జనవరి 30 నుంచి అన్నా హజారే ఆమరణ దీక్ష

జనవరి 30 నుంచి అన్నా హజారే ఆమరణ దీక్ష

Anna Hazare Hunger strike

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే జనవరి 30 నుంచి నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు సోమవారం ప్రకటించారు. రైతుల డిమాండ్లు, లోక్ పాల్ ఏర్పాటు కోరుతూ తన సొంత గ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్షకు కూర్చుంటానని తెలిపారు. తన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేసేవరకు తన దీక్ష కొనసాగిస్తానని అన్నా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా హజారే మాట్లాడారు. సుప్రీంకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా లోక్ పాల్, లోకాయుక్త చట్టం 2013ని అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆదేశాలు అమలుకు నోచుకోకపోతే దేశం ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వం దిశగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలకు పోతోందని విమర్శించారు. ఇది ప్రభుత్వమా లేక ఏదైనా పచారీ కొట్టా అనేది అర్థం కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

లోక్ పాల్ ఏర్పాటై ఉంటే రాఫెల్ కుంభకోణం జరిగి ఉండేది కాదని హజారే అభిప్రాయపడ్డారు. రాఫెల్ కి సంబంధించిన అనేక పత్రాలు తన దగ్గర ఉన్నాయని.. వాటిని అధ్యయనం చేసిన తర్వాత మీడియాకు ఆ వివరాలను వెల్లడిస్తానని అన్నా చెప్పారు. ఇంతకు ముందు ప్రభుత్వం లోక్ పాల్ చట్టాన్ని ఆమోదించి అమలు చేస్తామని మాట ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో పాటు రైతులకు వారి పంటపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇస్తామని కూడా చెప్పింది కానీ మోడీ ప్రభుత్వం ఏదీ అమలు చేయలేదని ఆరోపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చే అబద్ధపు వాగ్దానాలపై ఇక నమ్మకం లేదని, తుది శ్వాస వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. తన ఈ దీక్షకు రాష్ట్రీయ కిసాన్ మహాపంచాయత్ మద్దతు ఇస్తోందని హజారే తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాలు నిరాహార దీక్షలో పాల్గొంటాయన్నారు.