మోడీని ప్రాంతీయ పార్టీలు ‘మింగనున్నాయా’!!

మోడీని ప్రాంతీయ పార్టీలు ‘మింగనున్నాయా’!!

——————————

2022 నాటికి ప్రాంతీయ పార్టీలన్నింటినీ మింగేయాలన్నది బిజెపి లక్ష్యం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాషాయ జెండా రెప రెప లాడాలన్నది ఆ పార్టీ అత్యాశ. కాంగ్రెస్‌ కన్నా ప్రాంతీయపార్టీలే ప్రమాదకరమని మోడీ భావిస్తున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అరకొరగా సహాయసహకారాలు అందుతున్నవి. పదే పదే అడిగితే కొసరి కొసరి కొంత సాయం చేస్తున్నారు. మిగతా ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. తెలంగాణలో ప్రతిష్టాత్మక ‘మిషన్ భగీరథ’ , ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాలకు నిధులివ్వాలని ‘నీతి ఆయోగ్’ సిఫారసు చేసినా కేంద్రం మొండి చెయ్యి చూపింది.అయితే తన ప్రణాళికే తనకు రివర్స్ అయినట్టుగా ‘ప్రాంతీయ పార్టీలే’ మోడీ కొంప ముంచబోతున్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

—————–

ఎస్.కె.జకీర్.

ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో 200 మంది రుత్వికులతో జనవరి 21 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు 5 రోజులపాటు సీఎం కేసీఆర్ ‘సహస్ర చండీయాగం’ నిర్వహించనున్నారు. ‘బంగారు తెలంగాణ’ కల సాకారం అయ్యేలా అమ్మవారి అనుగ్రహం కోసం కేసీఆర్ ‘సహస్ర హోమాలు’ చేయనున్నారు. ఈనెల 25 వ తేదీన పూర్ణాహుతి నిర్వహిస్తారు. ‘మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం’ తో ఫెడరల్ ఫ్రంట్ విజయవంతమవుతుందని, కేసీఆర్ జాతీయస్థాయిలోనూ తిరుగులేని నాయకుడు అవుతారని టిఆర్ఎస్ కార్యకర్తలు,కేసీఆర్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు నిర్వహించిన ‘రాజశ్యామల యాగం’ వల్లనే అఖండ మెజారిటీతో తాను మరోసారి ముఖ్యమంత్రి అయినట్టు కేసీఆర్ నమ్మకం. కేసీఆర్ ఏ మూహూర్తాన ‘ఫెడరల్ ఫ్రంట్’ ప్రకటన చేశారో ఆ ‘ఫ్రంట్’ కు అనుకూలమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతున్నట్టు కనిపిస్తున్నది. కోల్‌కతాలో ఈ నెల 19 న ఎన్డీఏ వ్యతిరేక ర్యాలీని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలపెట్టారు. టీడీపీ, టిఆర్ఎస్ అధ్యక్షులు చంద్రబాబు, కేసీఆర్ లను కూడా ఆమె ఆహ్వానించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, నేషనల్ కాన్ఫరెన్స్, డిఎంకె, టిడిపి, జెడి ఎస్, ఎన్సిపి తదితర పార్టీల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. కేసీఆర్ కోల్ కతా ర్యాలీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ కు శత్రువు. చంద్రబాబుకు జగన్ శత్రువు. కనుక జగన్ కేసీఆర్ కు మిత్రుడే కదా!జగన్, టిఆర్ఎస్ ల మధ్య బుధవారం చర్చలు బహిరంగంగా జరిగాయి తప్ప కేసీఆర్, జగన్ ల మధ్య ‘ మైత్రీ బంధం’ చిగురించి చాలా కాలమే అయింది. ఇటీవలి తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మీడియాలో టిఆర్ఎస్ ప్రచారానికి సంబంధించిన ‘కవరేజ్’ ను పరిశీలిస్తే ఆ విషయం అర్దమవుతుంది. ఎన్నికలు ముగిసీ, ముగియగానే కేసీఆర్ కు జగన్ ఫోన్ లో శుభాకాంక్షలు తెలియజేశారు. తానే ఫోన్ చేసి కేసీఆర్ తో మాట్లాడానని జగన్ స్వయంగా చెప్పుకున్నారు. ” ఆంధ్రప్రదేశ్ లో 25 మంది ఎంపీలున్నారు. తెలంగాణలో 17 మంది ఎంపీలున్నారు. వీరందరూ పార్లమెంటులో మాట్లాడితే ప్రత్యేక హోదా తప్పక వస్తుంది. అందుకే నేను కేసీఆర్ కి మద్దతు పలుకుతున్నాను ” అని జగన్ చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ బృందం జగన్‌తో భేటీ అయ్యింది. ఫెడరల్ ఫ్రంట్‌ లో చేరవలసిందిగా జగన్ ను కేటీఆర్ కోరారు. అందుకు జగన్ సానుకూలంగా స్పందించారు.భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు మమతా బెనర్జీ చొరవ తీసుకుంటున్నారు. అసోం జాతీయ పౌరుల రిజిస్టర్‌ను భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు వాడుకుంటూ బెంగాల్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారన్నది ఆమె ఆరోపణ. ‘మోడీవ్యతిరేక ప్రాంతీయ పార్టీల కూటమి’ ప్రయత్నాలకు తుది రూపు కోల్‌కతాలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైన పార్టీల నేతలందరూ కోలక్‌తా ర్యాలీకి హాజరవనున్నారు. అందరూ కలిసి ‘ఫ్రంట్‌’ ను ప్రకటించే అవకాశం ఉంది. దేశ రాజకీయాల్లో ఓ కొత్త అంకం ప్రారంభమవుతున్నది. ఏ పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ మెజార్టీ తెచ్చుకునే అవకాశాలు లేనందున అధికారాన్ని అందుకోవడమో, లేదా అధికారాన్ని అందించడమో ‘ప్రాంతీయ పార్టీల కూటమేనిర్ణయించనున్నట్టు ఢిల్లీ రాజకీయవర్గాలు భావిస్తున్నవి. మోడీని ఢీ కొట్టడానికి ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడుతున్నది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా ఇంచు మించు ఇదే స్వరాన్ని వినిపిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమికి స్టాలిన్ నేతృత్వం వహించాలంటూ కరుణానిధి స్మారక సభలో అబ్దుల్లా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా అద్వానీ వర్గం పావులు కదుపుతున్నది. ఆ పార్టీకి ఆయువుపట్టు అయిన ఉత్తర భారతాన ఓడిపోవటంపై మోడీ వ్యతిరేక వర్గాలన్నీ ఆగ్రహంతో ఉన్నవి.తాజా పరిణామాలతో ఆడ్వాణీ వర్గం చురుగ్గా కనిపిస్తున్నది. ఫలితాలపై పార్లమెంటరీ పార్టీ వంటి వేదికలౖపె సమీక్షించలేదు. మోదీ, అమిత్‌ షా అహంభావంతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రావడం కొత్తేమీ కాదు. ”వారిద్దరే నిర్ణయాలు తీసుకుంటే ఇక మేమెందుకు?’’అని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ”బీజేపీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించినవి. వాటిని నెరవేర్చే ప్రయత్నమే జరగలేదు” అని ఒక టీవీ షో లో కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీ విమర్శలు గుప్పించడం మోడీని ‘టార్గెట్’ చేసుకొని సాగినవే. ”అధికారంలోకి వస్తామన్న నమ్మకం మాకు లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. మేం అధికారంలోకి రావ‌డంతో ఇప్పుడు ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు” అని కూడా ఆయన అన్నారు. మోడీ స్థానంలో గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ‘ప్రొజెక్ట్’ చేసే కార్యకలాపాలు ఆ పార్టీలో ప్రారంభమైనవి. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ ను తీసుకు రావాలన్న డిమాండుకూ మద్దతు పెరుగుతున్నది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీ, సంఘ్‌ పరివార్‌ వర్గాలను కలవరపెడుతున్నవి. పార్టీ భవిష్యత్‌ గురించి అంతర్మథనం జరుగుతున్నది. ఈ ఫలితాలపై పార్టీ సీనియర్‌ నాయకులు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషిలతో పలువురు నాయకులు అంతర్గతంగా సమీక్షించారు. నరేంద్రమోదీ, అమిత్‌ షా ప్రచారం వల్ల ఒరిగిందేమీ లేదని, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల్లో స్థానిక నాయకత్వం బలంగా పనిచేసినందువల్ల పరాజయం పాలైనప్పటికీ గౌరవం దక్కించుకున్నామని బీజేపీ నేతల భావన. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 2009 లో వచ్చినట్లుగా 116 సీట్లు మాత్రమే వస్తాయని ఒక వర్గం అంచనా. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల్లో గతంలో వచ్చినట్టుగా 62 సీట్లు రావు. సీట్ల సంఖ్య సగానికి తగ్గిపోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నవి. 2014లో యూ. పీ నుంచే 71 సీట్లను బిజెపి గెలుచుకోగలిగింది. ఇప్పుడా సీన్ లేదు. బీజేపీకి పాతిక సీట్లు రావడమూ కష్టమవుతుందని కొందరు బిజెపి ఎంపీలే అంటున్నారు. బిహార్‌ లోనూ బిజెపికి వ్యతిరేకంగా పొత్తులు ఏర్పడ్డాయి. అక్కడ 2014 లో 22 సీట్లు గెలుచుకున్న బీజేపీ బలంగా దెబ్బతినవచ్చు. గత ఎన్నికల్లో గుజరాత్‌లో 26 కు 26 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి సగానికి పడిపోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ సాధించిన అఖండ మెజారిటీ వల్ల బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవచ్చును. పంజాబ్‌, ఢిల్లీ,అసోం, గోవా, హర్యానా, హిమాచల్‌, జమ్ముకాశ్మీర్‌, జార్ఖండ్‌, కర్ణాటక, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లు గెల్చుకున్నది. కానీ ఈసారి 25 నుంచి 30 లోక్ సభ సీట్లను సాధించడం గగనమేనన్నది విశ్లేషణ. ఒడిషాలో కొంత మెరుగు పడినప్పటికీ నాలుౖగెదు సీట్ల కంటే బిజెపి ఖాతాలోకి ఎక్కువ రాకపోవచ్చు. పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ ఒకటి, రెండు సీట్ల కంటే ఎక్కువ గెలవకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో 180 – 200 సీట్లక్లు మించి రావని కొందరు రాజకీయ ప్రముఖుల అంచనా ఒడిషాతో కలుపుకుంటే దక్షిణాదిలోనే 75 సీట్లను ప్రాంతీయ పార్టీలు గెలుచుకునే అవకాశాలున్నట్టు బిజెపి పండితులంటున్నారు.దేశ‌వ్యాప్తంగా బీజేపీపై ప్ర‌జ‌ల్లో రోజురోజుకు తీవ్ర వ్య‌తిరేక‌త పెరుగుతున్నందున అగ్రకులాల్లోని ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ల అస్త్రాన్నిమోడీ సంధించారు. కానీ ఈ చర్య ఇతర సామాజికవర్గాలలో బిజెపిపై మరింత కోపానికి కారణం కానుంది. తగ్గిపోతున్న తన ‘గ్రాఫ్’ ను కాపాడుకోవడానికి మోడీ ‘మ్యాజిక్’ చేయాలనుకుంటున్నారు. తమకు మ్యాజిక్ వద్దు, ‘లాజిక్’ కావాలని జనం కోరుతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా ఈ లోపు ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన పాత్ర పోషించనున్నది. కాంగ్రెస్‌ అవినీతితో, కుంభకోణాలతో భ్రష్టుపట్టిపోయిందన్న బిజెపి కూడా ‘రాఫెల్’ స్కాం తో తానూ ఆ ‘తాను ముక్కే’ నాని రుజువు చేసుకున్నది. కాంగ్రెస్‌కన్నా బిజెపి, సంఘపరివార్‌ శక్తులు ప్రమాదకరమైనవని ప్రజాస్వామిక వాదులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతితో, అంతఃకలహాలతో పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశలో తెలుగుదేశం పార్టీ పుట్టుక. అయితే 2022 నాటికి వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను కబళించి, అంతటా బిజెపి జెండా ఎగరాలన్నది బిజెపి అత్యాశ. కాంగ్రెస్‌ కన్నా ప్రాంతీయపార్టీలే లక్ష్యంగా మోడీ ఆలోచనలు సాగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అరకొరగా సహాయసహకారాలు అందుతున్నవి. పదే పదే అడిగితే కొసరి కొసరి కొంత సాయం చేస్తున్నారు. మిగతా ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. తెలంగాణలో ప్రతిష్టాత్మక ‘మిషన్ భగీరథ’ , ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాలకు నిధులివ్వాలని ‘నీతి ఆయోగ్’ సిఫారసు చేసినా కేంద్రం మొండి చెయ్యి చూపింది. ”కేంద్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్రానికి సాయం చేశారా లేదా, మళ్లీ మోడీని మీరు ప్రధానిగా చూడాలనుకుంటున్నారా” లాంటి ప్రశ్నలకు దాదాపు వంద శాతం నెగెటివ్ ఆన్సర్లు ఇచ్చిన రాష్ట్రం ఏపీ. తెలంగాణలోనూ అదే స్థాయిలో కేంద్రప్రభుత్వంపైనా, మోడీ పైనా వ్యతిరేకత ఉన్నది. అనిల్ అంబానీకి ‘రాఫెల్’ డీల్ క‌ట్ట‌బెట్టిన వైనంతో మోడీకి ‘మకిలి’అంటింది. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, పెట్రో ధ‌ర‌లు వంటి వాటితో జ‌నానికి నేరుగా ఆర్ధిక భారం త‌గులుతున్నా ఇదంతా దేశ శ్రేయ‌స్సుకే అని ప్రజల్ని నమ్మించడానికి మోడీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. సీబీఐ, సుప్రీం కోర్టు, ఆర్బీఐ వంటి వ్య‌వ‌స్థ‌ల్లో అప‌స్వ‌రాలు మచ్చను తెచ్చాయి. కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ లో సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ గా పిలిచిన దాఖ‌లాలున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుల్లోని ‘హ‌స్త‌’వాసిని సామాన్యులు గుర్తించ‌లేదేమోగానీ లోపాయికారిగా కొన్ని ఘ‌ట‌న‌లు లేక పోలేదు. ఇక ఆర్బీఐ… టీటీడీ నిల్వ‌ల మీదే క‌న్నేసిన దుస్తితి ఆనాడే ఉంది. మాల్యాలాంటి వాళ్లు కోటాను కోట్లు అప్పులు చేసింది ఎప్పుడో ఈ దేశ‌ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసు. అమిత్ షా కొడుకు వ్య‌వ‌హారంలో గ‌ట్టిగా లెక్క బ‌య‌ట‌కు తీస్తే వంద‌ల వేల కోట్లేం లేవు. మంత్రుల్లో అరుణ్ జైట్లీ, నిర్మ‌లా సీతారామన్ వంటి ఒక‌రిద్ద‌రు త‌ప్ప గొప్ప‌గా బ‌య‌ట‌కొచ్చి మాట్లాడే కేంద్ర మంత్రులే లేరు. బీజేపీకి 2019 కి గ‌డ్డుకాలంగానే తెలుస్తోంది. ఎమ్మెల్యేల‌ను కొని వాళ్ల ద్వారా అధికారం హ‌స్త‌గ‌తం చేసుకుంటే త‌ర్వాత ఆ ప్ర‌భావం లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప‌డుతుంద‌ని క‌ర్ణాట‌క‌లో మ‌డి కట్టుకున్నట్టు అందరూ భావించారు. కానీ ‘ఆపరేషన్ కమలం’ జనవరి రెండో వారంలో ప్రారంభం కావడంతో కర్ణాటకలో బిజెపి కార్యకలాపాలు కళంకితమవుతున్నవి. 2009, 2014ల్లో బీజేపీ కాంగ్రెస్ సీట్ల షేర్ ర‌మార‌మీ 320 సీట్లు. ఈ సీట్ల‌లో పోయిన సారి బీజేపీ అత్య‌ధికంగా 288 సాధించి.. కాంగ్రెస్ ను కేవ‌లం 44కు ప‌రిమితం చేయ‌గలిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ దూకుడుగా ఉన్నది. చంద్రబాబు వంటి మిత్రులు రహెహుల్ గాంధీకి లభించారు. తాను ఎన్డీయే కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ ప్రకటించడం ఒక పరిణామం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా నాగ‌పూర్ ‘సంస్థానం’ ప్ర‌క‌టిస్తుందా? లేక యోగిలాంటి కొత్త మొహాన్ని ప‌రిచ‌యం చేసే నిర్ణ‌యం తీసుకుంటుందా? మధ్యే మార్గంగా గడ్కరీని బరిలోకి దింపుతారా అన్నది సస్పెన్సు.మాములుగా ‘మోడీ- షా’ ద్వ‌యం త‌మ‌ ద‌గ్గ‌ర ఎన్నో జిత్తులు సిద్ధం చేసి పెట్టుకుని ఉండి ఉంటారు. షా అయితే సాక్షాత్ శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తూ మొన్న‌టి వ‌ర‌కూ మోడీని అప‌జ‌యమే ఎరుగ‌ని ‘కిరీటి’ గా నిలుపుతూ వ‌చ్చారు. ఈ అభిన‌వ కృష్ణార్జునుల‌కు క‌ష్ట‌కాలం మొద‌లైన‌ది.ఎన్నికల వ్యూహ‌క‌ర్త‌, ప్ర‌స్తుత జ‌న‌తాద‌ళ్ యూ నేత ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన‌ట్టు ”బీజేపీ మ‌రీ అంత బ‌ల‌హీనంగా ఏం లేదు, కాకుంటే 2014 అంత బ‌లంగా లేదు. 2004, 2009 ఎన్నిక‌ల‌కంటే మెరుగ్గా ఉంది”. చంద్రబాబు కూడ‌గ‌డుతున్న కూట‌మిలోనూ మోడీకి ఉప‌యోగ ప‌డే ‘శిఖండి’ లేడు. మ‌రి మోడీని ‘ప్రాంతీయపార్టీల’ గండం నుంచి గట్టెక్కించగల వారెవరు?

ఎడిటర్
తెలంగాణకమాండ్.కామ్

(‘ప్రజాపక్షం’సౌజన్యంతో)