“నాకు ఇప్పుడు ప్రజల మద్దతు కావాలి”!

“నాకు ఇప్పుడు ప్రజల మద్దతు కావాలి”!

anandteltumbde

2018 జనవరి 1న భీమా కోరేగాంలో హింసాకాండకు సంబంధించి పౌరహక్కుల కార్యకర్త, ప్రముఖ మేధావి ఆనంద్ తెల్తుంబ్డే పై పూణే పోలీసులు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేయడానికి సుప్రీంకోర్టు ఈ నెల 14న తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆయనకు సుప్రీంకోర్టు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేసే ప్రమాదం నుంచి కాపాడాలని కోరుతూ ప్రజలకు ఆనంద్ బహిరంగ లేఖ రాశారు.

——————————————-

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టవ్వడమంటే సంవత్సరాల తరబడి నిర్బంధానికి, వేధింపులకు గురవడమేనని మనలో చాలా మందికి బహుశా తెలియదేమో. ఒక కరుడుగట్టిన న్సుఉ్థడు సైతం ఒకటో, రెండో సంవత్సరాల శిక్షతో బైటపడే వీలుంది. కాని ఈ చట్టం కింద అరెస్టయితే ఏ నేరమూ చేయని వ్యక్తి సైతం సంవత్సరాల తరబడి జైలులోనే మగ్గిపోతాడు. రాజకీయ నేతల ఆదేశాల ప్రకారం ఈ చట్టం కింద కేసును బనాయించిన పోలీసులు తమ వద్ద తగిన సాక్ష్యాధారాలున్నాయన్న ప్రకటనలో నిరపరాధులను సైతం ఏళ్ల తరబడి జైలులోనే ఉంచే వీలుంది. నేను అరెస్టుకు భయపడడం లేదు. నేను నిరుపేద కుటుంబం నుండి వచ్చాను. నా మేధో కృషితో దేశంలోని అత్యుత్తమ సంస్థలలో చదువుకోగలిగాను. ఐఐఎం, అహ్మదాబాద్‌లో చదువుకున్న వాడిగా నేను చాలా సుఖవంతమైన జీవితం గడిపే వీలుంది. అయితే చుట్టూ వున్న సమాజంలో జరుగుతున్న అవకతవకలను నేను విస్మరించలేకపోయాను. అందుకే నేను, నా కుటుంబం సాధారణ జీవితం గడపడానికి సరిపడా మాత్రమే సంపాదించి తక్కిన సమయంలో నా మేధోపరమైన కృషి ద్వారా నేను నివసిస్తున్న రాష్ట్రంలో నా చుట్టూ వున్న ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి కృషి చేస్తున్నాను. ఈ రకమైన నా దృక్పథం వలనే నేను విద్యార్థి దశలో ఉన్న కాలం నుండే పౌర హక్కుల సంఘంలో భాగస్వామినయ్యాను. ప్రస్తుతం దాని ప్రధానకార్యదర్శిగా ఉన్నాను. విద్యా హక్కు కోసం ఏర్పడిన అఖిలభారత వేదిక అధ్యక్షవర్గ సభ్యుడిగా కూడా ఉన్నాను.నా అసంఖ్యాకమైన రచనలలో గాని, నిస్వార్థపూరితమైన కార్యకలాపాలలో గాని చట్ట వ్యతిరేకమైనదేదీ ఇసుమంతైనా లేదు. గత సంవత్సరం జరిగిన ‘ఎల్గర్‌ పరిషత్‌’ అనే అత్యంత నిరపాయకరమైన కార్యక్రమాన్ని సైతం ఒక నేరపూరితమైన కుట్రగా మార్చి వేసింది ప్రభుత్వం. అందులో మానవ హక్కుల ఉద్యమకారులు, మేధావులు, ప్రజా ఉద్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాని ప్రభుత్వానికి అందులో కుట్ర మాత్రమే కనపడింది! తనను వ్యతిరేకించే వారిపై అత్యంత నీచమైన తీరులో ప్రభుత్వమే కుట్ర పన్ని కేసుల్లో ఇరికించడం కనీస ప్రజాస్వామ్య విలువలు కూడా లేవనడానికి సంకేతం. ఇప్పుడీ కేసు ఒక ముఖ్యమైన ఘట్టానికి చేరింది. నేను అమాయకంగా పెట్టుకున్న నమ్మకాలన్నీ వమ్మయ్యాయి. అరెస్టు తప్పదన్న పరిస్థితిలో నేను హతాశుడినై వున్నాను. నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే అది కేవలం నాకు, నా కుటుంబ సభ్యులకు మాత్రమే గాక మా అందరికీ తోడ్పడుతుంది. మీరు ఈ దేశంలో పాలిస్తున్న ఫాసిస్టు మూకలను ఎదిరించి నిలిచే వారున్నారన్న స్పష్టమైన సందేశం ఇచ్చినవారౌతారు. అందువలన మీరు సంతకాల సేకరణ, పత్రికా ప్రకటనలు, వ్యాసాలు, మరే ఇతర పద్ధతుల ద్వారానైనా గాని మీ ఆగ్రహాన్ని, నిరసనను, అభ్యంతరాన్ని ప్రకటించి ఈ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టడానికి ముందుకు రావాలని కోరుతున్నాను.

– ఆనంద్ తెల్తుంబ్డే.

(‘ఆంధ్రజ్యోతి’ సౌజన్యంతో)