గ్రామసభకు ఎన్నో అధికారాలు!!

గ్రామసభకు ఎన్నో అధికారాలు!!

gramasabha

హైదరాబాద్:

పల్లె సీమలకు బాటలు వేయడంలో గ్రామసభలు ప్రధానపాత్ర పోషిస్తాయి. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ఓటర్లు ఒకే తాటిపైకి వచ్చి గ్రామసభలో చేసే తీర్మానమే ఆమోదం పొందుతుంది. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించే ఈ గ్రామసభకు ఎన్నో అధికారాలు ఉన్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి రావడం, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల విధుల్లో మార్పులు చేయడంతో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. గతంలో ఉన్న మేజర్ పంచాయతీలను పరిపాలనకు దగ్గర చేసేందుకు సీఎం కేసీఆర్ నూతన పంచాయతీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్, ఉపసర్పంచులకు చెక్ పవర్లు ఇచ్చి సర్పంచులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్‌పర్సన్‌లకు గౌరవ వేతనం పెంచారు. గతంలో ఐదేండ్లుండే రిజర్వేషన్లు కూడా పది సంవత్సరాలకు పెంచి రిజర్వేషన్లలో కూడా మార్పులు తీసుకొచ్చారు. పల్లె అభివృద్ధికి గ్రామసభ కీలకం కానున్నది. ఆర్టికల్ 243 (ఏ) కింద భారత రాజ్యాంగంలో ఈ పదాన్ని నిర్వచించారు. పంచాయతీరాజ్ చట్టంలో గ్రామసభకు రాజ్యాంగం విశేషమైన అధికారాలు కల్పించడంతో నేడు ప్రతి పంచాయతీలో తప్పనిసరి అయ్యింది. గ్రామీణ స్థాయిలో పంచాయతీతో గ్రామస్తులు సమస్యల పరిష్కారం, ప్రణాళికలు, కార్యక్రమాలు, సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభ ఆమోదం తెలుపాలి. ఈ గ్రామసభ విధులు, పంచాయతీ షెడ్యూల్ 1996లో విశదీకరించారు.ఏ పంచాయతీ అయినా గ్రామసభ నిర్వహిస్తేనే ఆ పల్లెల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. గ్రామసభ ఏర్పాటుకు 500లోపు ఓటర్లు ఉంటే 50 మంది హాజరుకావాలి. వెయ్యిలోపు ఓటర్లు ఉంటే 75 మంది హాజరుకావాలి. మూడు వేలలోపు ఓటర్లు ఉంటే 150, ఐదువేల లోపు ఓటర్లు ఉంటే 200 హాజరుకావాలి. పదివేల లోపు ఉంటే 300, పదివేలకు పైగా ఉంటే 400 మంది గ్రామసభకు హాజరైతే ఆ సభకు కోరం పూర్తిగా ఉన్నట్లు. 1/10 శాతం సభకు హాజరైనప్పుడు ఆ సభ కోరం పూర్తై తీర్మానంలో ఆమోదం చేయాల్సి ఉంటుంది. గ్రామ సభను సర్పంచ్ ఆదేశాల మేరకు కార్యదర్శి ఏర్పాటు చేస్తారు. సర్పంచ్ హాజరుకాకపోతే సెక్షన్ (6)ఏ ప్రకారం ఉపసర్పంచ్ అధ్యక్షతన వహిస్తారు. గ్రామసభ సభ్యులు కోరితే సర్పంచ్ గ్రామసభ ఏర్పాటు చేయాలి. సభా కార్యక్రమాలను గ్రామ ముఖ్య భాషలోనే నిర్వహించాలి. సభా కార్యక్రమాల మినిట్‌ను సంబంధిత అధ్యక్షుడు రాయాలి. గ్రామసభకు హాజరైన సభ్యులు రిజిస్ట్రారులో సంతకాలు, వేలిముద్రలు వేయాలి. 1/10 వంతున సభ్యుల కోరిక మేరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవచ్చు. సర్పంచ్, ఉపసర్పంచ్ ఒకవేళ ప్రత్యేక సమావేశాలు నిర్వహించని సందర్భాల్లో జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. గ్రామ బడ్జెట్ ఆమోదంలో గ్రామసభ కీలక పాత్ర పోషిస్తున్నది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో గ్రామసభ మంచి నిర్ణయాలకు ఉపయోగపడుతుంది. చర్చనీయాంశాలపై చేతులు చూపడంతో మెజార్టీ తీర్మానాలు ఆమోదం పొందుతాయి. అధ్యక్షుడు తీర్మానాల పుస్తకంలో తీర్మానాలు రాసి సంతకాలు చేయాలి. గ్రామసభ నిర్వహణకు రెండు రోజులు ముందుగానే దండోరా వేయించి గ్రామసభ నిర్వహించే తేదీ, సమయం, స్థలం తప్పనిసరిగా తెలుపుతూ నోటీస్ తయారు చేయాలి. గ్రామసభలో ఆరు నెలల పాటు పరిపాలనా కార్యక్రమాలపై సమీక్ష ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంవత్సరానికి నాలుగు సార్లు గ్రామసభలు నిర్వహించాలి. లేకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు. తిరిగి ఏడాది పాటు ఎన్నికలకు అనర్హుడవుతాడు. గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రైవేట్ భవనంలో ఉన్నైట్లెతే మరో భవనంలోకి మారడానికి గ్రామపంచాయతీ తీర్మానం చేయాలి. 3/4 వంతున సభ్యులు ఆమోదం తెలుపాలి.శాసనసభల్లో జరిగే తీరుగానే గ్రామస్థాయిలో కూడా గ్రామసభ నిర్వహణ ఉంటుంది. ప్రజలతో నిర్వహించుకునే గ్రామసభతోపాటు గ్రామ పంచాయతీలో నిర్వహించే సభలో శాసన సభ్యుల వలె పాలకవర్గం సభ్యులు సమావేశంలో పాల్గొంటారు. చేపట్టే అభివృద్ధి పనులపై చర్చలు జరుపుతారు. వాదోపవాదనలు వినిపిస్తారు. 3/4 వంతు సభ్యులు సమస్యలను చర్చించి ఆమోదం తెలిపితే ఆ సమస్య పరిష్కారానికి నోచుకుంటుంది. పంచాయతీకి సంబంధించిన నిధులను తొలుత సభలో ప్రవేశపెట్టి ఏయే శాఖల రూపంలో నిధులు వచ్చాయి, వాటిని వినియోగించే క్రమాన్ని కూడా సభలో కార్యదర్శి ప్రవేశపెడతారు. సభ్యులంతా విన్నాక గత సమావేశంలో చర్చించిన అజెండా పరిష్కారం అయ్యిందా లేదా చర్చించి తదుపరి సమస్యలను కూడా సమావేశంలో చర్చిస్తారు. కొత్త చట్టంలో ప్రతీ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయడంతో పాటు హరిహారం మొక్కలను పెంచడం కూడా విధుల్లోనే భాగం చేశారు. అందువల్ల 80 శాతం మొక్కలు పంచాయతీ పరిధిలోనే బతికించే విధంగా కార్యదర్శి జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్‌కు కూడా చెక్ పవర్ కల్పించారు.