జర్నలిస్టుల ఉద్యమ సారధికి జన్మదిన శుభాకాంక్షలు.

జర్నలిస్టుల ఉద్యమ సారధికి
జన్మదిన శుభాకాంక్షలు.

పైడి లక్ష్మణరావు:


వాస్తవానికి దగ్గరలో జీవించడం ఆయనకు అలవాటు. బహుశా, ఆయనకు ఈ లక్షణం కుటుంబ నేపథ్యం నుంచో లేక వృత్తి నేపథ్యం నుంచో అలవడి ఉండవచ్చు.63 ఏళ్ల వయసులో కూడా నవయవ్వనంగా కనిపించడం వెనుక రహస్యం ఏదైనా నిత్యం నవ్వుతూ గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు.జర్నలిస్టుకు ఎక్కడ ఏ కష్టం వచ్చిందన్నా నేనున్నానంటూ ముందువరుసలో ఉండి వాళ్ల గొంతుకను తన గొంతుగా చేసుకుని ఓదార్చే గుణం ఆయనకు సీనియర్ల నుంచి అలవడిందే కావచ్చు గానీ, పెరుగుతున్న వయోభారంతో పాటు ఆ మంచి ఆశయాన్నీ కొనసాగిస్తూ సాగడం ఆయనకు మాత్రమే సాధ్యం.
ఆయన ఇంకెవరో కాదు… తనే మన ఉద్యమ సారధి, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ గారు.ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా అమర్ గారికి జర్నలిస్టుల సామాజిక వర్గం తరపున శుభాకాంక్షలు.‘‘ప్రభుత్వాల మాట దేవుడెరుగు, అసలు పాత్రికేయుల గుర్తింపే లేని నేతలు మిమ్మల్ని ఉద్దరిస్తామంటే నమ్మొద్దు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చురుగ్గా పనిచేస్తూ స్థాయితో నిమిత్తం లేకుండా పాత్రికేయులందరి సంక్షేమం, హక్కుల సాధన గురించి పనిచేస్తున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అనుబంధ సంఘాల వల్లే ఏదైనా సాధ్యం’’ అన్న అమర్ దేవులపల్లి మాటల్ని ఆయన గురించి ఏ మాత్రం తెలిసిన వారు కూడా అంత తేలిగ్గా తీసుకోరు. కాలక్రమంలో ఆయన అన్న మాటలు నూటికి నూరు పాళ్లు నిజమయ్యాయనుకోండి. తాత్కాలిక ప్రయోజనాల కోసమో లేక తమ మాట విని, చెప్పుచేతల్లో ఉండని మనలాంటి సంఘటిత శక్తిని దారికి తెచ్చుకునే ప్రయత్నమో లేక మరేదో స్వలాభం కోసమో ప్రభుత్వాలు అర్హతలేని సంఘాలను కూడా అప్పుడప్పుడు అమాంతంగా గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సంఘాన్ని గుర్తించాలంటే సభ్యుల సంఖ్యాబలం ఆదారంగా అన్నమాటను పూర్తిగా విస్మరించి అర్హత లేని సంఘాలను కూడా ప్రభుత్వాలు గుర్తించినప్పుడు సైతం ఆయన పెద్దగా స్పందించలేదు.అంటే, ఆయన మౌనానికి కచ్చితంగా ఏదో అర్ధం, పరమార్ధం ఉండే ఉంటుంది. ‘పోనీలే ఇప్పటి వరకు పనిచేసిన చరిత్ర లేపోయినా కనీసం ఇకనైనా పాత్రికేయుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి కృషి చేస్తారు’ అని భావించే మా ఐజేయూ పెద్దల్లో ఒకరైన, ప్రస్తుత అధ్యక్షులుగా జాతీయ స్థాయిలో పాత్రికేయ మిత్రులకు సేవలందిస్తున్న అమర్ గారి పుట్టినరోజు అంటే కేవలం వ్యక్తిగతంగా నాకు మాత్రమే కాదు, ఆయన సిద్ధాంతాన్ని, విధానాలనూ విశ్వసించే ఎంతో మంది మిత్రులకూ ఆనందదాయకమే.
1957లో దేవులపల్లి మదన్ మోహనరావు, సరస్వతి దంపతులకు జన్మించిన అమర్ గారు బీఏ పూర్తిచేసిన తర్వాత పాత్రికేయంలో కూడా పట్టా పొందారు. దేవులపల్లి అమర్ గారు 1974-1975 మధ్య ‘ప్రజాతంత్ర’ పత్రికకు కరస్పాండెంట్‌గా, 1976-77 మధ్య ‘ఈనాడు’లో సబ్ ఎడిటర్/స్టాఫ్ రిపోర్టర్‌గా, 1977-1984 మధ్య ‘ఆంధ్రభూమి’లో సబ్ ఎడిటర్/ఎడిట్ పేజ్ ఇన్‌చార్జి/మేగజైన్ ఎడిటర్‌గా, 1984-86 మధ్య ‘ఉదయం’లో సీనియర్ స్టాఫ్ రిపోర్టర్‌గా, 1986-87 మధ్య అప్పటి బొంబయి, నేటి ముంబయి నుంచి ప్రచురితమయ్యే ఆంగ్ల వార్తా వారపత్రిక ‘ద సండే అబ్జర్వర్‌’కు స్టాఫ్ కరస్పాండెంట్‌గా, 1987-91 మధ్య సొంత జిల్లా అయిన కరీంనగర్ నుంచి ‘ఆంధ్రప్రభ’, ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’కు స్టాఫ్ కరస్పాండెంట్‌గా, 1991-97 మధ్య ‘ఆంధ్రప్రభ’లో చీఫ్ రిపోర్టర్/చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో/అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేసి 1998 నుంచి తన సొంత పత్రిక అయిన ‘ప్రజాతంత్ర’ నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. వారపత్రిక సహా దినపత్రికనూ సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఎంతో మంది వర్ధమాన పాత్రికేయుల్ని తయారుచేశారు. జర్నలిజంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే ఐజేయూ అనుబంధ సంఘాలలో చురుగ్గా పనిచేసిన ఆయన అాదే సంఘానికి ప్రస్తుతం
జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తుండడం విశేషం.
హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే)కు కార్యదర్శిగా, నాటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) కరీంనగర్ యూనిట్ అధ్యక్షునిగా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ న్యూస్‌పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షునిగా పనిచేసిన అమర్ గారు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐజేయూకు అనుబంధంగా పనిచేసిన ఏపీయూడబ్ల్యూజేకు రెండుసార్లు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
తర్వాత ఆయన ప్రభుత్వపరంగా, పాలకుల జోక్యంతో ఎంపిక చేసిన పలు కీలక పదవులను కూడా అలంకరించారు. ఏపీ అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ కమిటీ కార్యదర్శిగా, ప్రెస్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా, సౌత్ ఆసియా ఫ్రీ మీడియా అసోసియేషన్ (ఎస్ఎఎఫ్ఎంఎ)కు జాతీయ సమితి సభ్యునిగా సేవలందించిన అమర్ గారు నేటికీ ఆయన పాత్రికేయుల సమస్య ఎక్కడన్నా మన యూనియన్ పెద్దలు కె. శ్రీనివాసరెడ్డి గారు, అమర్‌నాథ్ కోసూరు గారి లాంటి వారి సలహాలతో దూరాభారాలతో నిమిత్తం లేకుండా వెళ్లి పరిష్కారానికి కృషిచేస్తుండడం అభినందనీయం.