనకు అండగా ఉండి జనాన్ని తనవైపునకు మళ్ళిస్తాయన్న బలమైన భావన చంద్రబాబులో ఉండేది. దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయనాయకుడైనా ప్రజల నాడిని సరైన సమయంలో సరైన రీతిలో అంచనా వేయలేడు. పోలింగ్ సమయం ముగిసినా అర్థరాత్రి వరకూ జనం ఓపిగ్గా వరుసల్లో నిలబడి ఓట్లేసిన వైనాన్ని తనకు అనుకూలంగా అన్వయించుకుని చంద్రబాబు మురిసిపోయాడు. తాను టీవీల్లో పిలుపునిచ్చిన కారణంగానే జనం అంత ఓపిగ్గా నిలబడి ఓట్లేశారని చెప్పుకున్నాడు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైనా కనీస అవగాహన లేని వ్యక్తి కైనా పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు మనోభావం ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పలేడు. ఓటరు పనిగట్టుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓపిగ్గా నిలబడి ఓటేసేది గద్దెమీద ఉన్నవాడిని దించడానికే గానీ అతడికి జై కొట్టడానికి కాదు. ఆ సందర్భంలో లబ్దిపొందే రాజకీయశక్తులు అది తమకు పాజిటివ్ ఓటుగా భ్రమిస్తాయి. ఎదుటివాడిపై వ్యతిరేకతతోనే తనకు ఓట్లేశారని గెలిచిన పార్టీ అనుకోదు. తమ వాక్చాతుర్యంతో ప్రజల్ని బురిడీ కొట్టించగల సమర్థులైన అనుభవజ్ఞులైన రాజకీయనాయకులకు..అదే ప్రజల్లో తమ పట్ల వెల్లువెత్తే వ్యతిరేకతను సరిగ్గా అంచనావేసే తెలివితేటలు మాత్రం ఉండవు! ఇది ఎన్నోసార్లు నిరూపితమైన వాస్తవం!

ఇంకో మాట. ఐదేళ్ళకిందట ఇదేరోజు జూన్ 8న చంద్రబాబు రాజ్యాధికారం చేపట్టాడు. సరిగ్గా ఐదేళ్ళ తర్వాత అదేరోజున వైసీపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఎవరికైనా ఈ రెండు ఘటనలే గుర్తుంటాయి. కానీ అదేరోజు తెలుగునేలకు సంబంధించిన మరో విషాద జ్ఞాపకం ఎవరికీ మదిలో ఉండకపోవచ్చు. హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లో విహారయాత్రకు వెళ్ళిన తెలుగు విద్యార్థుల్లో 24మంది 2014జూన్ 8న నదిలో కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంరంభ వేళ..రెండు డజన్ల మంది తల్లులకు గర్భశోకం కలిగించిన విషాదఘటన ఎవరికి గుర్తుంటుంది! చంద్రబాబు కూడా దాన్ని తన ప్రమాణస్వీకారపు తేదీగానే గుర్తుంచుకుంటాడు కానీ ఎంతో భవిష్యత్తున్న 24మంది విద్యార్ధులు అర్థాంతరంగా జీవనప్రయాణాన్ని ఆపేసిన రోజుగా ఎందుకు గుర్తుంచుకుంటాడు! నిన్న ప్రమాణస్వీకారం చేసిన పాతికమంది మంత్రులకూ తమ జీవితంలో మధురఘట్టమైన పదవీస్వీకారమే మదిలో నిల్చిపోతుందిగానీ ఐదేళ్ళ కిందటి విషాదఘటన గుండె గదుల్ని తాకదు గదా! మనవీయ కోణం , స్థితప్రజ్ఞత , మానసిక పరిణతి ఉన్న వారికి మాత్రమే తమ సంతోషఘడియల్లోనూ ఇతరుల విషాదం గుర్తుకొస్తుంది!