ఆర్టికిల్ 370 శాశ్వతం కాదు…

భారతదేశానికి కశ్మీర్ ప్రవేశం గురించి చెప్పే ఆర్టికిల్ 370 తాత్కాలికమైనదే తప్ప శాశ్వతమైంది కాదని హోమ్ మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదనే (జీరో టాలరెన్స్) విధానమే నరేంద్ర మోడీ ప్రభుత్వానిదని ఇవాళ హోమ్ మంత్రి అమిత్ షా లోక్ సభలో స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఎప్పుడు జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటే అప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా స్వతంత్ర, నిష్పక్షపాతంతో ఎన్నికలు జరిపిస్తామని ఆయన చెప్పారు.

జమ్ముకశ్మీర్ సమస్యకు భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూనే బాధ్యులని అమిత్ షా అన్నారు. పీఓకేగా వ్యవహరించే కశ్మీర్ లోని భాగాన్ని ఆయన పాకిస్థాన్ కి ఇచ్చారని చెప్పారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా వ్యవహరిస్తామని అంతా తమపై ఆరోపణలు చేస్తారని, కానీ నెహ్రూజీ ఈ పని హోమ్ మంత్రిత్వశాఖను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా చేశారని షా వ్యాఖ్యానించారు. అందువల్ల తమకు చరిత్ర నేర్పించాలని చూడొద్దని కాంగ్రెస్ నేత మనీష్ తివారీకి ఘాటుగా సూచించారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలిస్తామని, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ ఆత్మరక్షణకు చేపట్టిన చర్యలని తెలిపారు.

జమ్ముకశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరోపిస్తున్నారని, నిజానికి ఇంతకు ముందు 132 మార్లు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే అందులో 93 సార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అమిత్ షా గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ నేతలు తమకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో జమాత్-ఇ-ఇస్లామీని ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు. ఎవరిని సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వమే జమాత్-ఎ-ఇస్లామీని నిషేధించిందని, బీజేపీయే జేకేఎల్ఎఫ్ పై నిషేధం విధించిందని చెప్పారు. ఇవాళ హోమ్ మంత్రి జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన గడువు ఆర్నెల్లు పెంచే ప్రతిపాదనని సభలో పెట్టారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ చట్టం, 2004ను సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు.