ఈ డబ్బును ఏం చేయాలో ఐడియా చెప్పరూ?

ప్రకాశ్, న్యూఢిల్లీ:

డబ్బు ఎక్కువైతే సమస్యలూ అధికమౌతాయా? ఇతర సమస్యలేమోగాని… అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్న తన సంపదను ఏం చేయాలో తెలియడం లేదు. గత ఏడాది ఆయన సంపద 8,000 కోట్ల డాలర్లు. ఫోర్బ్స్‌ పత్రిక మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడైన బిల్‌ గేట్స్‌ తరవాతి స్థానంలో బెజోస్‌ను ఉంచింది. అపుడు ఆయన సామాజిక మీడియా ద్వారా తన దగ్గర ఉన్న సంపదను ఏం చేయాలో? ఏయే రంగాలకు… ఎలా ఉపయోగించాలో సలహాలు ఇవ్వమని సలహాలు అడిగారు. సలహా రావడం ఆలస్యమైందేమోగాని.. ఆయన సంపద మాత్రం ఏడాది తరక్కనే 16,200 కోట్ల డాలర్లకు చేరింది. అంటే డబుల్ అయిపోయిందన్నమాట. బెజోస్‌ ఎలా ఖర్చు చేయాలి? ఎందుకు ఖర్చు చేయాలి? ఎంత చేయాలనే అంశంపై మీడియాలో భారీ స్థాయిలోనే చర్చ సాగుతోంది. ఈ చర్చ ఇలా సాగుతుండగానే ఏడాది గడచిపోయింది. ఎలా దానం చేయాలో కూడా చెప్పేందుకు ఐడియాలకు కొదవ ఏర్పడింది. ఐడియా ఇస్తే సరిపోదు.. అది బెజోస్‌ ముఖ్యంగా ఆయన భార్య మెకెంజీ కూడా నచ్చాలి కదా? హమ్మయ్య…మొత్తానికి వారికి ఓ ఐడియా నచ్చింది. భార్యభర్తలిద్దరూ ఓ 200 కోట్ల డాలర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని.. ప్రాజెక్టు అనుకున్న విధంగా సక్సెస్‌ అయితే మరిన్ని నిధులు ఇస్తామంటున్నారు బెజోస్‌ దంపతులు. ఇంతకీ ఈ 200 కోట్ల డాలర్లను ఎందుకు ఇస్తున్నారో తెలుసా? గూడు లేనివారికి ఇళ్ళు కట్టించి ఇవ్వడం, ప్రాథమిక విద్యను మరింతగా అభివృద్ధి చేయడం కోసం ఈ నిధులు ఇస్తున్నారు. బెజోస్‌ డే 1 ఫండ్‌ అనేది..బెజోస్‌ దంపతులు ఏర్సాటు చేసిన ఫౌండేషన్‌. 16,200 కోట్ల డాలర్లలో మేమిస్తున్నది కేవలం 200 కోట్ల డాలర్లే. ఇంకా ఇచ్చేందుకు మేము రెడీ… ఐడియా చెప్పండి అంటూ మళ్ళీ అంటున్నారు బెజోస్‌ దంపతులు.