ఆగస్ట్ 1 నుంచి జెడిఎస్ పాదయాత్ర!

ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న జనతాదళ్ (సెక్యులర్) కర్ణాటకలో పార్టీకి పునరుజ్జీవం పోసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో దుమ్మురేపిన నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి బాటలో నడిచేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం తీసుకురావాలని భావిస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రధానమంత్రి, జెడిఎస్ చీఫ్ హెచ్ డి దేవెగౌడ కనుసన్నలలో ఈ పాదయాత్ర కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది. పార్టీని పునర్నిర్మించేందుకు కష్టపడి పనిచేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్వీ దత్తా నాయకత్వాన ఆగస్టులో బీదర్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమై బెంగుళూరులో ముగుస్తుంది.

ఈ యాత్రలో నాయకులు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరిస్తారు. ‘సంకీర్ణ ప్రభుత్వ సెంటిమెంట్లను దెబ్బతీయకుండా, ప్లకార్డులు ప్రదర్శించకుండా పాదయాత్ర జరుగుతుందని, స్థానిక ప్రజా సమస్యలకు ప్రతిస్పందించని కారణంగా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని’ ప్రజలకు వివరించనున్నట్టు దేవెగౌడ సన్నిహితులు చెప్పారు. త్వరలోనే సక్లేశ్ పూర్ ఎమ్మెల్యే హెచ్ కె కుమారస్వామిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నారు. దీని ద్వారా కేవలం ఒక్కళిక వర్గం కోసమే తాము పని చేయడం లేదని తెలియజెప్పాలని భావిస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కుమారస్వామి గ్రామ వాస్తవ్య జోరుగా సాగుతుండటంతో ఉత్తర కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవచ్చని జెడిఎస్ ఆశిస్తోంది.