తిరుమలలో ఆర్జిత సేవ టిక్కెట్ల కుంభకోణం.

వెంకట్, తిరుపతి:

కలియుగ వైకుంఠం తిరుమలలో భారీ ఆర్జిత సేవ ఆన్ లైన్ టికెట్ల కుంభకోణం బట్టబయలైంది. పిలిచిన పలికే ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవ, దర్శనాల్లో పారదర్శకత కోసం టీటీడీ ఎన్ని చర్యలు చేపట్టినా కేటుగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. శ్రీవారిని దర్శించుకోవాలన్న భక్తుల ఆత్రుతను సొమ్ము చేసుకుంటున్న కేడీగాళ్లు టీటీడీని, భక్తులను అతి సులువుగా బురిడీ కొట్టిస్తున్నారు. ఆర్జిత సేవ టికెట్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న బడా రాకెట్ శ్రీనివాసుని భక్తులకు పంగనామాలు పెడుతోంది.

శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు ఆన్ లైన్ లాటరీ ద్వారా భక్తులు పొందవచ్చు. కానీ కొందరు కేటుగాళ్లు నకిలీ ఆధార్ ఐడీలతో ఈ టిక్కెట్లు దక్కించుకుని.. ఎక్కువ ధరలకు భక్తులకు అమ్ముతున్నారు. కొందరు కిలాడీలు నకిలీ ఆధార్ కార్డులతో భారీ ఎత్తున ఆర్జిత సేవ టికెట్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టీటీడీ నిఘా పెంచాల్సిందిగా తన విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించింది. విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ చురుగ్గా వ్యవహరించి ఇటీవల రెండు రాకెట్ల గుట్టు రట్టు చేసింది. తాజాగా మరో ఆన్ లైన్ ఆర్జిత సేవ టికెట్ల కుంభకోణాన్ని పట్టేసింది. ఈ స్కామ్ లో ప్రధాన పాత్రధారి అయిన కర్ణాటకకు చెందిన ఓ బ్యూరోక్రాట్ కుమారుడిని అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 13న విజిలెన్స్ విభాగం శ్రీవారి సుప్రభాత సేవకు నకిలీ టికెట్లతో ప్రవేశించబోయిన బెంగుళూరుకు చెందిన కోదండరామన్ అనే వ్యక్తిని పట్టుకొంది. అతనిని విచారించిన విజిలెన్స్ విభాగం ఆ టికెట్లు ప్రవీణ్, వినయ్ అనే వ్యక్తుల పేరు మీద బుక్ అయినట్టు గుర్తించింది. బండారం బట్టబయలు కావడంతో రామన్ తనకు ప్రవీణ్, నితిన్ కలిసి నకిలీ ఐడీ ప్రూఫ్ లతో నకిలీ సుప్రభాతం టికెట్ తయారు చేసినట్టు చెప్పాడు. దీనిని మరింత లోతుగా పరిశోధించిన తర్వాత ప్రవీణ్, నితిన్ ఇటువంటి 2,600 ఆర్జిత సేవ టికెట్లను ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసి వాటిలో 15% టికెట్లపై దర్శనాలు కూడా కానిచ్చేసినట్టు తెలిసింది. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం షాకైంది. కొన్నిసార్లు ప్రవీణ్ అసలు సుప్రభాతం టికెట్లను నకిలీ పాస్ పోర్టుపై బుక్ చేసినట్టు తేలడం మరో షాక్. ఈ కుంభకోణం వెనుక ప్రధాన పాత్రధారి కర్ణాటకకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి కొడుకు కావడం మరో దిగ్భ్రాంతికర విషయం. ఇదంతా అతను డబ్బు కోసమే కాకుండా తన పేరు, పలుకుబడి పెంచుకొనేందుకు చేస్తున్నట్టు తెలిసింది. విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల పోలీసులు రామన్, ప్రవీణ్, నితిన్ లపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నకిలీ సేవా టిక్కెట్ల ముఠాను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక పోలీసుల బృందం ఇప్పటికే కర్ణాటక వెళ్లింది. త్వరలోనే ఈ ముఠా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.