21 నెలల తర్వాత సర్జికల్ దాడుల వీడియో.

న్యూ ఢిల్లీ:
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసిన 21 నెలలకు బయటపడిన ఆ వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఆనాడు దాడులపై అనుమానాలు వ్యక్తం చేసినవారు ఇప్పుడు మాట మారుస్తున్నారు. భారత జవాన్ల వీరత్వం మీద తమకేనాడు అనుమానాలు లేవని.. కానీ దానిని తమ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకొనేందుకు ఇప్పుడు వీడియోలు విడుదల చేశారంటూ కొత్త పాట అందుకున్నారు. మొన్ననే అవి సర్జికల్ దాడులు కావు.. ఫర్జికల్ అని వ్యాఖ్యానించిన ఎన్డీఏ ప్రభుత్వంలో మాజీ మంత్రి అరుణ్ శౌరీ కూడా మీడియా నా మాటలు వక్రీకరించిందంటూ నాలిక మడతేశారు. పనిలో పనిగా మరోసారి మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఫర్జికల్ స్ట్రైక్
మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సోజ్ రాసిన ‘కశ్మీర్: గ్లింప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్‘ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అరుణ్ శౌరీ.. బీజేపీ అగ్రనాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఈవెంట్, ఎలక్షన్ ఆధారితంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న సర్జికల్ స్ట్రైక్ ని ఫర్జికల్ అని ఎగతాళి చేశారు. కశ్మీర్ సమస్య కశ్మీరీలనే కాకుండా యావద్దేశాన్ని ప్రభావితం చేస్తోందని శౌరీ అభిప్రాయపడ్డారు.

తప్పంతా రిపోర్టర్లదే
ఇవాళ సర్జికల్ స్ట్రైక్ వీడియోలు బయటికి రావడంతోనే అరుణ్ శౌరీ మాట మార్చేశారు. తన మాటలను రిపోర్టర్లు తప్పుగా అర్థం చేసుకొన్నారని చెప్పారు. ఉత్తరాదికి చెందిన రెండు ఛానెళ్ల రిపోర్టర్లు తన మాటలను వక్రీకరించారని తెలిపారు. తనెప్పుడూ సర్జికల్ స్టైక్ ను అనుమానించలేదని.. దానిని ప్రచారం కోసం ఉపయోగించి హాస్యాస్పదంగా మారుస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని అరుణ్ శౌరీ వివరించారు.

ప్రచారాస్త్రంగా మారిన దాడులు
తన ఛాతి 56 అంగుళాలు.. సర్జికల్ దాడులతో పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పానని ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడం తప్పని శౌరీ అభిప్రాయపడ్డారు. వాజ్ పేయి హయాంలో ఇవే దాడులు జరిగి ఉంటే ఆయన స్పందన వేరుగా ఉండేదని అన్నారు. ఎవరైనా సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే అటల్జీ కళ్లలో మెరుపు వచ్చేది కానీ పైకి మాత్రం అమాయకంగా నిజంగా సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? అని ప్రశ్నించేవారని చెప్పారు. ఇవాళ ప్రభుత్వ విశ్వసనీయత దారుణంగా పడిపోయిందని.. అందుకే రుజువుగా వీడియోలు చూపాల్సిన పరిస్థితి వచ్చిందని మోడీ ప్రభుత్వం పనితీరుపై శౌరీ పదునైన వ్యాఖ్యలు చేశారు.