56 అంగుళాల ఛాతి మగాళ్లు నిజం చెప్పండి!

న్యూఢిల్లీ:

రాఫెల్ కొనుగోలు ఒప్పందం కుంభకోణంపై రాబర్ట్ వాద్రా బీజేపీపై నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తనను వివిధ ఆరోపణలపై వేటాడుతున్నాయని ట్వీట్ చేశారు. బీజేపీని ఏదైనా వివాదంలో చిక్కుకొంటే వెంటనే తన పేరుని లేవనెత్తుతుందని వాద్రా ఎద్దేవా చేశారు. రూపాయి పతనమైనా, పెట్రోలు ధరలు పెరిగినా లేదా రాఫెల్ కుంభకోణంతో దేశాన్ని అమ్మేసినట్టు ఆరోపణలు వచ్చినా బీజేపీ వెంటనే తన ప్రస్తావన తెస్తుందని గుర్తు చేశారు. అబద్ధాల వెనుక దాగకుండా 56 అంగుళాల ఛాతి ఉన్న మగాళ్లు ఇప్పటికైనా రాఫెల్ వ్యవహారంలో ఏం జరిగిందో దేశ ప్రజలకు నిజం చెప్పాలని పరోక్షంగా మోడీని వాద్రా డిమాండ్ చేశారు. బీజేపీ ఇలా ప్రతి విషయానికి తన పేరు ప్రస్తావించడం మొదట్లో తనకు ఆశ్చర్యం కలిగించేదని.. ఇప్పుడు ఆ ఆరోపణలను తను పట్టించకోవడం మానేశానన్నారు. నాలుగేళ్లుగా ప్రధాన దర్యాప్తు సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిస్తున్న బీజేపీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తనపై రాజకీయ దురుద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తూ వస్తున్నాయని చెప్పారు.